Friday, May 10, 2024
Friday, May 10, 2024

విశాఖ కేంద్రంగా పాలన

. సామాజిక భద్రతకు పెద్దపీట
. 9 ముఖ్యమైన హామీల రూపకల్పన
. పాత పథకాల కొనసాగింపు-విస్తరణ
. అమ్మఒడి రూ.17 వేలకు పెంపు
. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు విద్య, వైద్యం, ఇళ్లు
. 500 మంది ఎస్సీలు ఉంటే ప్రత్యేక పంచాయతీలు
. లారీ, ట్రిప్పర్‌ డ్రైవర్లకు వాహనమిత్ర
. వైసీపీ మేనిఫెస్టో విడుదల

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ పరిపాలన రాజధానిగా పాలన చేపడతామని, రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా విశాఖను తీర్చిదిద్దుతామని వైసీపీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. దాంతోపాటు అమరావతిని శాసన రాజధానిగాను, కర్నూలును న్యాయ రాజధానిగాను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. నవరత్నాల కొనసాగింపు(2.0), విస్తరణతో వైపీపీ మేనిఫెస్టో 2024 రూపొందించారు. 2019 మేనిఫెస్టోలోని అంశాలతోపాటు కొద్దిపాటి మార్పులు, చేర్పులతో మేనిఫెస్టోను కూర్పు చేశారు. సామాజిక భద్రతకు పెద్దపీట వేశారు. విద్యా, వైద్య రంగాలు, సంక్షేమపై ప్రత్యేక దృష్టి సారించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో 9 ప్రధానమైన హామీలతో వైసీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ శనివారం విడుదల చేశారు. మేనిఫెస్టోను ఆయన బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతగా అభివర్ణించారు. 2019 తరహాలోనే రెండు పేజీలతో కూడిన మేనిఫెస్టోలో 34 హామీలు రూపొందించారు. ఇందులో సగానికిపైగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ)కి చెందినవే ఉన్నాయి. కొత్త పథకాల జోలికి పెద్దగా వెళ్లలేదు. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రతి పథకంలో పెంపుదల కనిపించింది. మేనిఫెస్టోలో ప్రధానంగా విద్య, వైద్యం, వ్యసాయం, ఉన్నత విద్య, అభివృద్ది, పేదలందరికీ ఇళ్లు, నాడునేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత అంశాలు ఉన్నాయి.
కొత్త అంశాలకు కొద్దిగా చోటు
మేనిఫెస్టోలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలతోపాటు కొత్తగా మరికొన్నింటిని జతచేశారు. ఇందులో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు విద్య, వైద్య సంక్షేమ పథకాలకు అవకాశం కల్పించారు. జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపికకాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు తీసుకునే రుణంలో రూ.10 లక్షల వరకు, పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యేంత లేదా గరిష్టంగా ఐదేళ్లపాటు చెల్లిస్తారు. రూ.25 వేల వరకు వేతనం పొందే ఆప్కాస్‌(అవుట్‌ సోర్సింగ్‌), అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, ఐట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలు నవరత్నాలు అందిస్తామని మేనిఫెస్టో హామీ ఇచ్చింది. వాహనమిత్రను ఆటోలు, క్యాబ్‌ డ్రైవర్లతోపాటు లారీ, ట్రిప్పర్‌ డ్రైవర్లకు విస్తరించింది. ఎస్సీల సామాజిక భద్రతలో భాగంగా గ్రామ జనాభాలో 50 శాతం అనగా 500కుపైగా ఎస్సీ ప్రజలు ఉన్న ఆవాసాలను ప్రత్యేకంగా పంచాయతీగా ఏర్పాటు చేయనున్నారు. దేవాలయాలకు ప్రత్యేక నిధి ప్రకటించారు.
నవరత్నాలు 2.0 కొనసాగింపు…పెంపుదల
. నవరత్నాల్లో భాగమైన పాత పథకాలు కొనసాగిస్తూనే వాటిని స్వల్పంగా పెంపుదల చేశారు. అమ్మఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్‌ఆర్‌ చేయూత తదితర పథకాలు కొనసాగుతాయి. వాటితోపాటు వచ్చే ఐదేళ్లల్లో పూర్తి చేసే పనుల జాబితాను మేనిఫెస్టోలో ప్రకటించారు.
