Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందాం

. అగ్రిగోల్డ్‌ బాధిత డిపాజిట్‌దారుల సత్యాగ్రహ దీక్షలో అఖిలపక్ష నేతలు
. బాధితులకు చేసిన న్యాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి : రామకృష్ణ, తులసిరెడ్డి, శ్రీనివాసరావు, చలసాని
. జూన్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం : ముప్పాళ్ల

విశాలాంధ్ర – విజయవాడ : అగ్రిగోల్డ్‌ బాధితులు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవటానికి సిద్ధం కావాలని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో జరుగుతున్న పోరాటంలో భాగంగా మూడవ రోజు శుక్రవారం విజయవాడ దాసరి భవన్‌ వద్ద బాధితుల సామూహిక సత్యాగ్రహ దీక్ష జరిగింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు అధ్యక్షత వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంఫీుభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి అగ్రిగోల్డ్‌ బాధితుల పక్షం ఉంటారో లేక కంపెనీ యాజమాన్యం పక్షం ఉంటారో తేల్చుకోవాలని అన్నారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి సత్యాగ్రహంలో పాల్గొన్న అగ్రిగోల్డ్‌ బాధితులకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎన్‌.తులసిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు, బాలకోటయ్య తదితరులు పూల దండలు వేసి దీక్షను ప్రారంభింపజేశారు.
మడమ తప్పటమే జగన్‌ విధానం : తులసిరెడ్డి
ఆరు మాసాల్లో న్యాయం చేస్తానని అగ్రిగోల్డ్‌ బాధితులకు చెప్పిన సీఎం 46 మాసాలు గడిచినా న్యాయం చేయలేకపోవటం క్షంతవ్యం కాదన్నారు. మ్యానిఫెస్టోను చితు కాగితం చేశారని విమర్శించారు. సీఎం జగన్‌ మడమ తిప్పటమే తన విధానం అని నిరూపించుకున్నాడని చెప్పారు. అగ్రిగోల్డ్‌ బాధితుల అన్ని రకాల సమస్యలను, కంపెనీ మోసాలను సమగ్రంగా పరిశీలించి బాధితులందరికీ పూర్తి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
మాట తప్పితే మట్టికరిపిస్తాం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితులను నమ్మించి, డిపాజిట్లు కట్టించుకుని నమ్మకద్రోహం చేసిన కంపెనీ పక్కన ప్రభుత్వం నిలిచిందని విమర్శించారు. గడపగడపకు వస్తున్న మంత్రులను, ఎమ్మెల్యే లను నిలదీయాలని బాధితులకు సూచించారు. కంపెనీ ఆస్తులను ఎక్కడికక్కడ దోచుకుందామనే దురుద్దేశంతో ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పితే, మట్టికరిపించేలా ఉద్యమించాలని,అందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
బడ్జెట్‌ సమావేశాల్లోగా సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి : ముప్పాళ్ల
అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసి యేషన్‌ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌మోహన్‌ రెడ్డి… మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారం రోజుల్లో రూ.1,182 కోట్లు కేటాయించి 14 లక్షల మంది రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి డబ్బు చెల్లిస్తానని, ఆరు మాసాలు దాటకుండా మొత్తం బాధితులకు పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్‌ కంపెనీ యాజమాన్యం దుర్మార్గాలను తాను చూసుకుం టానని, కోర్టు కేసుల విషయం తనదే బాధ్యత అని, అగ్రిగోల్డ్‌ కంపెనీ ఆర్థిక మోసం కారణంగా మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా పువ్వుల్లో పెట్టి ఇంటికి పంపిస్తానని బాధితుల సభలో, పాదయాత్ర సందర్భంగా పదే పదే హామీ ఇచ్చి ఓట్లు పొందారని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కంపెనీపై అదనంగా ఒక్క కేసు నమోదు చేయలేదని, పైగా అటాచ్‌ చేసి ఆస్తులను, బినామీ ఆస్తులను అమ్ముతున్నా సీఐడీ పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం చేసిన న్యాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోపు బాధితుల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.
ఓటర్లకు డబ్బులు పంచటం కాదు బాధితులకు న్యాయం చేయండి : చలసాని
