Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

రాయడమే కాదు… పోరాటమూ అవశ్యమే

. చైతన్యంతో రచనలు కొనసాగించాలి
. యువతను ప్రోత్సహించాలి
. అరసం రాష్ట్ర మహాసభలలో వక్తల పిలుపు

విశాలాంధ్రగుంటూరు/తెనాలి: రచయితలు రాయడమే కాదు... పోరాటం కూడా చేయాలని అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ సుఖదేవ్‌ సింగ్‌ సిర్సా అన్నారు. అభ్యుదయ రచయితల సంఘం(అరసం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 19వ మహాసభలు80వ వార్షికోత్సవాలు గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా ప్రారంభమ య్యాయి. సభా ప్రాంగణానికి అరసం నేత, అభ్యుదయ సాహిత్యోద్యమ నాయకులు, అమరజీవి బొల్లిముంత శివరామకృష్ణ సాహిత్య ప్రాంగణంగా నామకరణం చేయగా, ప్రజా సాంస్కృతికోద్యమ నేత, అమరజీవి నేతి పరమేశ్వర శర్మ సాహిత్య వేదికపై ప్రారంభ సభ జరిగింది. మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగా స్వాగతం పలుకగా అరసం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్‌ సుఖదేవ్‌ సింగ్‌ సిర్సా ప్రారంభోపన్యాసం చేస్తూ నేడు దేశం చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉందని అన్నారు. పాలక వర్గాలు, కార్పొరేట్‌ శక్తులు రచయితలను అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, వారికి అనుకూలంగా వ్యవహరించకపోతే దాడులు చేయడానికి సైతం వెనుకాడటం లేదని అందోళన వ్యక్తం చేశారు. దేశంలో అనేక ప్రాంతాలు, అనేక భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికి వారందరూ ఐక్యంగా ఉంటున్నారని, అయితే ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి హిందూత్వశక్తులు కృషి చేస్తున్నాయని చెప్పారు. దేశ సంస్కృతిని సంరక్షిం చేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని, అదేవిధంగా వారికి వ్యతిరేకులుగా ఉన్న ప్రజల ఇళ్ళను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిని అర్బన్‌ నక్స లైట్లుగా, పాకిస్తానీవాదులుగా చిత్రీకరిస్తున్నార న్నారు. ఇప్పటికే గోవింద్‌ పన్సారే, కాల్‌బుర్గి, గౌరీలంకేశ్వర్‌ వంటి ప్రజాస్వామ్య లౌకికవాదులను హత్య చేశారని గుర్తుచేశారు. వరవరరావు వంటి వారిని జైల్లో నిర్భందించారని చెప్పారు. ఇటువంటి పరిస్థితులపై రచయితలు చైతన్యవంతులై రచన లను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. మనం ఎవరి కోసం… ఎందుకోసం రచనలు చేస్తున్నామనే విషయాన్ని ప్రతి రచయిత కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దిల్లీ రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో పంజాబ్‌లో నూతన వరఒడి ప్రారంభమైందని, కొత్తతరం… వారి మనస్సులో ఉన్నది రచనలు, గేయాల రూపంలో బయటకు తెస్తున్నారని, ఈ ఒరవడి అక్కడి ఉద్యమానికి జోష్‌ నిస్తుందని చెప్పారు. ఈ విధానాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరింపచేయాల్సిన అవసరం ఉందని సిర్సా అన్నారు.
అంబేద్కర్‌, పూలే ఆలోచన విధానాలను తీసుకోవాలి: కత్తి పద్మారావు
మార్క్స్‌, లెనిన్‌తో పాటు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, జ్యోతిరావుఫూలే ఆలోచన విధానాలను కూడా అరసం పరిగణలోనికి తీసుకోవాలని సుప్రసిద్ధ అభ్యుదయ కవి, సాహితీవేత్త డాక్టర్‌ కత్తి పద్మారావు కోరారు. మహాసభలలో ఆయన కీలకోపన్యాసం చేస్తూ అరసం నుంచే అనేక సాహితీ ప్రక్రియలు ప్రభావం పొందాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులలో లాల్‌`నీల్‌ రెండు కలిసి ముందుకు నడవాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.
