Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి

సిఆర్పిఎఫ్ 234/B బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ వినీత

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) దత్తత గ్రామమైన కూర్మన్నపాలెం కి చెందిన గిరిజన యువతకు తమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం లో మూడు మాసాలపాటు అందించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ తో గ్రామానికి చెందిన ముగ్గురు యువకులకు ఉద్యోగ అవకాశాలు రావడం తమకంతో సంతృప్తిని కలిగించిందని సిఆర్పిఎఫ్ 234 బెటాలియన్ బి కంపెనీకి చెందిన అసిస్టెంట్ కమాండెంట్ వినీత అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ ప్రజారక్షణలో పోలీసు వ్యవస్థ పాత్ర కీలకం అన్నారు. అటువంటి పోలీసు వ్యవస్థలో సిఆర్పిఎఫ్ మరో అడుగు ముందుకు వేసి అభివృద్ధికి ఆమడ దూరాన ఉన్న గిరి గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు ఆ గ్రామాల అభివృద్ధి, ఆ గ్రామంలో ఉన్న ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో సేవలు అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా యువత సన్మార్గంలో పయనించేలా వారి భవిష్యత్తును బంగారు బాట చేసుకునేలా సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇప్పించడం జరుగుతుందని అందులో భాగంగానే కూర్మన్నపాలెం గ్రామంలోని యువకులు మూడు నెలల పాటు విశాఖపట్నంలో శిక్షణ పొందారన్నారు. వారిలో ముగ్గురు ప్రస్తుతం ఉద్యోగాలు చేసుకుని ఉపాధి పొందుతున్నారన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img