Monday, April 29, 2024
Monday, April 29, 2024

అధికార పగ్గాలు చేపడితే…యూపీ ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌

: అఖిలేష్‌ హామీ
లక్నో : యూపీ ఎన్నికల క్షేత్రంలో దూకుడు పెంచిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్‌ యాదవ్‌ గురువారం మరో కీలక ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారపగ్గాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. గురువారం లక్నోలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ విషయంపై తమకు స్పష్టమైన విధానం ఉందని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కార్పస్‌ నిధిని ఏర్పాటు చేయడం ద్వారా పాత పెన్షన్‌ను పునరుద్దరించవచ్చునని పేర్కొన్నారు. ఎన్నికల్లో తమకు ఉద్యోగుల సంపూర్ణ మద్దతు అందించాలని కోరతామని చెప్పారు. పాత పెన్షన్‌ పునురుద్దరణ విషయంలో ఆర్థిక నిపుణులతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు వెల్లడిరచారు. ఈ హామీని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పెట్టనున్నట్టు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులు పాత పెన్షన్‌ ఇవ్వాలని డిమాండు చేస్తున్నా బీజేపీ పట్టించుకోలేదని విమర్శించారు. తమ పార్టీ అధికారం చేపడితే పెన్షన్‌ పునరుద్దరణ ద్వారా లక్షలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ములాయం సింగ్‌ యాదవ్‌ కోడలు అపర్ణా యాదవ్‌ బీజేపీలో చేరడంపై విలేకరులు అడిగిన ప్రశ్నపై స్పందించిన అఖిలేష్‌ తమ పార్టీలోని వంశపారంపర్య రాజకీయాలు అంతమైయ్యాయని ముక్తాయించారు. బీజేపీ ఇప్పటివరకూ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయలేదని తమ పార్టీ మేనిఫెస్టో విడుదలైన తరువాత అందులోని అంశాలనే పేర్కొంటూ ఓటర్లను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. ఇప్పడు కేంద్రం, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img