Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

డీఎస్సీ లేనట్లే !

. టీచర్‌ ఖాళీలు 717 మాత్రమేనట
. నిరుద్యోగులకు జగన్‌ సర్కారు టోపీ
. నాలుగేళ్ల నుంచి అభ్యర్థుల ఎదురుచూపు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
ఉపాధ్యాయ పోస్టుల నియామకాల కోసం నిర్వహించే డీఎస్సీపై జగన్‌ ప్రభుత్వం చట్టసభల సాక్షిగా సత్యదూరమైన సమాచారం ఇచ్చింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు. 2019 నుంచి ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీల సంఖ్య, నియమించిన ఉపాధ్యాయుల వివరాలు వెల్లడిరచాలని టీడీపీ సభ్యులు ఎన్‌ఎండీ ఫరూఖ్‌, దువ్వారపు రామారావు శాసనమండలిలో ప్రశ్నించారు. దీనికి విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ పొంతనలేని సమాధానం ఇవ్వడం ఆశ్చర్యమనిపించింది. 2019 నుంచి 14,219 మంది ఉపాధ్యాయులను నియమించినట్లు మంత్రి బొత్స చేసిన ప్రకటననను పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు తీవ్రంగా తప్పుపట్టారు. గత డీఎస్సీల్లో అర్హత సాధించిన అభ్యర్థులను అరకొరగా కాంట్రాక్టు పద్ధతిలో నియమించి…వాటిని లెక్కగా చూపడాన్ని ఆక్షేపించారు. వాస్తవంగా జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇంతవరకూ ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు. పైగా డీఎస్సీ ఖాళీలు 717 మాత్రమే ఉన్నాయని మంత్రి చెప్పడంపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ముందైనా జంబో డీఎస్సీ ప్రకటన వస్తుందని ఆశిస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వ సమాధానం దిమ్మతిరిగేలా చేసింది. డీఎస్సీలు తరచూ నిర్వహించాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు మంత్రి బొత్స చెప్పడం…దాటవేతగానే అనుమానిస్తున్నారు. చంద్రబాబు హయాంలో 2018లో డీఎస్సీ నిర్వహించారు. అందులో ఎంపికైన 7254 మంది అభ్యర్థులను జగన్‌ అధికారంలోకి వచ్చాక 2021లో నియమించారు. ఆ డీఎస్సీ జగన్‌ ప్రభుత్వ ఖాతాలోకి రాదు. దానిని లెక్కల్లో చూపడాన్ని ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాల నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
నూతన డీఎస్సీ ఆశలపై నీళ్లు
నూతన డీఎస్సీ కోసం నాలుగేళ్ల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులపై ఈ ప్రభుత్వం నీళ్లు చల్లినంత పనిచేసింది. ఉపాధ్యాయ ఖాళీలను తక్కువ చేసి చూపింది. వాటి భర్తీ కోసం డీఎస్సీ ఎప్పుడు నిర్వహించేదీ స్పష్టత ఇవ్వలేదు. 2009 డీఎస్సీలో ఎంపికైన 1910 మంది అభ్యర్థులను 2021లో కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. డీఎస్సీ 2018లో ఎంపికైన 7254 మంది అభ్యర్థులను 2021లో నేరుగా నియమించారు. డీఎస్సీ`1998లో ఎంపికైన 4534 మంది అర్హత కలిగిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది మార్చి 15వ తేదీన వారిని ఎంటీఎస్‌ (మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌) పద్ధతిలో పోస్టింగ్‌ ఇచ్చారు. 507 బ్యాక్‌లాగ్‌ పోస్టుల కోసం ఈ ఏడాది ప్రభుత్వం ప్రకటన జారీజేసినప్పటికీ…దానిని హైకోర్టు నిలుపుదల చేసింది. 2019లో ప్రత్యేక డీఎస్సీ ద్వారా 521 పోస్టులతోనే సరిపెట్టారు. దీంతో జగన్‌ నాలుగేళ్లలో ఇప్పటివరకూ ఒక్క జనరల్‌ డీఎస్సీ ఇవ్వకపోవడంపై ఉపాధ్యాయ నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
25 వేల పోస్టుల గల్లంతు
జగన్‌ అధికారంలోకి వచ్చిన సమయంలో 25 వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు లెక్కలు చెప్పాయి. ఈ నాలుగేళ్లలో ఒక్క జనరల్‌ డీఎస్సీ ఇవ్వలేదు. దీంతో ఆయా పోస్టులు పెరగకపోగా, కుదించుకుపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టులు కుదించుకుపోవడానికి కారణాలను పరిశీలిస్తే…ఇంగ్లీషు మాధ్యమం పేరుతో తెలుగు మాధ్యమ ఉపాధ్యాయులను కుదించివేయడం, ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం, ఉపాధ్యాయుల వయోపరిమితి 62 ఏళ్లకు పెంచడం, క్రమబద్ధీకరణ పేరుతో ఉపాధ్యాయుల పోస్టులు రద్దు చేయడం వెరసి ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోయాయి. ఇప్పటికిప్పుడు డీఎస్సీ ప్రకటిస్తే దాని ద్వారా 717 ఉద్యోగాల భర్తీయే జరుగుతుందని ప్రభుత్వం నొక్కిచెప్పింది. ఇది పూర్తిగా నిరుద్యోగులను జగన్‌ ప్రభుత్వం దగా చేయడమేనని, పాత డీఎస్సీ నియామకాలను జనరల్‌ డీఎస్సీ ఖాతాలో వేసి నిరుద్యోగులను ప్రభుత్వం మాయ చేస్తోందని, ఇప్పటికైనా జగన్‌ స్పందించి జంబో డీఎస్సీ ప్రకటించాలని, లేకుంటే ఆందోళనకు దిగుతామని నిరుద్యోగ యువత హెచ్చరిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img