కలాలకు పదును పెట్టాల్సిన సమయం: ఎస్వీ
ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగించే సాహిత్యానికి అరసం కృషి చేస్తోందని అరసం జాతీయ నేత ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ అన్నారు. అభ్యుదయ పత్రిక ద్వారా ఎంతో మంది రచయితలను వెలుగులోకి తెచ్చిందని అన్నారు. అరసం 80 సంవత్స రాల ఉద్యమ ప్రస్థానంపై ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు అనేక ఆర్థిక, రాజకీయ, సామాజిక ఉద్యమాలలో అరసం ప్రత్యక్షంగా పాల్గొం దని గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో సైతం అభ్యుదయ రచయితలు తమ కలాలకు పదును పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాజకీయ ఖైదీల విడుదల కోసం జరిగిన ఉద్యమం, విద్యుత్‌ ఉద్యమంలో కూడా అరసం ముందు వరుసలో నిలిచిందని తెలిపారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, అదానీకరణ, అంబానీకరణలపై కూడా అనేక రచనలు తెచ్చినట్లు చెప్పారు. మానవ సంబం ధాలు రోజు రోజుకు కనుమరుగవుతున్న తరుణంలో అభ్యుదయ రచయితలు తమ కలాలకు మరింత పదునుపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అరసంపై బాధ్యత పెరిగిందని, మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రగతిశీల సాహిత్య సంస్థలతో కలిసి పనిచేయాలని ఎస్వీ సత్యనారాయణ పిలుపునిచ్చారు.
యువతరాన్ని ప్రోత్సహించాలి: సాయిమాధవ్‌
యువతను చైతన్యవంతులను చేసి అభ్యుదయ భావాల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్‌ బుర్రా సాయిమాధవ్‌ అన్నారు. రచనలు ఎలా చేయాలనే అంశంపై వారికి ప్రతి నెలా ప్రతి జిల్లాలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, వారి రచనలను ప్రచురిస్తామనే భరోసాను వారిలో కల్పించే బాధ్యతను అరసం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా రచయితలను పెంచుకుంటూ… రచనలను పంచుకోవాలని సూచించారు.
క్రియాశీలంగా పనిచేస్తున్నాం: రాచపాళెం
తెలుగునాట అరసం క్రియాశీలంగా పనిచేస్త్తోం దని అరసం రాష్ట్ర అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. ప్రజా సాహిత్య ఉత్పత్తికి, ప్రచారం చేయడానికి, ప్రజా సాహిత్య రచన శిక్షణ ఇవ్వడంలో కూడా అరసం కృషి చేస్తున్నదన్నారు. అరసం శాఖలు కూడా సాహిత్య వ్యవసాయాన్ని చేస్తున్నాయని అన్నారు. ‘ప్రశ్నను ఆహ్వానించు… సమాధానం చెప్పు’ అనే నినాదంతో ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు విభాగ పూర్వ అధ్యక్షులు ప్రొఫెసర్‌ గుజ్జర్లమూడి కృపాచారి, అరసం జాతీయ కార్యదర్శి వినీత్‌ తివారి, కార్యవర్గ సభ్యులు వేల్పుల నారాయణ, రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్‌ పి.సంజీవమ్మ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాపోలు సుదర్శన్‌, ప్రజానాట్యమండలి జాతీయ కార్యదర్శి గని తదితరులు ప్రసంగించారు. తొలుత సంజీవమ్మ అరసం పతాకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి అధ్యక్షులు పి.చంద్రానాయక్‌ గురజాడ దేశభక్తి గీతాలాపన చేశారు. ఈ సంద ర్భంగా అమరావతి మిర్రర్‌(అరసం మహాసభల ప్రత్యేక సంచిక), పి.సంజీవమ్మ రచించిన జీవని (సాహిత్య వ్యాస సంపుటి)ని అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.ఓబులేసు ఆవిష్కరించారు. నేతి పరమేశ్వరశర్మ స్మారక సంచిక క్రాంతిశర్మ కళా ప్రస్థానంను మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు బుర్రా సాయిమాధవ్‌, మందలపర్తి కిషోర్‌ రచించిన ఇరవైలో అరవై(అభ్యుదయ సాహిత్య చరిత్ర)ను ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img