Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మోదీ తీరు రాజ్యాంగ వ్యతిరేకం

. అది బీజేపీ సభా…ప్రభుత్వ సభా?
. జాతికి ప్రధాని క్షమాపణ చెప్పాలి
. నారాయణ డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో – తిరుపతి : హైదరాబాదులో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, వందేభారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ… బీఆర్‌ఎస్‌ పార్టీపై ఆరోపణలు చేయడం రాజ్యాంగ, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మండిపడ్డారు. తక్షణం నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం సభ నిర్వహించి…ప్రధానమంత్రి హోదాలో వచ్చిన మోదీ…దానిని బీజేపీ సభగా మార్చివేయడం సిగ్గుచేటన్నారు. బీజేపీ నేతగా వచ్చారా లేక ప్రధానిగా వచ్చారా సమాధానం చెప్పాలని మోదీని డిమాండ్‌ చేశారు. మోదీ ప్రసంగం మొత్తం తెలంగాణ ప్రభుత్వంపై దాడిగానే సాగిందన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ అవినీతి కనిపించలేదా అని నారాయణ ప్రశ్నించారు. ‘జై కొడితే ఇళ్లకు…ఛీ కొడితే జైలుకు’ అన్న చందంగా మోదీ పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్రలను బీజేపీ నిరంతరం కొనసాగిస్తోందని, అందులో భాగంగానే తమిళనాడులో మోదీ కులప్రస్తావనల తీసుకొస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ యేతర పాలక రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నదని చెప్పారు. జీఎస్టీ రూపంలో ప్రజల నుండి వసూలు చేసిన డబ్బును మోదీ ఇష్టానుసారం ఖర్చు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలన్న డిమాండ్‌ తెరపైకి రాగానే కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి రాజకీయ శిక్ష వేశారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకం, ప్రాజెక్టు తీసుకొచ్చినా ప్రజాధనంతోనేనని, వందే భారత్‌ రైళ్లను ప్రారంభించడం అందులో భాగమేనని నారాయణ చెప్పారు. వందే భారత్‌ రైళ్ల చార్జీలు విమాన చార్జీలను తలపిస్తున్నాయని ఆరోపించారు. త్వరలో వీటిని కూడా ప్రైవేట్‌ వ్యక్తులకు మోదీ అప్పగిస్తారని చెప్పారు. నరేంద్రమోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి 19 రాజకీయ పార్టీలు ఏకతాటిపైకివచ్చాయని, ప్రజాక్షేత్రంలో మోదీ సర్కారును ముద్దాయిగా నిలబెడతామని నారాయణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఆర్థిక నేరగాళ్లకు నిలయంగా మారిందన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుండి వచ్చిన నిధులను సీఎం జగన్‌ దారిమళ్లిస్తుంటే ఉండవల్లి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. విలేకరుల సమావేశంలో సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ఉదయ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img