బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆయన ఎక్స్ ద్వారా దీపావళి సందేశాన్ని పంచుకున్నారు. అందులో డెమోక్రటిక్ అభ్యర్థి, తన ప్రత్యర్థి కమలా హారిస్‌పైనా విమర్శలు గుప్పించారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను ఆమె విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. అక్కడ వారిని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన హయాంలో అలా జరగదని, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా హారిస్, జో బైడెన్ విస్మరించారని విమర్శించారు. వారు ఇజ్రాయెల్ నుంచి ఉక్రెయిన్, మన దక్షిణ సరిహద్దు వరకు విపత్తు కలిగించారని, కానీ తాము అమెరికాను మళ్లీ బలోపేతం చేస్తామని, తిరిగి శాంతి నెలకొల్పుతామని ట్రంప్ ఆ పోస్టులో పేర్కొన్నారు.