Friday, May 3, 2024
Friday, May 3, 2024

సిపిఐ 24వ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి

సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య
మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ

ఏలూరు : సిపిఐ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు.
గురువారం స్థానిక సిపిఐ ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో సిపిఐ 24వ జాతీయ మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజా కంటక విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలపై పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనెలు, నిత్యావసర ధరల భారాలతో ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారం చేపడితే నిరుద్యోగ నిర్మూలనకు ప్రతిఏటా 2 కోట్ల ఉద్యోగ కల్పన చేస్తానని ఉన్న ఉద్యోగాలు ఊడబెరికారని ఆరోపించారు. అక్టోబర్ 14 నుండి విజయవాడలో జరిగే జాతీయ మహాసభలకు కాకలు తీరిన కమ్యూనిస్టు యోధులు ప్రతినిధులుగా పాల్గొంటారన్నారు. వీరితోపాటు 30 దేశాల కమ్యూనిస్టు పార్టీ విదేశీ ప్రతినిధులు, వామపక్ష పార్టీల నాయకులు ప్రతినిధులుగా హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభలలో పోరాటాల రూపాలకు, రాబోయే ఎన్నికలలో వామపక్ష, రాజకీయ పక్షాలు ఒకే తాటిపైకి తీసుకువచ్చి మోడీ అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారన్నారు. జాతీయ మహాసభలు జయప్రదం చేయడానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ జాతీయ మహాసభలు
1975లో మన రాష్ట్రంలో జరిగాయని, 47 సంవత్సరాల తర్వాత విజయవాడలో జరుగుతున్నాయని తెలిపారు.
మోడీ అధికారం చేపట్టిన తర్వాత చట్టసభలలో దుందుడుకుతనాన్ని ప్రదర్శిస్తున్నారని, ప్రశ్నించే వారిని వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
రాబోయే కాలంలో చట్టసభలలో సిపిఐ ప్రముఖ పాత్ర వహించే విధంగా జాతీయ మహాసభలలో ప్రణాళిక రూపొందిస్తారని తెలిపారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చిన మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక రైతాంగ ఉద్యమంతో వెనక్కి తగ్గి రైతులకు క్షమాపణ చెప్పారన్నారు .
సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యాంగ వ్యవస్థ పరిరక్షణకై వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాన్ని ఐక్యపరిచి బలోపేతం చేయడానికి మహాసభలలో చర్చించి కార్యాచరణ రూపొందిస్తారని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, సన్నేపల్లి సాయిబాబు, కౌన్సిల్ సభ్యులు మావూరి విజయ, నాగం అచ్యుత్, ఎం. ఏ. హకీమ్, కురెళ్ళ వరప్రసాద్, ఏఐటియుసి నాయకులు కే.కృష్ణమాచార్యులు, ఉప్పులూరి రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img