Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

సెర్బియాలో మళ్లీ కాల్పులు

. మూడు గ్రామాల్లో ఎనిమిది మంది మృతి – 13 మందికి గాయాలు

. మృతుల్లో ఓ పోలీసు, ఆయన సోదరి

. 48 గంటల్లో రెండవ ఘటన – 21ఏళ్ల నిందితుడు అరెస్టు

. అతనిక జైలుకే పరిమితం: అధ్యక్షుడు ఉసిక్‌

దుబోనా (సెర్బియా): బెల్‌గ్రేడ్‌ స్కూల్లో 13ఏళ్ల పిల్లవాడు తొమ్మిది మంది విద్యార్థులపై స్కూల్లో కాల్పులు జరిపిన ఘటన మరువక ముందే సెర్బియాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. శుక్రవారం బెల్‌గ్రేడ్‌ సమీపంలో ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఎనిమిది మంది చనిపోయారు. మరో 13 మంది గాయపడ్డారు. దుండగుడిని 21ఏళ్ల యూరోస్‌ బి.గా గుర్తించారు. స్కూలు ప్రాంగణంలో ఓ పోలీసు అధికారితో గొడవపడిన అతను ఇంటికెళ్లి మారణాయుధాలు తీసుకొని ముందు పోలీసును, ఆయన సోదరితో పాటు మరొకరిపై కాల్పులు జరిపి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఎదురు పడిన వారిని కాల్పుకుంటూ వెళ్లాడని సెర్బియా అంతర్గత శాఖ వెల్లడిరచింది. దుండగుడిని పట్టుకున్నట్లు దేశాధ్యక్షుడు అలెగ్జాండర్‌ ఉసిక్‌ ప్రకటించారు. ఇక అతను జైలుకే పరిమితమని చెప్పారు. అంతకుముందు బెల్‌గ్రేడ్‌కు 42కిమీల దూరంలోని మ్లాడెనోవాక్‌ పట్టణం దగ్గర బారికేడ్లను సెర్బియా పోలీసులు ఏర్పాటు చేశారు. దుండగుడు ఆయుధాలతో కారులో తిరుగుతూ మూడు గ్రామాల్లో కాల్పులు జరిపాడని స్థానిక మీడియా పేర్కొంది. దుండగుడి కోసం 600మంది సెర్బియా పోలీసులు, ఎలైట్‌ స్పెషల్‌ యాంటీ టెర్రరిస్ట్‌ యూనిట్‌, జెండర్మేరే కలిసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. హెలికాప్టర్‌, డ్రోన్లును సైతం రంగంలోకి దించినట్లు మీడియా పేర్కొంది.
ఇది యావత్‌ దేశంపై దాడి: అధ్యక్షుడు ఉసిక్‌
సెర్బియాలో కేవలం 48 గంటల్లో రెండు కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడంపై అధ్యక్షుడు అలగ్జాండర్‌ ఉసిక్‌ తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తంచేశారు. వరుస దాడులను దేశంపై దాడిగా తెలిపారు. సాయుధ దుండగుడిని నిర్బంధించినట్లు తెలిపారు. అతన్ని జైల్లో నుంచి బయటకు రానివ్వమని తేల్చిచెప్పారు. కాల్పుల అనంతరం ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు.
సంతాప దినాలు: కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు సంతాపసూచికంగా శుక్రవారం నుంచి దేశంతో మూడ్రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. స్కూలు వద్ద వందలాది మంది విద్యార్థులు కొవ్వొత్తులు, పూలతో మృతులకు నివాళులర్పించారు. చర్చీల్లో వారి కోసం ప్రత్యేక ప్రార్థనలను గురువారం నిర్వహించారు. బెల్‌గ్రేడ్‌లో విద్యాశాఖ కార్యాలయం ఎదుట హైస్కూల్‌ టీచర్లు ర్యాలీ నిర్వహించి, స్కూలు భద్రతా, విద్యా వ్యవస్థ మెరుగుదలను డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img