విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని టీడీపీ మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి మునెప్ప, నాయకులు మల్ధకల్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో మంత్రాలయం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి, మండల మాజీ అధ్యక్షులు గవిగట్టు ఈరన్న ఆదేశాల మేరకు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం తదితర పథకాలు అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం హయాంలో అధిక విద్యుత్ బిల్లులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ట్రూ – డౌన్ ద్వారా ఛార్జీలను యూనిట్ కు 13 పైసలు తగ్గించడం ద్వారా ప్రజలపై విద్యుత్ భారం తగ్గిందని వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


