Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కదిలి వచ్చిన సిక్కులు

ఇరవై ఆరు రోజులుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశ గౌరవానికి వన్నె తెచ్చిన భారత మహిళా మల్ల యోధులు, వీరికి మద్దతుగా మరికొంతమంది క్రీడాకారులు దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేస్తున్నారు. మహిళా క్రీడాకారులను లైంగిక వేధింపులకు గురి చేశాడన్న బీజేపీ ఎంపీ, భారత మల్ల యోధుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేయలేదు. క్రీడాకారులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తప్ప ఆయన మీద ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు కాలేదు. చివరకు ఆయన మీద రెండు కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి ఈడు రాని క్రీడాకారిణిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు ఎదుర్కుంటున్నందువల్ల పోస్కో కింద కేసు నమోదైంది. పోస్కో కేసు నమోదైతే 24 గంటల లోగా అరెస్టు చేయాలి. కానీ ఆయనకు బీజేపీ అగ్ర నాయకుల అండదండలున్నాయి కనక ఈగైనా వాల లేదు. గురు, శుక్రవారాల్లో క్రీడాకారులకు మద్దతుగా వేలాది మంది సిక్కులు తరలి వచ్చారు. ఈ ఉద్యమం ప్రారంభం అయిన దగ్గరనుంచి అనేక రాజకీయ పార్టీల వారు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. భీం ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ కూడా మద్దతు ప్రకటించారు. ఆయన నిరసన శిబిరం దగ్గరకు శుక్రవారం కూడా వచ్చారు. నిరసన ప్రదర్శన చేస్తున్న వారు గురువారం హనుమాన్‌ దేవాలయాన్ని, శుక్రవారం బంగ్లా సాహెబ్‌ గురుద్వారా సందర్శించారు. భగవంతుడి ఆశీర్వాదాలు తమకుంటే ఉద్యమం సఫలమవుతుందన్నది వారి విశ్వాసం. బ్రిజ్‌ భూషణ్‌ను ప్రభుత్వం అరెస్టు చేయలేకపోతే తామె నిర్బంధిస్తామని, శిక్షిస్తామని ఈ సిక్కు నాయకులు ప్రతినబూనారు. బ్రిజ్‌ భూషణ్‌ను ఎడ్లకు కట్టి లాక్కెళ్లి పోతామంటున్నారు. అమ్మాయిల ఆత్మ గౌరవమే అత్యంత ప్రధానమైందని, ఎవరూ దీనికి భంగం కలిగించకుండా చూసుకుంటామని సిక్కుల ప్రతినిధులు తెలియజేశారు. కుల మతాలతో సంబంధం లేకుండా నిరుపేద కూతురి ఆత్మ గౌరవానికి భంగం కలిగినా సిక్కు మతస్థులు వారికి అండగా నిలుస్తారని వారి ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రతి అమ్మాయికి ఆత్మ గౌరవం, మాన రక్షణ అత్యవసరమని, వారు పెళ్లిళ్లు చేసుకుని కాపురాలకెళ్లాలి. ఇదే సమాజంలో బతకాలి కనక వారి ఆత్మ గౌరవం తమకు అత్యంత ప్రధానమైందని సిక్కులు అంటున్నారు. ఈ పోరాటంలో కుల మతాల ప్రస్తావన లేదని అందరి గౌరవం తమకు ఒక్కటేనని వారు చెప్తున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ చేతుల్లో లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలు తాము వేధింపులకు గురయ్యామని చెప్పడమే అపూర్వం. సాధారణంగా అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు గురైన ఆడవారు ఆ మాట బయటకు చెప్పడానికి వెనుకాడతారు. ఎంతటి విధిలేని పరిస్థితి ఉంటే ఈ అమ్మాయిలు రోడ్డెక్కి నినదిస్తున్నారో అర్థం చేసుకోగలిగిన సంస్కారం, హృదయం మోదీ సర్కారుకు లేదని ఇన్నాళ్లుగా రుజువైంది. ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయనప్పుడు ప్రజలే చట్టాన్ని అమలు చేయించవలసిన పరిస్థితి వస్తుంది. ఇది సమర్థించదగిన పరిణామం కాదు గానీ ప్రభుత్వం ఏ మాత్రం కదలనప్పుడు మార్గాంతరం లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా ప్రభుత్వం మౌనంగా ఉండడంలో సంకుచిత ప్రయోజనాలను పరిరక్షించడం, తమ వారు ఏం చేసినా వెనకేసుకు రావాలన్న దుగ్ధ తప్ప మరేమీ కనిపించడం లేదు. బ్రిజ్‌ భూషణ్‌ ను కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్న విషయం అందరికీ తెలుసు.
