Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నిష్ఠుర సత్యం మింగుడుపడదుగా!

సింగపూర్‌ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ గత మంగళవారం రెండు నిష్ఠుర సత్యాలు చెప్పి మోదీ సర్కారుకు ఆగ్రహం తెప్పిం చారు. ఆయన భారత లోకసభలో 43 శాతం మంది నేరచరితు లేనని, అందులో 29 శాతం మందిపై హత్య, అత్యాచారం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఇది ఆయన స్వయంగా కనిపెట్టిన బ్రహ్మ రహస్యమేమీ కాదు. ఈ మాట చెప్పడానికి ముందు ఆయన ప్రథమ భారత ప్రధాని పండిత్‌ నెహ్రూ కృషిని కొని యాడారు. అయిన దానికీ కాని దానికీ నెహ్రూనే దోషిగా నిలబెట్టడానికి అలవాటుపడ్డ ప్రధానమంత్రి మోదీ దృష్టిలో ఎవరైనా, అందునా ఒక దేశ ప్రధానమంత్రి నెహ్రూను పొగడడం మహా పరాధమే కదా! భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సింగపూర్‌ హై కమిషనర్‌ సైమన్‌ వాంగ్‌ను పిలిపించి ఆ దేశ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలియజేసింది. సింగపూర్‌ ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవాంఛితమని విదేశాంగ శాఖ సింగపూర్‌ హై కమిషనర్‌ మొహాన చెప్పేసింది. నిజానికి సింగపూర్‌ ప్రధానమంత్రికి మన చట్టసభల్లో నేరచరితులు పెరిగిపోతున్నందుకు బాధ ఉందని కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పని చేయాలో చెప్పడానికి ఆయన నవ భారత నిర్మాత హయాంలో ప్రజాస్వామ్య విలువలను ఎలా పదిలపరిచారో చెప్పడంతో పాటు లోక సభ సభ్యులలో నేరచరిత ఉన్న వారి ప్రస్తావన తీసుకొచ్చారు. మీడియా వార్తలను ఉటంకిస్తూనే లీ ఈ మాటలు చెప్పారు. దీనికి మన మోదీ ప్రభుత్వం ఉలికిపాటు చెందడం ఏమిటి? నేరస్థులు లేరని ఎవరైనా చెప్పగలరా? సింగపూర్‌ ప్రధాని పొగిడిరది నెహ్రూను ఒక్కడినే కాదు. ఇజ్రాయిల్‌ మొదటి ప్రధానమంత్రి డేవిడ్‌ బెన్‌ గురియన్‌ను కూడా కొనియాడారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారు చాలా వరకు విశిష్టమైన వ్యక్తులు అయి ఉంటారని, ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారని, సంస్కారవంతులై ఉంటారని, అసామాన్యమైన సామర్థ్యం ఉంటుందని అన్నారు. నెహ్రూను ఇంతగా పొగిడితే నెహ్రూను తప్పు పట్టడానికి ఏ అవకాశాన్నీ వదులుకోని మోదీ సర్కారు ఎలా సహిస్తుంది మరి. వారు అనేక అగ్ని పరీక్షలు ఎదుర్కొని నాయకులుగా ఎదిగారని కూడా లీ అన్నారు. తమకు కూడా అలాంటి నేతలు ఉన్నారనీ చెప్పారు. అయితే ఇలాంటి దేశ నిర్మాతలు ఇప్పుడు ఆ దేశాల్లో ఉన్న పరిస్థితిని చూస్తే ఇది తాము నిర్మించిన దేశమేనా అని ఆశ్చర్య పడొచ్చునని కూడా ఆయన అన్నారు. సింగపూర్‌కు కూడా ఇలాంటి ప్రమాదం ఉందని హెచ్చరించ డానికే ఆయన నెహ్రూను ఉదాహరించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అనుక్షణం నెహ్రూను బోనులో నిలబెట్టినా నెహ్రూ కీర్తికి వచ్చిన నష్టమేమీ లేదని గుర్తించకపోవడం ఆ విమర్శలు చేస్తున్న వారి చారిత్రక జ్ఞాన హీనతకు, హ్రస్వ దృష్టికి నిదర్శనం. తొలి ప్రధానమంతి అయినందువల్ల నెహ్రూ కీర్తిమంతుడు కాలేదు. స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉండేది. ఇటలీ నియంత ముసోలిని నెహ్రూను కలుసుకోవాలన్న ఆకాంక్ష వ్యక్తం చేసినా ఫాసిజానికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తిగా నెహ్రూ ఆయనను కలవడానికి నిరాకరించారు. ఇదీ ఆయన సిద్ధాంత బలిమి. బీజేపీకి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న చరిత్రా లేదు, మానవాళికి మార్గదర్శకంగా ఉండే సైద్ధాంతిక పునాదీ లేదు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సంఫ్‌ు పరివార్‌ వారిని లెక్కపెట్టడానికి ఒక చేతి వేళ్లు కూడా ఎక్కువే. జాతీయపోరాటంలో తమకు స్ఫూర్తి కలిగించిన నాయకులు ఎవరూ లేని లోటు పూడ్చుకోవడానికే నరేంద్ర మోదీ నెహ్రూ బదులు సర్దార్‌ పటేల్‌ తొలి ప్రధాని అయి ఉంటే ఎంత బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆగకుండా ఆ విషయాన్ని నెహ్రూను కించపరచడానికి ఆయుధంగా మలుచుకున్నారు. మోదీలాంటి వ్యక్తులు ఈస్థాయికి ఎదగ డానికి నెహ్రూ ప్రోదిచేసిన విలువలు, నిర్మించిన ప్రజాస్వామ్య వ్యవస్థలే కారణం అన్న వాస్తవాన్ని వాటంగా విస్మరిస్తుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థను వినియోగించుకుని అధికారంలోకి వచ్చినవారు నర హంతకులుగా మారిన ఉదం తాలకు చరిత్రలో కొదవే లేదు. అలాంటి నాయకులే సంఫ్‌ు పరివార్‌కు ఆదర్శ ప్రాయులని ప్రత్యేకంగా చెప్పాల్సిన అగత్యమూ లేదు.
