Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

శరవేగంగా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల పూర్తి

సమీక్షా సమావేశంలో మంత్రి వేముల

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శరవేగంగా, సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పురోగతిపై హైదరాబాద్‌లోని ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. వరంగల్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రితోపాటు ఎల్బీనగర్‌ టిమ్స్‌, అల్వాల్‌ టిమ్స్‌, సనత్‌ నగర్‌ టిమ్స్‌ తదితర అసుపత్రుల నిర్మాణాలపై చర్చించారు. వరంగల్‌ సూపర్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పురోగతిపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అవసరమైతే ఎక్కువమంది కార్మికులను నియమించుకోవాలని సూచించారు. జూన్‌ 22న తాను వరంగల్‌ హాస్పిటల్‌ పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకొస్తే ఎంతో మంది పేద ప్రజలకు మెరుగైన వైద్యం లభిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ధారించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని వర్క్‌ ఏజెన్సీని,ఆర్‌ అండ్‌బీ అధికారులను మంత్రి అదేశించారు. అనంతరం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న టిమ్స్‌ ఆసుపత్రుల పురోగతిని మంత్రి తెలుసుకున్నారు. ఎల్బీనగర్‌లో చేపట్టిన వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ఈనెల 26 వరకు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. అల్వాల్‌లో చేపట్టిన 1200 పడకల ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సనత్‌ నగర్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ స్ట్రక్చరల్‌ డిజైన్స్‌ను పరిశీలించారు. ఈనెల 29న అల్వాల్‌,సనత్‌ నగర్‌ హాస్పిటల్స్‌ నిర్మాణ సైట్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని మంత్రి వేముల చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img