Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

చన్నీ, సిద్ధూకు మద్దతు లేదు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జక్కర్‌ సంచలన వ్యాఖ్యలు
చండీగఢ్‌ : పంజాబ్‌ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో మరోసారి అలజడి చెలరేగింది. పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు లేదా ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి ఎమ్మెల్యేల మద్దతు లేదని ఆ పార్టీ నేత సునీల్‌ జక్కర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ నుంచి కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌ నిష్క్రమించిన తర్వాత పార్టీ అధిష్ఠానం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో వారిద్దరికీ ఎంత మాత్రం మద్దతు కనిపించలేదన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తున్న సమయంలో సునీల్‌ జక్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ చీఫ్‌ సిద్ధూ మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. సునీల్‌ జక్కర్‌ మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. గత ఏడాది కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌ రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఎవరిని ఎంపిక చేయాలో తెలియజేయాలని పంజాబ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ పార్టీ అధిష్ఠానవర్గం అడిగిందని సునీల్‌ ఈ వీడియోలో చెప్తున్నట్లు కనిపిస్తోంది. తనకు అనుకూలంగా 42 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారని సునీల్‌ చెప్పారు. సుఖ్‌జిందర్‌ రణధవాకు 16 మంది, ప్రణీత్‌ కౌర్‌కు 12 మంది, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు ఆరుగురు, చన్నీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతిచ్చారన్నారు. సునీల్‌ అబోహర్‌ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నపుడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినప్పటికీ, అత్యధిక ఎమ్మెల్యేలు తనపట్ల నమ్మకం ప్రకటించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవిని మాత్రమే ఇవ్వడం వల్ల తాను అసంతృప్తికి గురయ్యానన్నారు. సునీల్‌ జక్కర్‌ ఈసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పంజాబ్‌ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img