Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎడతెగని యుద్ధానికి ఏడాది పూర్తి

ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్యగా మొదలైన తగాదా పూర్తిస్థాయి యుద్ధంగా రూపుసంతరించుకొని నేటికి అంటే మార్చి 24కి ఏడాది పూర్తిచేసుకుంది. కనుచూపుమేరలో ఆగే సూచనలు కాదు కదా తగ్గే సూచనలు కూడా లేవు. ప్రపంచ ఆర్ధికస్థితికి అపారనష్టం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ వెనుక అమెరికా, నాటో దేశాలు బహిరంగంగానే నిలుచున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధభూమిలోకి సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడే ప్రత్యక్షమై రష్యాకు వ్యతిరేకంగా తన పూర్తిమద్దతు తెలియజేశాడు. రష్యా ఒంటరిగా కనబడుతున్నా దానివెనుక చైనా, ఇరాన్‌, ఉత్తర కొరియా తామున్నామంటూ స్పష్టంగానే తెలియజేస్తున్నాయి. అటు తిరిగీ ఇటు తిరిగీ దెబ్బ మాత్రం ప్రపంచ దేశాలన్నిటికీ గట్టిగానే తగులుతోంది. ముఖ్యంగా ఆహార పదార్ధాలు, ఇంధనం తీవ్ర కొరత ననుభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతూపోతోంది. రష్యా చుట్టుపక్కల దేశాల్లో వ్యాపిస్తూ నాటోకూటమి ఆ దేశాన్ని అభద్రతాభావంలోకి నెట్టింది. ఉక్రెయిన్‌కూడా నాటో ప్రభావంలోకి జారితే తన భద్రతకు ముప్పుగా భావించి రష్యా ఆ దేశాన్ని కట్టడిచేయాలని భావించింది. దీనిని యూరప్‌, అమెరికాల మద్దతుతో ఉక్రెయిన్‌ బలంగా తిప్పికొడుతూ వస్తోంది. వెరసి ఇరువైపులా భీకరపోరు సాగుతోంది. బదులుగా అమెరికా విధించిన ఆర్థికఆంక్షలు రష్యాపై పెద్ద ప్రభావం చూపడం లేదు. భారత్‌ తెలివిగా ఈ యుద్ధంలో ఎవరి పక్షమూ వహించలేదు. ఇరుదేశాలతో సమానదూరం పాటిస్తోంది. తరచి చూస్తే రష్యాకి కొంత దగ్గరగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతున్నా ఉక్రెయిన్ని దాని వెనుక పశ్చిమాది దేశాల్ని దూరం చేసుకోలేదు. ఇది మంచి దౌత్య వ్యూహం. అయితే ఈ బ్యాలెన్స్‌ ఎంతవరకూ సాగుతుందో ఎవరూ చెప్పలేరు. ఐక్యరాజ్యసమితి బలహీన ప్రభావానికి ఈ యుద్ధం అద్దం పడుతోంది. ఏమీ చెయ్యలేని దాని స్థితిని వేలెత్తి చూపుతోంది. ఈ సంక్లిష్ట సమయాల్లో బలమైన తీర్పరిగా దేశాల కూటమి ఉండడం ఎంతో అవసరం. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చకుండా, దీర్ఘకాలం లాగకుండా ప్రపంచదేశాలు మేలుకోవాలి. భారత్‌ నడుం బిగించాల్సిన అవసరం ఉంది.
డా. డి.వి.జి.శంకరరావు, సెల్‌: 94408 36931

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img