Homeజాతీయంముంబై మరువలేని కాళరాత్రి

ముంబై మరువలేని కాళరాత్రి

- Advertisement -

. ఉగ్ర క్రూరత్వానికి చెరగని గుర్తుగా 26/11
. 12 చోట్ల రక్తపాతం – 166 మంది మృతి
. తొమ్మిది మంది ముష్కరులు హతం
. ప్రాణాలతో పట్టుబడ్డ కసబ్‌-ఆపై ఉరి
. ముంబై ఉగ్రదాడులకు 17 ఏళ్లు


ముంబై : నవంబరు 26వ తేదీ ప్రపంచాన్ని కుదిపివేసిన రోజు. 2008లో అంటే సరిగ్గా 17 ఏళ్ల కిందట ఇదే రోజు భారత దేశ ఆర్థిక రాజధాని చరిత్రలో కాళరాత్రిగా నిలిచింది. కాల్పులు, పేలుళ్లతో ముంబై నగరం దద్దరిల్లింది. 10 మంది ఎల్‌ఈటీ ఉగ్రవాదులు ముంబైలో చొరబడి వరుసగా 12 చోట్ల విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. తుపాకులతో స్వైర విహారం చేస్తూ కనిపించిన వారిని కాల్చి చంపారు. గ్రెనేడ్లతో బీభత్సం సృష్టించారు. దాదాపు 60 గంటల పాటు మహానగరాన్ని వణికించారు. తుపాకుల మోతతో ఆ కాళరాత్రి అనేక మంది అమాయకుల జీవితాలను అర్థాంతంగా ముగించింది. ఉగ్రవాదుల నుంచి ప్రజలను కాపాడేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టి భద్రతా సిబ్బంది పోరాడారు. ఆ రోజు రాత్రి భయానక క్షణాలను దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ముంబై వీధుల్లో రక్తం పారించారు. మారణహోమం సృష్టించారు. దీంతో దేశవిదేశీ పౌరులు, భద్రతా సిబ్బంది, తొమ్మిది మంది ముష్కరులు కలిపి మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్‌ అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ ఒక్కడే ప్రాణాలతో పట్టుబడ్డాడు. అతనికి 2010లో మరణశిక్ష విధంచగా, రెండేళ్ల తర్వాత ఉరి కంబమెక్కించారు. భారతదేశ చరిత్రలోనే అతి కిరాతకమైన ఉగ్ర దాడిగా 26/11 దాడులు నిలిచాయి. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌, ది ఓబెరాయ్‌ ట్రైడెంట్‌, ది తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌, టవర్‌ హోటల్‌, లియోపోల్డ్‌ కేఫ్‌, నారిమన్‌ హౌస్‌ వంటి ప్రముఖ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ముష్కరులు రెచ్చిపోయారు. ఎటూ చూసినా రక్తం... మృతదేహాలు పడివున్న భయానక దృశ్యాన్ని తాజ్‌ మహల్‌ హోటల్‌లో ఉగ్రవాదులు ఆవిష్కరించారు. ఆర్థికంగా, సామాజికంగా కీలకమైన స్థానాలను ఎంచుకొన్న ఉగ్రవాదులు ఆయా క్షేత్రాలలో భయోత్పాతాన్ని సృష్టించారు. ఏకే 47 రైఫిళ్లు, ఆర్‌డీఎక్స్‌, గ్రెనేడ్లతో సముద్ర మార్గంలో పాకిస్థాన్‌ నుంచి ముంబైకి చేరుకొని, చిన్న బృందాలుగా విడిపోయి మహానగరాన్ని 60 గంటల పాటు గడగడలాడిరచారు. 2008, నవంబరు 26వ తేదీ రాత్రి 9.20 గంటలకు ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో మొదటి దాడి జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు కసబ్‌, ఇస్మాయిల్‌ రైల్వే స్టేషన్‌లో మారణాయుధాలు పట్టుకొని మారణహోమం సృష్టించే వారి భయానక దృశ్యాలు ప్రసారమయ్యాయి. అక్కడ 58 మంది చనిపోగా, 104 మంది గాయపడ్డారు. ఇది జరిగిన పది నిమిషాలకు నారిమన్‌ హౌస్‌లోకి చొరబడి ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. విదేశీయులు సహా కొందరిని నిర్బంధించారు. ఆపై రాత్రి 9.48 గంటలప్పుడు లియోపోల్స్‌ కేఫ్‌పై దాడి చేసి 10 మందిని చంపేశారు. రాత్రి 9.359.45 