Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నేర చరితులకు ఆప్‌ టికెట్లు

మొదటి ఏడాదే లక్షమందికి ఉద్యోగాలు
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచిత విద్య
పంజాబ్‌ సీఎం చన్నీ హామీలు

చండీగఢ్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ సోమవారం నిప్పులు చెరిగారు. తనపై అబద్ధపు ప్రచారం వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. నేరచరిత్ర గల ఎక్కువమంది అభ్యర్థులకు ఆప్‌ టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు. సీఎం చన్నీ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి తిరిగి అధికారం కట్టబెడితే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత విద్య అందిస్తామని, మొదటి ఏడాదే లక్షమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్‌ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇతర రాజకీయ పార్టీల నుంచి ఫిరాయించిన 44 మంది నాయకులకు కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆప్‌ టికెట్లు ఇచ్చిందని చన్నీ ఆరోపించారు. ఆప్‌కు సంబంధించిన అభ్యర్థుల్లో అత్యధికమందికి నేరచరిత్ర ఉందని చన్నీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామంటూ ఆప్‌ చేస్తున్న ప్రచారాన్ని తిప్పుకొడుతూ ఇతర రాజకీయ పార్టీలు తిరస్కరించిన అభ్యర్థులను పోటీకి దించి…ఎలాంటి మార్పు తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు. అసత్యాలతోనే కేజ్రీవాల్‌ ఇక్కడ తన పార్టీని నిర్మిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేమని తెలుసుకున్న ఆప్‌ నాయకులు తనపై వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చన్నీ మండిపడ్డారు. తాను పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో ఓటమి చెందుతానని కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను చన్నీ తోసిపుచ్చారు. తనపై పోటీ చేయాల్సిందిగా కేజ్రీవాల్‌కు సవాల్‌ చేశానని, అందుకు ఆయన ముందుకు రాలేదని చెప్పారు. రెండు నియోజకవర్గాల్లో 25 వేల ఓట్ల మెజారిటీకి తగ్గకుండా తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు. 50 వేల ఓట్ల దాకా కూడా మెజారిటీ రావచ్చని చెప్పారు. ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ మాత్రం దారుణ ఓటమిని చవిచూస్తారని జోస్యం చెప్పారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన మాన్‌ సంగ్రూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని ఆరోపించారు. ఎవరికెన్ని ఆస్తులున్నాయో తేల్చుకుందాం రండని కేజ్రీవాల్‌, మాన్‌కు చన్నీ సవాల్‌ చేశారు. తనకు రూ.170 కోట్ల ఆస్తులు ఉన్నట్లు రోజు ప్రచారం చేస్తున్నారని, తన ఆస్తులను అఫిడవిట్‌లో వెల్లడిరచానని వివరించారు. ఇటీవల జరిగిన ఈడీ దాడులను, ఇసుక అక్రమ వ్యాపారం గురించి ఆప్‌ తనపై చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రతి కుటుంబానికి విద్య అందించడం ప్రభుత్వ బాధ్యతని తాము నిర్ణయించుకున్నామని, అందుకే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉచిత విద్య అందస్తామని చన్నీ హామీ ఇచ్చారు. ఎస్‌సీ స్కాలర్‌షిప్‌ పథకాన్ని పటిష్టవంతం చేస్తామన్నారు. ఉచిత విద్య అందించడంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లల కోసం జనరల్‌ కేటగిరీ స్కాలర్‌షిప్‌ పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్సిటీలలో ఫీజుల నియంత్రణ కోసం కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. నైపుణ్యతో కూడిన విద్య అందిస్తామని, చంకార్‌ సాహిబ్‌లో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని చన్నీ వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img