మన చట్ట సభల్లో నేర చరిత్ర ఉన్న వారు ఉండడం దాచేసినా దాగని సత్యం. ఈ నేర చరితుల చిట్టా విప్పింది ఏ విదేశీ సంస్థో కాదు. ప్రజా స్వామ్య సంస్కరణల సంఘం (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌) 2019లో విడుదల చేసిన నివేదికలోనే 2019లో ఎన్నికైన వారిలో 43 శాతం మందికి నేర చరిత్ర ఉందని చెప్పింది. మనకున్న న్యాయ విధానాల ప్రకారం ఎంతటి తీవ్ర ఆరోపణలున్నా వారిని నిందితులుగానే పరిగణిస్తాం తప్ప నేరస్థులనం. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం కూడా వారు నేరస్థు లనలేదు. ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు రాజకీయ నాయకులు తమ మీద ఉన్న నేరారోపణల వివరాలు కూడా ప్రమాణ పత్ర రూపంలో అందజేయ వలసి ఉంటుంది. ఆ లెక్కలే ఇవి. తమ మీద తీవ్ర నేరారోపణలు ఉన్నా యని ఆ చరిత్ర ఉన్న వారు అందజేసిన సమాచారమే. చట్టసభల్లో ప్రవే శించడానికి నేరస్థుల సహాయం పొందే దశ ఎప్పుడో దాటేశాం. ఇప్పుడు నేర చరిత్ర ఉన్న వారే నేరుగా చట్టసభలను అలంకరిస్తున్నారు. మోదీ లాంటివారికి అననుకూలమైన పరిస్థితి ఏమిటంటే సరిగ్గా సింగపూర్‌ ప్రధాని వ్యాఖ్యలు వెలువడిన సమయంలోనే అయిదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. అందులో నెహ్రూను నిందించి పబ్బం గడుపు కోవడాన్ని నిలదీశారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయి ఏడేళ్ళు దాటినా ఇంకా నెహ్రూను నిందిం చడం ఎందుకు అని ప్రశ్నించారు.
మోదీ లాంటివారు ఎప్పుడు నోరు విప్పినా స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్నా సకల రుగ్మతలకు నెహ్రూనే దోషిగా చూపిస్తుంటారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన తరవాత మోదీ ఏడేళ్లు, అటల్‌ బిహారీ వాజపేయి ఆరేళ్లు అధికారంలో ఉన్న కాలాన్ని కూడా లెక్క లోకి తీసుకోవాలి కదా!. అంతకు ముందు రెండున్నరేళ్ల పాటు కొనసాగిన జనతా పార్టీ ప్రభుత్వంలో బీజేపీకి పూర్వరూపమైన భారతీయ జనసంఫ్‌ు కూడా ఉందన్న విషయాన్ని మరిచిపోతుంటారు. ప్రస్తుతం అధికారంలోఉన్న వారే వర్తమాన వ్యవహారాలకు బాధ్యులు అన్న వాస్తవాన్ని అంగీకరించ డానికి మోదీసర్కారు ససేమిరా అనడం అలవాటు చేసుకుంది. మోదీ అధికారంలోకి వచ్చి ఏడున్నరేళ్లు దాటినా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించ వలసిన బాధ్యతను గాలికి వదిలేసి నెహ్రూను నిందించడం ఏమిటని మన్మోహన్‌ సింగ్‌ మోదీకి అద్దం చూపించారు. గతకీర్తి లేని వారు తమది ఘన చరిత్ర అని బుకాయించి బతికేయడం సహజమే. నిరుద్యోగం, ఆకలి లాంటి సమస్యల మీద వెలువడే నివేదికలను చాపకిందకు తోసేసే మోదీ లాంటి వారి నుంచి ఇంతకన్నా ఏమి ఆశించగలం!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img