Friday, June 14, 2024
Friday, June 14, 2024

పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం

డిప్యుటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి
సారికలో 3,600 ఇళ్ల పట్టాల పంపిణీ
విశాలాంధ్ర-విజయనగరం :
సొంత ఇళ్లు కట్టుకోవాలన్న పేదల కలలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని, రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కులమతవర్గ విచక్షణ లేకుండా, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీఒక్కరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. విజయనగరం మండలం సారిక వద్ద రూపొందించిన గృహనిర్మాణ లే అవుట్‌లో, సుమారు 3,600 మందికి పండగ వాతావరణంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి, పేద కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నారని చెప్పారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి ఆదేశం మేరకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీని ప్రారంభించామని అన్నారు. ఎటువంటి వివక్షత లేకుండా, నిజాయతీగా, పారదర్శకంగా పరిపాలన అందిస్తూ, అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఇతర సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని చెప్పారు. ప్రజోపయోగం కోసమే రాజకీయాలు చేయడం తమకు మొదటి నుంచీ అలవాటని, నిస్వార్థంగా సేవలను అందిస్తున్నామని అన్నారు. అందువల్లే ఒక సామాన్య కార్యకర్త నుంచి, ప్రజల ఆదరాభిమానంతో తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను ఇచ్చిన చంద్రబాబునాయుడు, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశారని చెప్పారు. ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని, చేసిన అభివృద్దే కొలమానం తప్ప, గతంలో లాగ కళ్లబొల్లి కబుర్లు చెబితే నమ్మే రోజులు పోయాయని కోలగట్ల స్పష్టం చేశారు.
జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ, దేశంలో మరెక్కడా లేని విధంగా, మన రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిందని చెప్పారు. రాష్ట్రంలో అతిపెద్ద లేఅవుట్‌లో ఒకదాన్ని గుంకలాంలో రూపొందించి, ముఖ్యమంత్రి చేతులమీదుగా పట్టాలను పంపిణీ చేశామన్నారు. సారికవద్ద సుమారు 120 ఎకరాల్లో, 4 వేల ప్లాట్లతో మరో లేఅవుట్‌ను రూపొందించామని చెప్పారు. ఒక్కో పేద కుటుంబానికి సుమారు రూ.6లక్షల విలువైన స్థలాన్ని ఉచితంగా ఇవ్వడంతోపాటు, వారు ఇళ్లు కట్టుకోడానికి రూ.లక్షా, 80వేల ఆర్థిక సాయాన్ని, ఉచితంగా ఇసుకను కూడా అందించడం జరుగుతోందని చెప్పారు. లేఅవుట్‌లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని జెసి కోరారు.
సభకు అధ్యక్షతన వహించిన ఎంపిపి మామిడి అప్పలనాయుడు, విజయనగరం మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు మాట్లాడారు. ఇళ్ల స్థలం కోసం గానీ, ఇంటి నిర్మాణం కోసం గానీ, ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వలేదని, ఇకముందు కూడా ఇవ్వబోమని, ఇష్టదైవం సాక్షిగా లబ్దిదారులచేత కోలగట్ల ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ ఎంవి సూర్యకళ, డిప్యుటీ మేయర్‌ ఇసరపు రేవతీదేవి, జెడ్‌పిటిసి కెల్ల శ్రీనివాసరావు, హౌసింగ్‌ పిడి ఎస్‌వి రమణమూర్తి, మండల ప్రత్యేకాధికారి అరుణకుమారి, తాశీల్దార్‌ సిహెచ్‌ బంగార్రాజు, ఎంపిడిఓ జి.వెంకటరావు, ఇతర మండల స్థాయి అధికారులు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img