Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పర్యవేక్షణాధికారి సూచనలు బేఖాతరు చేశారేం?

లఖింపూర్‌ కేసులో యూపీని నిలదీసిన సుప్రీం
4లోగా సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశం

న్యూదిల్లీ : లఖింపూర్‌ ఖేరి కేసులో పర్యవేక్షణాధికారి సూచనలను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బేఖాతరు చేసినట్లు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. దీనిపై న్యాయస్థానం నిలదీయగా ఆమేరకు సిఫార్సుల గురించీ ఏ మాత్రం సమాచారం లేదన్న సమాధానం రాష్ట్రం వైపు నుంచి వచ్చింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం కాస్తంత అసహనం వ్యక్తంచేసింది. యూపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఏప్రిల్‌ 4లోగా సమాధానం తెలియజేయాలని ఆదేశాలిచ్చింది. లఖింపూర్‌ ఖేరి హింస ప్రధాన నిందితుడు ఆశీశ్‌ మిశ్రా బెయిల్‌ రద్దునకు అప్పీలు చేయాలని ఈ కేసు విచారణను పర్యవేక్షించిన రిటైర్డ్‌ జడ్జి చేసిన సూచనలపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం నిలదీసింది. కానీ రాష్ట్రం తరపున అలాంటి చర్యలు లేకపోవడాన్ని ప్రశ్నించింది. ఆశీశ్‌ బెయిల్‌ రద్దునకు బాధితుల కుటుంబాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారేగానీ రాష్ట్రం కాదని పేర్కొంది. ఈ కేసును సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. మాకు అందిన నివేదిక ఆధారంగా మిమ్మల్ని (యూపీ) ఆశీశ్‌ మిశ్రా బెయిల్‌ను రద్దు చేయమని హైకోర్టులో ఫిర్యాదు చేయాలని విచారణను పర్యవేక్షించిన రిటైర్డ్‌ జడ్జి సూచించారని, అలహాబాద్‌ హైకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేయాలని సిఫార్సు చేశారని తెలిసిందని ధర్మాసనం పేర్కొంది. దీనిపై యూపీ తరపు సీనియర్‌ న్యాయమూర్తి మహేశ్‌ జఠ్మలానీ స్పందించారు. మాజీ న్యాయమూర్తి చేసిన సిఫార్సుల గురించి తెలియదని తెలిపారు. దీంతో అసహనం వ్యక్తంచేసిన త్రిసభ్య ధర్మాసనం, ఆ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి విచారణ తేదీ అయిన ఏప్రిల్‌ 4 నాటికి సమాధానం ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ కేసులో విచారణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా, బాధితులకు న్యాయం జరగాలని పంజాబ్‌, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి రాకేశ్‌ కుమార్‌ జైన్‌ను పర్యవేక్షణాధికారిగా నియమించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img