Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

బీజేపీపై సీపీఐ రణభేరి

. ప్రచార కార్యక్రమాలు విజయవంతం చేయాలి
. రేపు విజయవాడలో రౌండ్‌టేబుల్‌
. జగనన్న ఇళ్లు, టిడ్కో సమస్యలపై దృష్టి సారించాలి
. ప్రతిష్ఠాత్మకంగా రాజకీయ శిక్షణ తరగతులు
. మేడేలో పార్టీ శ్రేణులంతా భాగస్వాములు కావాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, నిరంకుశ పాలనపై సీపీఐసీపీఎం అధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 30 వరకు చేపట్టిన ప్రచారయాత్రలను, సభలను దిగ్విజయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రకార్యవర్గ సమావేశం విజయవాడ చంద్రం బిల్డింగ్‌ నుంచి ఆదివారం సాయంత్రం జూమ్‌ యాప్‌ ద్వారా జరిగింది. సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌ అధ్యక్షత వహించగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఇన్సాఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సయ్యద్‌ అఫ్సర్‌, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుట్ట రాయప్ప తదితరులు హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా, నగర కార్యదర్శులు హాజరయ్యారు.
రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడుగడుగునా అప్రజాస్వామిక విధానాల్ని అవలంబిస్తోందని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీజేపీ విధానాల్ని వ్యతిరేకిస్తూ జాతీయ పార్టీల పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 14 నుంచి 30 వరకు జరిగే ప్రచార యాత్రలు, సభలు విజయవంతం చేయాలని, వాటిలో పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు భాగస్వాములు కావాలన్నారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ ప్రచారయాత్రల సభలకు సీపీఐ, సీపీఎం జాతీయ నేతలను ఆహ్వానించేలా దృష్టి సారించామని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికిగాను పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేయనున్నామన్నారు. రాష్ట్రంలో జగన్‌ హయాంలో దళిత, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను ఖండిస్తూ ఈనెల 4వ తేదీన విజయవాడలో సీపీఐ తరపున రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలను ఆహ్వానిస్తున్నామని, ఈ రౌండు టేబుల్‌ విజయవంతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ల సమస్యలపై అన్ని పట్టణ కేంద్రాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలన్నారు. జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ల సమస్యలపై ప్రభుత్వ విధానాలను పూర్తిగా తిప్పికొట్టాలని, లబ్ధిదారులను చైతన్యవంతుల్ని చేయాలని కోరారు.
ఏఐటీయూసీ అధ్వర్యంలో నిర్వహించనున్న మేడేలో పార్టీ శ్రేణులు పూర్తిగా భాగస్వామ్యం కావాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగిన ఉద్యమంలో ఏఐటీయూసీ, సీపీఐ ఉద్యమపాత్రను ఆయన వివరించారు. ప్రాంతాల వారీగా పార్టీ అనుబంధ ప్రజాసంఘాలు రాజకీయ శిక్షణ తరగతులను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, వాటి విజయవంతానికి పార్టీ శ్రేణులు పూర్తిగా సహకరించాలని కోరారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల్లో పోటీకి సిద్ధమయ్యే అసెంబ్లీ నియోజకవర్గాలపైనా పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని రామకృష్ణ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img