Friday, April 26, 2024
Friday, April 26, 2024

యువభారతం నైపుణ్యాల నెలవు కావాలి..!

‘‘నైపుణ్యాలను సరైనధరకు అమ్ముకోవాలేకాని, ఆత్మను అంతరాత్మను ఎన్నటికీ అమ్ముకోరాదని’’ నాటి అమెరికా అధ్యక్షులు అబ్రహం లింకన్‌ పేర్కొనడం మనకు తెలుసు. దీనిని మనందరం గుర్తుంచుకోవాలి. జీవితానికి గుర్తింపునిచ్చేది విజ్ఞాన వివేకాలయితే, జీతానికి మూలం ఉద్యోగ సాధన, నైపుణ్యాలు అవుతాయి. మన పరిజ్ఞానం, ప్రతిభను బట్టి మాత్రమే వార్షిక వేతనముతో పాటు ఉద్యోగ హోదా ఆధారపడి ఉంటాయి. నైపుణ్య సంపద గల వారి వెంట ధనం, గౌరవం,హోదా వస్తాయి.
విద్యార్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగ సాధనకు గట్టి పోటీ ఉంటుందని మనకు తెలుసు. వ్యక్తిగత, శాస్త్రసాంకేతిక నైపుణ్యాలు మాత్రమే ఉద్యోగంలో ఎంపికకు, ఎదుగుదలకు ఉపయోగపడతాయి. నిరంతరం నైపుణ్యాలను సానబెట్టుకుంటూ ముందుకు సాగాలి. గెలవాలనే ప్రగాఢ వాంఛలోంచి విజయ ప్రస్థానం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కొత్తదనాన్ని కోరుకోవాలి. నేటి ప్రయత్నం విఫలమైనా, అది రేపటి గెలుపుకు పునాది అవుతుందని గుర్తుంచుకోవాలి. నైపుణ్యాల్లో నిష్ణాతులయిన వారందరిలో ఆత్మవిశ్వాస నిధి కనిపిస్తుంది. ప్రతి అడుగు, మాట, చేతలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది. విజేతలందరిలో అంతర్గత, బాహ్య లక్షణాలు విలక్షణంగా ఉంటాయి. ఆత్మసంతృప్తి, సఫలీకృత భావం, అర్థవంత భావన, మనశ్శాంతి, ఆనందం, భద్రత, ఆత్మవిశ్వాసం లాంటివి అంతర్గత గుర్తింపులు అవుతాయి.
వృత్తిఉద్యోగాల్లో రాణించటానికి 90శాతం నమ్మకమైన విధి నిర్వహణ, 10శాతం సంభాషణా చతురత ఉపయోగపడతాయి. ఉద్యోగంలో రాణించ టానికి పనిపై అంకితభావం, లక్ష్యంపైగురి, అవసరనైపుణ్యాలు, మానవీయ సంబంధాలు, తెలుసుకోవాలనే తపన, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవటం, నమ్మకాన్ని చూరగొవడం, సమస్యకు పరిష్కారం వెతకటం, ప్రతిబంధకా లను అధిగమించటం, ప్రేరణాత్మకంగా ఉండటం, వ్యతిరేక భావాలను గౌరవించి ఒప్పించటం, వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకోవటం, సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఎదగటం, తరాల మధ్య అంతరాన్ని గమనించటం, మన దృక్ఫథమే మన విజయాన్ని నిర్ణయిస్తుందని నమ్మటం లాంటి అంశాలు దోహదపడతాయి.
ఒక చిన్న సంఘటనను గమనిద్దాం. ఇద్దరు యువకులను పిలిచిన యజమాని వారికి కొన్ని పుస్తకాలను ఇస్తూ ఒక గ్రామంలో అమ్మమని పంపిస్తాడు. మొదటి యువకుడు గ్రామాన్ని కలియ తిరిగి గ్రామస్థు లందరూ నిరక్షరాస్యులని గమనిస్తాడు. వెంటనే తన యజమానికి ఫోన్‌చేసి ఈ గ్రామస్థులు నిరక్షరాస్యులని, పుస్తకాలమ్మటం అసాధ్యమంటాడు. రెండవ యువకుడు ఈ గ్రామాన్ని సందర్శించి ఆనందంతో యజమానికి ఫోన్‌ చేసి ఈ గ్రామంలో పుస్తకాలకు రాబోయే రోజుల్లో మంచి మార్కెట్‌ ఉంటుందని అంటాడు. గ్రామస్థులందరినీ అక్షరాస్యులను చేస్తూ, చదువుకోవాలనే వాంఛను రగిలించుట ద్వారా పుస్తకాలను విక్రయించ వచ్చని అంటాడు. ఒకే సందర్భానికి ఇద్దరి స్పందన విభిన్నంగా ఉంది. మనం రెండవ వ్యక్తిలా ఆలోచించటం అలవర్చుకోవాలి. గెలుపు, ఓటములను నిర్ణయించే అంశాలుగా మానసిక ధృక్పధం, లక్ష్య ఛేదనలో స్పష్టతతోపాటు ప్రగాఢ ఆశయ సాధనా వాంఛ, కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నాలు పేర్కొనవచ్చు. ఒలంపిక్‌ పతక విజేతల వెనక రెండు దశాబ్దాల కఠోర శ్రమ దాగి ఉంటుంది. వంద మీటర్ల పరుగు పందెంలో ఒక్క క్షణమే గెలుపోటములను నిర్ణయిస్తుంది. ఒక్క అడుగు ముందు వేయటానికి ఇరవయ్యేళ్ల అభ్యాసం దోహదపడుతుందని మరువ రాదు. ఏ పనిని ఎప్పుడు, ఎందుకు, ఎలా చేయాలో తెలిసి క్రమశిక్షణతో శ్రమించే జీవన విధానాన్ని అలవర్చుకోవాలి.
నైపుణ్యాలు నేర్చుకోవటం ఈత నేర్చుకోవటం లాంటిది. నైపుణ్యాలను తెలుసుకుంటూనే ప్రయోగాత్మక అనుభవాన్ని పొందాలి. ఎలా చేయాలో నేర్పేది ప్రతిభ. ఎందుకు చేయాలో సూచించేది ప్రేరణ అవుతుంది. ఎంత బాగా చేయాలో తెలిపేది దృక్ఫథం అవుతుంది. విసుగును దరిరానివ్వక నవ్వుతూ పోరాడి గెలుచుటే ఉత్తమ వ్యక్తిత్వం. వైఫల్యాలను దాటుతూ విజయతీరాలు చేరుటలో జీవన విలువలు, ఆశావహ దృక్ఫథం, ప్రగాఢ వాంఛ, గమ్యంపై స్పష్టతలు దోహదపడతాయని గమనించాలి. శ్రమ పడకుండా ఫలితాన్ని ఆశించరాదు.
మధుపాళి, సెల్‌:9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img