గంటల మధ్య తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌, టవర్‌ హోటల్‌పై వరుసగా ఆరు పేలుళ్లు జరిపారు. ఇద్దరు ఉగ్రవాదులు షోయబ్‌, ఉమర్‌ హోటల్‌లోకి వెనుక నుంచి చొరబడగా, మరో ఇద్దరు అబ్దుల్‌ రెహమాన్‌ బదా, అబ్దుల్‌ అలీ ప్రధాన ద్వారం నుంచి గ్రెనేడ్లు విసురుతూ… కాల్పులు జరుపుతూ లోపలికి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో ఒబెరాయ్‌ ట్రైడెంట్‌ హోటల్‌పై మిగతా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కొందరిని నిర్బంధించారు. రాత్రి 10.30 గంటలకు కామా ఆసుపత్రి వెనుక మార్గం వద్దకు కసబ్‌, ఇస్మాయిల్‌ చేరుకొగా, అక్కడి సిబ్బంది అప్రమత్తమై రోగులను గదుల్లో పెట్టి తాళాలు వేసి వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. ఈలోగా పోలీసు అధికారులు చేరుకోవడంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఏటీఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గామ్‌దేవి పోలీసు స్టేషన్‌ సిబ్బందిని అడ్డుకొని పోలీసు వాహనాన్ని హైజాగ్‌ చేసే ప్రయత్నంలో ఇస్మాయిల్‌ చనిపోగా, కసబ్‌ పట్టుబడ్డాడు.
నవంబరు 27, 28, 29 తేదీల్లో కౌంటర్‌ టెర్రర్‌ ఆపరేషన్లను ఎన్‌ఎస్‌జీతో పాటు భద్రతా బలగాలు చేపట్టాయి. మిగిలిన ముష్కరులను మట్టుబెట్టాయి. 28వ తేదీ సాయంత్రంలోగా నారిమన్‌ హౌస్‌లో ఉన్న ఉగ్రవాదులు అందరినీ హతమర్చాయి. అదే రోజు మధ్యాహ్నం ఒబెరాయ్‌లోనూ ముష్కరులను అంతం చేయగా అక్కడ 30 మంది చనిపోయినట్లు నిర్థారించారు. 29వ తేదీన తాజ్‌ హోటల్‌లోని ఉగ్రవాదులను మట్టుబెట్టి భద్రతా బలగాలు అంతా సాధారణ పరిస్థితులను తిరిగి నెలకొల్పిగలిగాయి.
26/11 వీరులు… వీరోచితంగా ఉగ్రవాదులను అడ్డుకొని, విధి నిర్వహణలో అమరులైన భద్రతా సిబ్బందిలో మేజర్‌ సందీప్‌ ఉన్నీకృష్ణన్‌, ఏటీస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే, పోలీసు కానిస్టేబుల్‌ తుకారాం ఓంబ్లే ఉన్నారు. మరికొందరు సామాన్యులు సైతం చేతికి అందిందే ఆయుధంగా మల్చుకొని తోటివారిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. తాజ్‌ హోటల్‌లో యునిలివర్‌ కార్పొరేట్‌ ఈవెంట్‌ మేనేజర్‌ మల్లిక జగద్‌ తనతో పాటు 60 మందిని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి హాల్‌ తాళాలు తీసుకొచ్చి అన్ని తలుపులు లాక్‌ చేశారు. కొందరు అతిథులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఉగ్రవాదులు గుర్తిస్తారని వారికి ఎంతగానో సర్దిచెప్పి మరుసటిరోజు ఉదయం ఆర్మీ సిబ్బంది వచ్చేవరకు ఆ 60 మందిని ప్రాణాలు కాపాడారు. నాలుగు పోలీసు జాగిలాలు మ్యాక్స్‌, టైగర్‌, సుల్తాన్‌, సీజర్‌… ఉగ్రవాదులు దాచిపెట్టిన ఆర్డీఎక్స్‌, గ్రనేడ్లు, డిటోనేటర్లను గుర్తించాయి. దీంతో భద్రతా దళాలు వాటిని నిర్వీర్యం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడగలిగాయి. తాజ్‌ హోటల్‌ ప్రాంగణంలోని ఎనిమిది కేజీల ఆర్‌డీఎక్స్‌ను, సీఎస్టీ రైల్వేస్టేషన్‌ వద్ద రెండు గ్రనేడ్లను సీజర్‌ జాగిలం గుర్తించింది. దశాబ్దం పాటు ముంబై పోలీసులకు సేవలందించిన ఈ నాలుగు జాగిలాలు 2015లో రిటైర్‌ అయ్యాయి.1

  1. ↩︎
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు