Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రైతు ఉద్యమ యోధ కొల్లి నాగేశ్వరరావు

కొల్లి నాగేశ్వరరావు

రైతు ఉద్యమాలు ఊపిరిగా పోరుసలిపిన, కమ్యూనిస్టుపార్టీకి అంకితమై పనిచేసిన నాయకుడు కొల్లి నాగేశ్వరరావు 1937 ఏప్రిల్‌ 7వ తేదీన కృష్ణాజిల్లా, నూజివీడు తాలూకా గుల్లపూరి శివారు గుడిపాడు గ్రామంలో జన్మించారు. విద్యార్థి దశలో ఆయన అనేక ఉద్యమాలు నిర్వహించారు. ప్రజా సమస్యలపై, రైతాంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం జరిపారు. రైతాంగాన్ని నట్టేట ముంచుతున్న విత్తన సంస్థపై సుప్రీంకోర్టులో పోరాటం సలిపారు. భార్యని, సంతానాన్ని వామపక్ష భావాల వైపు నడిపించిన నాయకుడు కొల్లి నాగేశ్వరరావు. తల్లి రమణమ్మ, తండ్రి వెంకయ్య. వ్యవసాయ కుటుంబం. నాగేశ్వరరావు తనకు ఊహ తెలిసినప్పటి నుంచి వ్యవసాయంలోని ఒడిదుడుకులు, రైతాంగ సమస్యలు, వారు పడుతున్న కష్టాలు, కడగండ్లు గమనిస్తూ ఉండేవారు. అన్నదాతగా కీర్తిపొందిన రైతన్న ఎదుర్కొంటున్న కష్ట, నష్టాలను ఆకళింపు చేసుకున్నారు. వాటి నుంచి అన్నదాత బయట పడే మార్గాలు ఏమిటి? అని ఆలోచిస్తూనే చదువు సాగించేవారని వారి సన్నిహితులు చెపుతారు. ప్రాథమిక విద్యను గుడిపాడులో, ప్రాథమికోన్నత విద్యను నూజివీడులో, డిగ్రీ విజయవాడలోని ఎస్‌.ఆర్‌.ఆర్‌ అండ్‌ సి.వి.ఆర్‌ ప్రభుత్వ కళాశాలలో చదివారు. అటు తర్వాత బీహారు రాష్ట్రంలోని భాగల్పూర్‌ విశ్వవిద్యాలయం నుంచి ప్రైవేటుగా పరీక్ష రాసి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకున్నారు.
జన్మస్థలమైన గుడిపాడు గ్రామం కమ్యూనిస్టు పార్టీ ప్రభావంలో వుండేది. 1942లోనే ఆ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ శాఖ ఏర్పడిరదని చెపుతారు. ఆ కాలంలో కమ్యూనిస్టు పార్టీ బాలల కోసం ఒక సంఘం ఏర్పాటు చేసింది. అప్పటికి నాగేశ్వరరావుకు నాలుగేళ్లు. బాలల సంఘం కార్యక్రమాలలో పాల్గొన్నారు. బాలల సంఘం నిర్వాహకులు సమాజ శ్రేయస్సును కోరిన వారు కావటంతో నాగేశ్వరరావుకు తల్లిదండ్రులు అడ్డు చెప్పేవారు కారు. హైస్కూలు చదువు నాటికి ఏఐఎస్‌ఎఫ్‌ వైపు దృష్టి సారించారు. విజయవాడ కళాశాలలో చదువుతున్న కాలంలో విజయవాడ నగర ఏఐఎస్‌ఎఫ్‌ బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత కృష్ణాజిల్లా ఏఐఎస్‌ఎఫ్‌ బాధ్యతలు, ఆ పైన ఆంధ్రప్రదేశ్‌ ఏఐఎస్‌ ఎఫ్‌ కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. 1965లో కృష్ణాజిల్లా యువజన సమాఖ్య కార్యదర్శిగా నియమితులై, విద్యార్థులను, యువతరాన్ని అభ్యుదయ మార్గంలో నడిపించే ప్రయత్నం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకత్వం దృష్టిలో పడిన నాగేశ్వరరావు 1967లో విజయవాడ నగర సీపీఐ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1968లో సీపీఐ విజయవాడ నగర తాత్కాలిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1974 నాటికి పార్టీలో ప్రమోషన్‌ అందుకున్నారు. ఆ ఏడాది సీపీఐ కృష్ణాజిల్లా సహాయ కార్యదర్శిగా నియమితులై, 1991 వరకూ పార్టీ విస్తరణ కార్యక్రమాల్లో నిర్విరామంగా కృషిచేశారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే, బాల్యం నుంచి వ్యవసాయంలోని ఒడిదుడుకులను ఆకళింపు చేసుకున్నారు కాబట్టే రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కూడా శ్రమించేవారు. 1992లో నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 2003 వరకూ కొనసాగారు. 1998లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికై 2003 వరకూ కొనసాగారు. ఆ తర్వాత సీపీఐ జాతీయసమితి సభ్యులై 2005 వరకూ కొనసాగారు. 2003 నుండి 2006 వరకూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం అధ్యక్షులుగా గురుతర బాధ్యతలు నిర్వర్తించారు. 2003లోనే అఖిలభారత కిసాన్‌సభ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
