Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

వైసీపీలో ఇంటిపోరు

సొంత నేతలపైనే తిరుగుబావుటా
రెండున్నరేళ్ల లోపే కేడరులో అసంతృప్తులు
అనంత, నెల్లూరు, కడప, విజయవాడలో రోడ్డెక్కిన నేతలు
ప్రభుత్వం, పార్టీ పెద్దలపై ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండ్నురేళ్లలోపే, ఆ పార్టీ సొంత కేడరులో ఆగ్రహావేశాలు, అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల నుంచి దిగువ స్థాయి పార్టీ శ్రేణుల వరకు పార్టీ అధినేతలపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇటీవల నుంచి జిల్లాల వారీగా వైసీపీ శ్రేణులే మీడియా ముందుకు వచ్చి, పార్టీని చక్కదిద్దాలంటూ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిణామాలతో కేడరులో కొంత అసంతృప్తి నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవ్వరూ తమను ఖాతరు చేయడం లేదని, నామినెటెడ్‌ పదవుల్లో వారు సూచించిన వారికే కట్టబెట్టాలని నిరసనకు దిగుతున్నారు. ఒక వైపు సీఎం జగన్‌ను తాము అభిమానిస్తామంటూనే, మరోవైపు నియోజకవర్గాల్లోని సొంత నేతలపై కన్నెర్రజేస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేల నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ మీడియా ముందుకు వచ్చి, వైసీపీ ప్రజాప్రతినిధులపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అవినీతిని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శించారు. ప్రతిదానికీ, ప్రతి చిన్న పోస్టుకూ ముడుపులు స్వీకరిస్తున్నారని తదితర సమస్యల్ని మీడియా ముందుకొచ్చి వ్యాఖ్యానించడం ఆధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు నెలకొనడంతో అటు స్థానిక ప్రజలకు పనులు అవ్వక, ఇబ్బందులకు గురవుతున్నారు.
ఏకంగా సీఎంపైనే ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలు
అనంతపురం జిల్లాకు చెందిన కేతిరెడ్డి ఏకంగా సీఎం జగన్‌ వ్యవహార శైలిపైనే ధ్వజమెత్తిన తీరు అది సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. ఇలా ఒకరిద్దరు సొంత పార్టీ నుంచి విమర్శించారంటే అవి వ్యక్తిగతంగా భావించవచ్చు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వరుస వారీగా ఇదే పంథాలో సొంత నేతలే రోడ్డెక్కుతున్నారు. కడప జిల్లా బద్వేలు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి వైసీపీ నేతల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఆయన వైసీపీలోనే కొనసాగుతూ, సాటి నేతల వైఖరిపై అసంతృప్తి చెందారు. అనర్హులకు నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టారని, వ్యవసాయ రంగంలో అనుభవం లేని వారికి అక్కడ చోటు ఇచ్చారని దుయ్యబట్టారు. గతంలో వైసీపీ ఆవిర్భావ సమయంలో కడప ఎంపీగా జగన్‌పై డీఎల్‌ రవీంద్రారెడ్డి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేదు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ గూటికి డీఎల్‌ చేరి, కడప జిల్లాలోని ఆ పార్టీ గెలుపునకు సహకరించారు. ప్రస్తుతం ఆయనకు ప్రభుత్వం, పార్టీ తరపున తగినంత గుర్తింపు లభించడం లేదని వాపోయారు. విజయవాడలోని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు మిగిలిన వైసీపీ ప్రజాత్రినిధులు, నేతల తీరుపై సొంత పార్టీ నేతలు నడిరోడ్డుకు వచ్చారు. వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర నేతలు కాలే పుల్లారావు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నేతలు సమావేశం నిర్వహించి, స్థానిక ప్రజాప్రతినిధులు తమ అగౌరపరిచేలా వ్యవహరిస్తున్నారని వాపోయారు. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల వరకు ఓటింగ్‌ ఉన్న ఎస్సీలను సొంత పార్టీ నేతలే చులకనగా చూస్తున్నారని, వారి అభివృద్ధికి కృషి చేయడం లేదని మండిపడుతున్నారు. సీఎం జగన్‌ జోక్యం చేసుకోకుంటే ఈ వ్యవహారం మరింత ముదిరిపాకాన పడే ప్రమాదముంది. ఈ రచ్చ కాస్త ఆధిష్టానానికి చేరినట్లు స్పష్టమైంది. వైసీపీకి ఓటు బ్యాంకింగ్‌ ఉన్న ఎస్సీలు ఇలా రోడ్డెక్కడంపై సర్వత్రా చర్చానీయాంశమైంది. ప్రకాశంజిల్లాలో వైసీపీకి చెందిన చాలా మంది నేతలు టీడీపీలో చేరారు. అక్కడ గ్రూపు విభేదాలే కారణంగా తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణ ముందు నేతలకు రaలక్‌
రాష్ట్రంలో రెండ్నురేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ కొనసాగనుంది. దీంతో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలంతా మంత్రి పదవుల కోసం పోటీపడుతున్నారు. ఇదే అదునుగా అసంతృప్తి నేతలంతా ఆయా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై నిరసనలు తెలిపి, ప్రభుత్వానికి సంకేతాలు పంపేందుకు సిద్ధమయ్యారు. అనంతపురం, నెల్లూరు, కడప, విజయవాడలో ఈ తరహా సంఘటనలు ఎదురయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతల్లో పెద్దఎత్తున విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది. దీనికి కారణం మంత్రుల ఏక నాయకత్వమే కారణమే వాదనలున్నాయి. ఎన్నికల్లో పనిచేసిన వారిని పక్కనబెట్టి, సొంత వారికే అందలం వేయలేకపోవడంపై నేతలు గుర్రుగా ఉన్నారు. చిన్నపాటి కాంట్రాక్టు పనులను, ఇతరత్రా అవసరాలకు స్థానిక పార్టీ శ్రేణులకు ప్రజాప్రతినిధులు సహకరించక పోవడంపై వైసీపీలో ఆగ్రహావేశాలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img