. రాబోయే ఐదేళ్లల్లో వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైద్యం, ఆరోగ్య విస్తరణ పరిధి రూ.25 లక్షలు యథాతథంగా కొనసాగుతుంది.
. ప్రస్తుతం ఇస్తున్న అమ్మఒడిని రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచారు. ఇందులో తల్లుల చేతికి రూ.15వేలు అందిస్తారు.
. అర్హులైన వారందరికీ రెండు విడతల్లో పెన్షన్‌ రూ.3,500కు పెంచుతారు. ఈ పెంపు 2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 ఉంటుంది.
. వైఎస్‌ఆర్‌ చేయూత పథకం నాలుగు విడతల్లో రూ.75వేల నుంచి రూ.లక్షా 50 వేలకు పెంచారు.
. వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం కొనసాగిస్తారు. దీనిని నాలుగు విడతలుగా రూ.60వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంపు
. నాలుగు విడతలుగా ఈబీసీ నేస్తం…రూ.45వేల నుంచి రూ.లక్షా 5వేలకు పెంపు
. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు. కౌలు రైతులకూ రైతు భరోసా.
. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం
. మత్స్యకార భరోసా కింద 5 విడతల్లో రూ.50 వేలు అందజేత
. వాహనమిత్ర కింద ఐదేళ్లల్లో రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంపు
. ఆటోలు, ట్యాక్సీలు కొనుగోలుదారులకు వడ్డీ రాయితీ. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లల్లో రూ.50 వేలు.
. లారీ డ్రైవర్లు, ట్రిప్పర్‌ డ్రైవర్లకు వాహనమిత్ర వర్తింపు. రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా
. లా నేస్తం యథాతథం
. వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీతోఫా కొనసాగింపు
. అర్హులైన పేదలకు ఇళ్లు…ఇళ్ల పట్టాలు
. నాడు`నేడు, ట్యాబ్‌ల పంపిణీ కొనసాగింపుతోపాటు 2025 నుంచి ఐబీ సిలబస్‌తో విద్య
. ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌లు, జిల్లాకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాల. తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ.
. గిగా సెక్టార్‌ ఉద్యోగులకు వైఎస్‌ఆర్‌ బీమా వర్తింపు
. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్‌
. కులవృత్తి, చిరు వ్యాపారులకు జగనన్న తోడు రూ.15 వేలకు పెంపు.
. జర్నలిస్టులకు 60 శాతం రాయితీతో ఇళ్ల స్థలాలు రాబోయే ఐదేళ్ల లక్ష్యాలు
. పోలవరం ప్రాజెక్టు అ 17 మెడికల్‌ కళాశాలల నిర్మాణం
. నాలుగు ఫోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండిరగ్‌ సెంటర్లు,
. భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి
. ప్రభుత్వ బడులు, హాస్టళ్లు, అంగన్‌వాడీలు, ఆస్పత్రుల్లో నాడు`నేడు
. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, మొదలు పెట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తి
. ఆక్వా, లా యూనివర్సిటీలు, డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌, గిరిజన ఇంజినీరింగ్‌ కాలేజీ, గిరిజన యూనివర్సిటీ పూర్తి
. అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు, కోల్డ్‌ స్టోరేజీలు, గోడౌన్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లు
. ఎడెక్స్‌ ద్వారా మరిన్ని ఆన్‌లైన్‌ వర్టికల్స్‌, ప్రపంచ ప్రఖ్యాతి యూనివర్సిటీలతో సర్టిఫికేషన్‌
. ఇంగ్లీషు మీడియంతోపాటు ఏటా ఒక్కో తరగతికి ఐబీ సిలబస్‌ విస్తరణ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img