పార్టీ కార్యక్రమాలకే పరిమితంకాకుండా ప్రజాహిత కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొనేవారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరాహారదీక్ష ప్రారంభించి ప్రాణాలు విడిచిన పొట్టి శ్రీరాములు తర్వాత అదే బాటలో ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1966లో మొదలైన ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ ఉద్యమానికి కన్వీనరుగా బాధ్యతలు నిర్వహించారు. 1986లో కృష్ణా జిల్లాలో మిగులు భూములు, బంజరు భూములు పంపిణీకై ఏర్పాటైన కమిటీ కన్వీనరుగా పనిచేశారు. ప్రపంచమే వ్యవసాయం మీద ఆధారపడి వుంది. ప్రతి మనిషి రైతు పండిరచే ఆహారమే తినాలి, బతకాలి. అలాంటి రైతుకు మేలుజాతి విత్తనాలు అవసరమని ప్రపంచ పరిశోధకులంతా విశ్వసిస్తున్నారు. అంతర్జాతీయంగా విత్తన పంపిణీ చేస్తున్న ‘మోన్‌ శాంటో’ అనే విత్తనసంస్థ నాసిరకం విత్తనాలను సరఫరాచేసి, వ్యవసాయ దిగుబడులు తగ్గించి, రైతాంగాన్ని నష్టపరుస్తున్న విషయాన్ని గ్రహించిన నాగేశ్వరరావు, ఆ సంస్థపై సుప్రీంకోర్టులో దావావేసి రైతులపక్షాన సుదీర్ఘపోరాటం జరిపారు.
1998లో రాష్ట్ర వ్యాపితంగా పర్యటనలు నిర్వహించారు. రాష్ట్రంలో విరివిగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యల నుంచి రైతుల్ని దారి మళ్లించే ప్రయత్నంలో భాగంగా 1998 మే, జూన్‌ నెలల్లో రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించారు. దానికి ‘రైతాంగ సమర శంఖం’ అని పేరుకూడా పెట్టారు. 1998-99ల్లో తెలంగాణకు గోదావరి జలాల వినియోగ ఉద్యమం నిర్వహించారు. ఈ సమస్య పరిష్కారానికి 1999 మార్చి 22న హైదరాబాదు శాసనసభ వద్ద నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించారు. మార్చి 24న ఈ విషయంపై శాసనసభలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం ఆమోదం తెలిపే వరకూ కొనసాగించారు.
1962లో హెల్సింకీలో జరిగిన ప్రపంచ యువజనోత్సవాల్లో పాల్గొన్నారు. ప్రపంచ యువజన మహాసభలో పాల్గొనటానికి రష్యా వెళ్లి వచ్చారు. 1973లో నాగేశ్వరరావు చెకొస్లో వేకియాలో పర్యటించారు. 1993, 1995లో ‘ప్రపంచ వాణిజ్య సంస్థ-ప్రజల అప్రమతలు’ అనే పుస్తకం వెలువరించారు. 2001లో ‘ప్రపంచ వాణిజ్య సంస్థ`రైతాంగం రక్షణలు’, 2003లో ‘బచావత్‌ అవార్డు-కృష్ణా గోదావరి జలాల వినియోగ వివాదాల పరిష్కారం’, 2005లో ‘ఆంధ్రప్రదేశ్‌ జలదర్శిని’, 2006లో ‘తెలంగాణకు గోదావరి జలాల వినియోగం’ లాంటి అతి విలువైన రచనలు వెలువరించారు. ఇవేకాక, వ్యవసాయానికి సహకారం అందించే ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, వ్యవసాయ సమస్యలు, డబ్ల్యూటీఓపై అతి విలువైన వ్యాసాలు రాశారు. వాటిని విశాలాంధ్ర దినపత్రిక క్రమం తప్పకుండా ముద్రించేది. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ‘రైతులోకం’ మాసపత్రిక సంపాదకులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
1961 నాటికే సీపీఐ సభ్యులైన టాన్యాను వివాహమాడారు. పెద్ద కుమార్తె ప్రగతి, చిన్న కుమార్తె ప్రశాంతిలే కాక ఆయన మనుమలు. మనుమరాళ్లు కూడా మార్క్సిజం, లెనినిజం, సోషలిజంపై విశ్వాసం కలిగి ఉన్నారు. ఉద్యమాలకే తన పూర్తి జీవితాన్ని అంకితం చేసిన కొల్లి నాగేశ్వరరావు 2020 మే 20న కన్నుమూశారు.
దాసరి ఆళ్వారస్వామి, చరవాణి: 93939818199

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img