Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

జీఎస్‌టీ అదుర్స్‌!

మే నెలలో రూ.1.41 లక్షల కోట్ల ఆదాయం
ఏడాది క్రితం కంటే 44 శాతం అధికం
దేశీయ లావాదేవీలు, సేవల దిగుమతుల నుంచి వేగంగా వసూళ్లు

న్యూదిల్లీ : మే నెలలో భారతదేశ వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం ఏడాది క్రితం కంటే 44 శాతం ఎక్కువగా రూ.1,40,885 కోట్లకు చేరుకుంది. దేశీయ లావాదేవీలు, సేవల దిగుమతులు నుంచి వస్తున్న వసూళ్లు అదే వేగంతో పెరుగుతున్నాయి. వస్తువుల దిగుమతులు 43 శాతం అధిక పన్నులను అందించాయి. ‘జీఎస్‌టీ ప్రారంభం నుంచి నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు దాటడం ఇది నాల్గవసారి మాత్రమే. మార్చి 2022 నుంచి వరుసగా మూడవ నెల’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్‌ 2022లో రికార్డు స్థాయిలో రూ.1.67 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు రావడంతో నెలవారీగా తగ్గిన ఆదాయాలను వివరిస్తూ, ఏప్రిల్‌లో జరిగిన లావాదేవీల కోసం మేలో వచ్చిన ఆదాయాలు ఏప్రిల్‌ జీఎస్‌టీ ఆదాయాల కంటే ‘ఎప్పుడూ తక్కువగానే’ ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు ఆర్థిక సంవత్సరం ముగింపునకు సంబంధించి మార్చిలో దాఖలు చేసిన రిటర్న్‌లను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది. ‘అయితే, 2022 మే నెలలో కూడా స్థూల జీఎస్‌టీ ఆదాయాలు రూ.1.40 లక్షల కోట్ల మార్కును అధిగమించడం ప్రోత్సాహకరంగా ఉంది. ఏప్రిల్‌ 2022 నెలలో ఉత్పత్తి చేయబడిన మొత్తం ఇ-వే బిల్లుల సంఖ్య 7.4 కోట్లు. ఇది మార్చి 2022 నెలలో ఉత్పత్తి అయిన 7.7 కోట్ల ఇ-వే బిల్లుల కంటే 4 శాతం తక్కువ’ అని అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సేవల దిగుమతులతో సహా దేశీయ లావాదేవీల నుంచి రాబడి పెరుగుదల చాలా నెలల తర్వాత వస్తువుల దిగుమతుల నుంచి వచ్చే ఆదాయాన్ని మించిపోయింది. ఉదాహరణకు, ఏప్రిల్‌ 2022లో దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు 17 శాతం పెరిగాయి. అయితే వస్తువుల దిగుమతులు 30 శాతం పెరిగాయి. మేలో మొత్తం ఆదాయాన్ని పరిశీలిస్తే, కేంద్ర జీఎస్‌టీ వసూళ్లు రూ.25,036 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్‌టీ రూ.32,001 కోట్లు, ఇక ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.73,345 కోట్లు. ఇందులో వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.37,469 కోట్లు ఉన్నాయి. వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.931 కోట్లతో సహా రాష్ట్రాలకు తిరిగి చెల్లించేందుకు ఉపయోగించే జీఎస్‌టీ పరిహారం సెస్‌ ఇన్‌ఫ్లోలు రూ.10,502 కోట్లు. ఏప్రిల్‌లో వసూలు చేసిన రూ.10,649 కోట్ల కంటే ఇది స్వల్పంగా తక్కువ. మే నెల జీఎస్‌టీ వసూళ్లలో వరుస క్షీణత పూర్తిగా అంచనా వేయబడినప్పటికీ, అధిక సంవత్సరపు వృద్ధి రెండవ కోవిడ్‌-19 దశ నుంచి తక్కువగా ప్రతిబింబిస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ ఎత్తి చూపారు. ‘మరో కోవిడ్‌ మహమ్మారి ముప్పు, పెద్ద అంతరాయాలు లేనప్పుడు నిరంతర ఆరోగ్యకరమైన కార్యాచరణ కేంద్ర జీఎస్‌టీ వసూళ్లు బడ్జెట్‌ అంచనాలను రూ.1.15 లక్షల కోట్లకు మించి చేయడంలో సహాయపడతాయి. కేంద్రం అధిక సబ్సిడీ బిల్లులో కొంత భాగాన్ని గ్రహించడానికి దోహదపడతాయి’ అని ఆమె తెలిపారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలలో రికార్డు మిశ్రమంగా ఉంది. తమిళనాడు ఆదాయంలో 41 శాతం పెరుగుదల నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తెలంగాణ వృద్ధి రేటు వరుసగా 47 శాతం, 80 శాతం, 33 శాతంగా ఉంది. ‘గత మూడు నెలల్లో రూ.1.4 లక్షల కోట్లకు మించిన జీఎస్‌టీ వసూళ్లు ప్రదర్శించిన స్థిరత్వం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఇతర స్థూల ఆర్థిక సూచికలతో సంబంధాలకు మంచి సూచిక. ఆడిట్‌లు, విశ్లేషణల్లో ముఖ్యమైన ప్రయత్నాలు పన్ను ఎగవేతదారులకు వ్యతిరేకంగా సాగాయి. ఇది పన్ను సమ్మతి సంస్కృతిని ప్రోత్సహించింది’ అని డెలాయిట్‌ ఇండియాలో భాగస్వామి అయిన ఎం.ఎస్‌.మణి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img