Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ఇంధన భద్రతపై ఐరాసలో భారత్‌ ఆందోళన

ఐక్యరాజ్య సమితి : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఆహారం, ఇంధనం ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఇంధన భద్రత చాలా ముఖ్యమైనదని, ఈ సమస్యను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవలసిన అవసరం ఉందని చెప్పింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో మంగళవారం ఉక్రెయిన్‌లో మానవతావాద పరిస్థితిపై సమావేశం జరిగింది. ఐక్య రాజ్య సమితికి భారత దేశ డిప్యూటీ పర్మినెంట్‌ రిప్రజెంటేటివ్‌ ఆర్‌ రవీంద్ర ఈ సమావేశంలో మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఉత్పన్నమవుతున్న ఆహార భద్రతకు సంబంధించిన సవాళ్లపై సృజనాత్మకంగా స్పందించాలన్నారు. ఈ యుద్ధం ప్రభావం ప్రాంతానికి అతీతంగా పడుతోందన్నారు. ఆహారం, ఇంధన ధరలు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. పెరుగుతున్న కొరతలను ప్రస్తుతం మనల్ని కట్టి పడేస్తున్న నిర్బంధాలకు అతీతంగా వెళ్లినపుడు మాత్రమే పరిష్కరించుకోగలమని తెలిపారు. ఇంధన భద్రత కూడా ఆహార భద్రత మాదిరిగానే సమానమైన ప్రాధాన్యంగలదేనని చెప్పారు. ఇంధన భద్రత సమస్యను సహకారాత్మక కృషితో పరిష్కరించుకోవలసిన అవసరం ఉందని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img