Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

అంజాన్‌కు కడపటి వీడ్కోలు

. వివిధ పార్టీల నేతల శ్రద్ధాంజలి
. వేలాది మంది నివాళి

లక్నో : అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ప్రధాన కార్యదర్శి, సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్‌ అంజాన్‌కు వేలాది మంది అశ్రునయనాలతో కడపటి వీడ్కోలు పలికారు. తమ సమస్యల పరిష్కారానికి అవిరళ కృషి చేసిన నాయకుడు ఇకలేడనే విషయం జీర్ణించుకోలేని రైతు, కార్మిక, కష్టజీవులు, పేద, మధ్యతరగతి వర్గాలు కన్నీరుమున్నీరయ్యాయి. అంజాన్‌ భౌతికకాయంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా అరుణపతాకాన్ని, ఏఐకేఎస్‌ అధ్యక్షులు రావుల వెంకయ్య రైతు సంఘం పతాకాన్ని కప్పి, పూల గుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌, సీపీఐ జాతీయ కార్యదర్శులు పల్లవ్‌సేన్‌ గుప్తా, రామకృష్ణ పాండా, కార్యవర్గ సభ్యులు అనీ రాజా, గిరీశ్‌ శర్మ, రాజ్యసభ సభ్యులు సంతోశ్‌ కుమార్‌, ఏఐకేఎస్‌ (సీపీఎం) ప్రధాన కార్యదర్శి బిజు కృష్ణన్‌, సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తదితర పార్టీల నాయకులు అంజాన్‌ భౌతికకాయాన్ని సందర్శించి పూల మాలలు ఉంచి నివాళులర్పించారు. రైతు, పేద, మధ్యతరగతి ప్రజల సమస్యల పరిష్కారానికి అంజాన్‌ చేసిన అవిశ్రాంత కృషిని ఈ సందర్భంగా మననం చేసుకున్నారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అతుల్‌ కుమార్‌ అంజాన్‌ గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత లక్నోలోని ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అంజాన్‌ భౌతికకాయాన్ని శనివారం ఉదయం ఆసుపత్రి నుంచి ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ కొంత సేపు ఉంచి కుటుంబ సభ్యులు నివాళి అర్పించిన తరువాత ఉదయం 10 గంటలకు ఇక్కడి సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి తరలించి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచారు. అక్కడ సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అంజాన్‌ బంధుమిత్రులు, అభిమానులు, సన్నిహితులు వేలాది మంది భౌతికకాయాన్ని సందర్శించి తమ అభిమాన నాయకుడికి నివాళులర్పించారు. అతుల్‌ కుమార్‌ అంజన్‌ అమరరహే, అమరరహే, సాధిస్తాం అంజాన్‌ ఆశయాలు, రెడ్‌ శాల్యూట్‌ అంజాన్‌ అన్న నినాదాలతో సీపీఐ కార్యాలయం మారుమోగింది. ఈ సందర్భంగా అంజాన్‌ సేవలను వారు గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం దేశంలో రైతు ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి తీరనిలోటుగా పేర్కొన్నారుఅరవై ఏళ్లు పైబడిన రైతులకు పెన్షన్‌ రావడం అతుల్‌ కృషేనని గుర్తుచేసుకున్నారు. మూడు వ్యవసాయ దుష్ట చట్టాలు రద్దు చేయాలని కొన్నివందల రైతు సంఘాలు సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వంలో జరిగిన మహత్తర పోరాటంలో అతుల్‌ ప్రముఖపాత్ర నిర్వహించారన్నారు. వేలాది మంది అశ్రునయనాల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు అంజాన్‌ భౌతికకాయాన్ని లక్నోలోని విద్యుత్‌ శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉన్న కారణంగా అంతిమయాత్ర, సంతాప సభ నిర్వహించలేకపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img