Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఒకే దేశం-ఒకే ఎన్నిక అవశ్యం

75శాతానికి పోలింగ్‌ పెరగాలి

ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్ష

న్యూదిల్లీ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పోలింగ్‌ శాతం ముఖ్యంగా పట్టణాల్లో తక్కువగా నమోదు కావడంపై ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వెలిబుచ్చారు. విద్యావంతులు, సంపన్నులు ఉండే ఇలాంటి ప్రాంతాల్లో ఓటింగ్‌ పెరగాలని, భారత్‌ వంటి సచేతన ప్రజాస్వామ్యంలో ఇది మారాలని పిలుపునిచ్చారు. మోదీ మంగళవారం బీజేపీ కార్యకర్తలతో ముచ్చటించారు. ఒకే దేశంఒకే ఎన్నిక, ఒక దేశంఒకటే ఓటర్ల జాబితా వంటి అంశాలనూ ప్రస్తావించారు. రాజకీయాల్లో వరుస ఎన్నికల ఫలితాల ప్రక్రియ కారణంగా అభివృద్ధి పనులకు ఇబ్బంది కలుగుతోందని మోదీ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం వేళ ఆయన ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడిరది. 195152లో లోక్‌సభకు తొలిసారి ఎన్నికలు జరుగగా 45శాతం ఓటింగ్‌ నమోదైంది. 2019 నాటికి అది 67శాతానికి పెరిగింది. ముఖ్యంగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరగడం మంచి పరిణామమని మోదీ చెప్పారు. తక్కువ పోలింగ్‌పై రాజకీయ పార్టీల నాయకులు, పౌరులు దృష్టిపెట్టాలన్నారు. పట్టణాల్లో విద్యావంతులు ఉంటారు. వారు ఎన్నికల గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చిస్తారుగానీ ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ ‘పన్నా ప్రముఖ్‌’లు, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలంతా ప్రతి ఎన్నికలో 75శాతం పోలింగ్‌ నమోదయ్యేలా చూడాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు పోలింగ్‌ కీలకమని ప్రధాని నొక్కిచెప్పారు. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్‌ చేపట్టిన అనేక చర్యలను శ్లాఘించారు. ఇటీవల ఓటర్‌ ఐడీతో ఆధార్‌ నంబరును అనుసంధానం చేసేలా చట్టాన్ని తీసుకురావడంతో పోలింగ్‌ మరింత పారదర్శకంగా జరిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఒక దేశం, ఒకటే ఎన్నిక, ఒక దేశం, ఒకటే ఓటర్ల జాబితా వంటి అంశాలపై చర్చ జరగాలని, అప్పుడు వేర్వేరు అభిప్రాయాలు బయటకు వస్తాయని అన్నారు. ఎన్నికల బూత్‌లలో ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీకి ఇన్‌చార్జీలుగా ఉండే ప్రముఖ్‌లతో సమావేశం నిర్వహించామని, ఇందుకోసం కొంత కాలంగా యోచిస్తున్నామని ప్రధాని చెప్పారు. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు ఏడు దశల్లో ఎన్నికలు వచ్చే నెలారంభంలో జరగనున్న విషయం విదితమే. 2047 నాటికి భారత్‌లో పౌష్టికాహార లోపం ఉండకూడదన్న లక్ష్యసాధనకు ప్రజల భాగస్వామ్యంలో ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని బీజేపీ కార్యకర్తలకు మోదీ సూచించారు. చిన్న విరాళాల రూపేణ బీజేపీతో ఎక్కువ మంది అనుసంధానం అయ్యేలా చూడాలని ప్రధాని సూచన చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img