Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ ర్యాలీ

జైపూర్‌కు రాహుల్‌, ప్రియాంక
జైపూర్‌ : ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ఇక్కడ ర్యాలీ నిర్వహించనున్నది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొననున్నారు. పార్టీ రాజస్థాన్‌ ఇన్‌ఛార్జి అజయ్‌ మకేన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ జాతీయ ర్యాలీకి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌(ఎన్‌డీఏ) ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర విధానాలు దేశంలో ‘ద్రవ్యోల్బణం’ పెరుగుదలకు దారితీసిందని, మోదీ ప్రభుత్వ ప్రతి నిర్ణయం ప్రజలకు వ్యతిరేకమన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్థిక కార్యకలాపాలు పట్టాలు తప్పాయని సూర్జేవాలా చెప్పారు. ‘మోదీ ప్రభుత్వ ప్రతి నిర్ణయం ప్రజా వ్యతిరేకమే. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుప్పకూలాయి. నక్సలిజంగానీ, ఉగ్రవాదంగానీ అంతంకాలేదు. నల్లధనం నిర్మూలించబడలేదు. దేశంలో నిరుద్యోగం రేటు 10 శాతానికి చేరిందని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి బయటపడేందుకు మోదీ, బీజేపీని ఓడిరచండి’ అని అన్నారు. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దోతస్ర మాట్లాడుతూ కోవిడ్‌`19 మార్గదర్శకాలను అనుసరిస్తూ, మాస్కులు ఏర్పాటు చేయడంతోపాటు ఉష్ణోగ్రతలు తనిఖీ చేయనున్నట్లు చెప్పారు.
పార్టీ అధినేతగా రాహుల్‌ : కాంగ్రెస్‌ పోస్టర్లు
కాంగ్రెస్‌ పార్టీ అధినేతగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత, పుదుచ్చేరి మాజీ సీఎం వి నారాయణ స్వామి అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌ గాంధీ ఆ పదవిని మళ్లీ చేపట్టాలని పార్టీ కార్యకర్తల్లో ఎక్కువ మంది కోరుకుంటున్నట్టు తెలిపారు. దీనికి అనుగుణంగానే జైపూర్‌లో రాహుల్‌ గాంధీకే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పోస్టర్లు వెలిశాయి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం జైపూర్‌లో నిర్వహిస్తున్న భారీ ర్యాలీ నేపథ్యంలో రాహుల్‌ పార్టీ పగ్గాలు చేపట్టాలని అభిలషిస్తూ పార్టీ కార్యకర్తలు భారీగా బ్యానర్లు, పోస్టర్లు రూపొందించారు. జైపూర్‌ నగరమంతా భారీగా అలంకరించిన బ్యానర్లలో రాహుల్‌ గాంధీకే అధిక ప్రాధాన్యం ఇవ్వగా తరువాత స్థానాల్లో సోనియా రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌, అజయ్‌ మాకెన్‌, రాజస్థాన్‌ పార్టీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ దోతస్రా తదితరులకు దక్కింది. దీనిపై స్పందించిన నారాయణ స్వామి రాహుల్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img