Monday, May 20, 2024
Monday, May 20, 2024

డ్వాక్రా సంఘాలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏర్పాటు

విశాలాంధ్ర – విజయనగరం అర్బన్: డ్వాక్రా సంఘాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని తెలుగు మహిళా కమిటీ సభ్యులు సువ్వారి అనురాధ బేగం, పత్తిగిల్లి సూర్యకుమారి అన్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు , నియోజకవర్గ ఇంచార్జ్, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సూచన మేరకు తెలుగు మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం 42, 43 , 44వ డివిజన్ లలో “డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశము” నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ని స్థాపించిన తరువాతే మహిళలకు గుర్తింపు వచ్చిందని, మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించారని, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం, తరువాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేసారని, గ్యాస్ కనెక్షన్లు వంటివి ఇచ్చారని తెలిపారు. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా సాధికారత దిశగా తెలుగుదేశం జనసేన పార్టీ లు ఉమ్మడిగా ప్రకటించిన “కలలకు రెక్కలు” అనే సరికొత్త పధకం గురించి చెబుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పధకం ప్రధాన లక్ష్యం అని వివరించారు.
ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు వంటివి విపరీతంగా పెరిగాయని, మహిళలకు రక్షణ కల్పించడం లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారికి మీరంతా మద్దతు తెలుపుతూ సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని మహిళలందరికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా కమిటీ సభ్యులు పద్మలత, స్థానిక నాయకులు బూర్లె భాస్కర్, పడాల జోగేష్, మజ్జి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img