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓట్లు కోసం డబ్బులు పంచే కార్యక్రమాలు కాకుండా అగ్రిగోల్డ్‌ కంపెనీ మోసాలకు బలైన ఆపన్నులకు ఇవ్వాలన్నారు. పంచే లాభాలు కాకుండా అసలు వస్తే చాలు అనే పరిస్థితికి బాధితులను తీసుకువచ్చారన్నారు. సమష్టి ఉద్యమాలతో చివరి పైసా వచ్చే వరకూ ప్రభుత్వంపై, అగ్రిగోల్డ్‌ కంపెనీపై పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. అమరావతి దళిత బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రికి పేదలు, దళితులపై ఏమాత్రం ప్రేమ లేదని, ప్రభుత్వ సొమ్మును పంచేది ఓట్లు కోసం తప్ప పేదల క్షేమంకోరి కాదన్నారు. తన పదవి కోసం వాగ్దానాలను చేయటం, వాటిని పూడ్చిపెట్టటం జగన్‌కు పరిపాటి అని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయలక్ష్మీ, పెన్మెత్మ దుర్గాభవాని, జాతీయ నవక్రాంతి పార్టీ నాయకులు కనకం శ్రీనివాసరావు, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఇ.వి.నాయుడు, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్‌. మల్లికార్జున, ఉప ప్రధాన కార్యదర్శి బి.వి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బాధితులందరికీ న్యాయం జరిగే వరకు పోరాటాన్ని అకుంఠిత దీక్షతో కొనసాగిస్తామని తెలిపారు. ఉచిత సంక్షేమ పథకాలు అడగటం లేదని, ప్రజలు కట్టిన పన్నుల నుంచి డబ్బులు ఇవ్వమని కోరటం లేదని, కంపెనీకి కూడబెట్టిన ఆస్తులను అమ్మి బాధితులకు చెల్లించాలని కోరుతున్నామన్నారు. మా బాధితుల సభకు వచ్చి, నిమ్మరసం ఇచ్చి మనందరి ప్రభుత్వం వచ్చాక తక్షణ న్యాయం అన్న పెద్ద మనిషి కంపెనీకి అండగా ఉన్నాడా? అనే అనుమానం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, గుంటూరు నగర కార్యదర్శి మాల్యాద్రి, అసోసియేషన్‌ నాయకులు శ్రీనివాసరావు, జయసింహా, సిద్ధేశ్వర్‌, మంత్రు నాయక్‌, నాగలక్ష్మీ, అంజనీదేవి, ఆరేళ్లమ్మ, లోవరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 11 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు తక్షణ న్యాయం కోసం ఈ బడ్జెట్‌లో 3 వేల కోట్ల రూపాయలు కేటాయించి డిపాజిట్‌ సొమ్ము చెల్లించాలని సామూహిక సత్యాగ్రహ దీక్ష వేదిక నుంచి ఏకగ్రీవ తీర్మానం ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఐడీ విభాగం అగ్రిగోల్డ్‌ యాజమాన్యం అక్రమాలను అరికట్టి బాధితులకు న్యాయం చేకూర్చే విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలని కోరారు. అగ్రిగోల్డ్‌ కేసులను మాత్రమే రోజువారీ విచారణ చేసేలా ఏలూరులోని ప్రత్యేక కోర్టు పరిధిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చనిపోయిన అగ్రిగోల్డ్‌ బాధితుల కుటుంబాలకు సీఎం ఇచ్చిన హామీ మేరకు రూ.10 లక్షలు చెల్లించాలని కోరారు. ఏప్రిల్‌ 5న మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులతో విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించాలని, ఏప్రిల్‌ 25న అగ్రిగోల్డ్‌ కంపెనీ మోసాలకు బలై ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

బడ్జెట్‌లో నిధులెందుకు కేటాయించలేదు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించినా ఈ సమస్య పరిష్కారం అయ్యేదని అన్నారు. రూ.2,79,279 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవటానికి ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటనకు వచ్చినా అక్కడ బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉందని అర్థం అవుతోందన్నారు. మూడు నెలల్లో అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులు చేస్తున్న సుదీర్ఘ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఓటుకు రూ.10 వేలు ఇవ్వటం, దొంగ ఓట్లు వేయించటం వంటి చర్యలకు పాల్పడి ఎన్నికలంటే ఓటర్లను సంతలో పశువులాగా కొనటంగా ఈ సీఎం మార్చారని ఆయన విమర్శించారు. బడ్జెట్‌లో బాధితులకు న్యాయం జరగకపోతే తాడోపేడో తేల్చుకునేటట్లు ఉద్యమాలు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img