న్యాయం దక్కేదాకా నిరంతర పోరాటం కొనసాగిస్తామని క్రీడా కారులు గట్టిగా చెప్తున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ ను వెంటనే అరెస్టు చేసి రెండు నెలల్లోగా విచారణ పూర్తి అయ్యేట్టు చూసి శిక్ష విధించాలన్నదే వీరి కోరిక. ఈ క్రమం వేగవంతం అయ్యేలా చేయడానికే క్రీడాకారులు గురు, శుక్రవారాల్లో వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేయవలసి వచ్చింది. 2019లోనూ అధికారం దక్కించుకున్న మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ దక్కడంవల్ల అహంకారం తలకెక్కినట్టు రుజువు అవుతూనే ఉంది. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరన్న అతి విశ్వాసమూ ఉంది. పాలకుల్లో ఇలాంటి ధోరణి ఏర్పడడం, కొనసాగడం దేశంలో ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వ పెద్దలు కర్నాటక శాసనసభ ఎన్నికలలో మునిగి ఉన్నారనుకున్నా ఆ ఎన్నికలు ముగిసి కూడా పది రోజులు గడిచాయి. ఇప్పటికీ మోదీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం దుస్సహసమైంది. క్రీడాకారులకు మద్దతు ప్రకటించడానికి వచ్చిన సిక్కులు తమకు గౌరవం అత్యంత ప్రధానమైందని, దానికే కొరత ఏర్పడినప్పుడు ఉద్యమించక తప్పడం లేదంటున్నారు. సిక్కుల తొమ్మిదవ గురువు గురు తేజ్‌ బహదూర్‌ ఔరంగజేబ్‌ ఎదుట తల వంచడం ఇష్టంలేక తన ప్రాణాలనే బలిపెట్టాడని నిరసన తెలియజేస్తున్న వారికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన సిక్కులు గుర్తు చేస్తున్నారు. ఈ సమస్య త్వరలో పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరింప చేస్తామని వీరు చెప్తున్నారు. ఏడాదికి పైగా నడిచిన రైతుల ఉద్యమంలో పంజాబ్‌ రైతులు ప్రధాన పాత్ర పోషించారు. అందులో సహజంగానే సిక్కులే ఎక్కువ మంది. ఆ సమయంలో సిక్కులు ఎంతటి పట్టుదల కనబరిచారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రైతు ఉద్యమం సందర్భంగా కూడా మోదీ ప్రభుత్వం ఏడాదికి పైగా అహంకారాన్ని, మంకుతనాన్నే ప్రదర్శించింది. చివరకు ఉద్యమ తీవ్రత, అందులో ఉన్న పట్టుదలకు జడిసి మోదీ లొంగక తప్పలేదు. క్రీడాకారులు ఉద్యమాన్ని నిర్వహిస్తున్న తీరుచూస్తే వారి పట్టుదల కూడా సామాన్యమైంది కాదని రుజువు అవుతోంది. ఈ దేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలపై మోదీకు ఎంతమాత్రం గౌరవం లేదు. ఒక్కొక్క వ్యవస్థ రాయి రాయి విడగొట్టే విచ్ఛిన్నకర ధోరణి అనుసరించడంలో మోదీ అద్వితీయమైన అపకీర్తి మూటగట్టుకున్నారు. ప్రజాభిప్రాయాన్ని ఆయన మన్నించిన సందర్భమే లేదు. రాజ్యాంగాన్ని మనం ఎంత పకడ్బందీగా రూపొందించినా అది ఎలా అమలవుతుందన్నది అమలుచేసే వారి మీదే ఆధారపడి ఉంటుందని, అప్పుడే రాజ్యాంగం వల్ల ప్రయోజనం కనిపిస్తుందని రాజ్యాంగ నిర్ణాయక సభ ముగింపు సందర్భంగా అంబేద్కర్‌ చెప్పిన మాటలను గుర్తుచేసుకోవలసిన దశకు వచ్చాం. మోదీ భావధారకు మూలమైన సంఫ్‌ు పరివార్‌ రాజ్యాంగ ప్రతులను దగ్ధం చేసిన ఘటననూ గుర్తు చేసుకోవాలి. ఆ కుదురు నుంచి వచ్చిన వ్యక్తికి రాజ్యాంగ నిబద్ధత ఉంటుందని ఆశించలేం. ఏ ప్రజాస్వామ్య పద్ధతుల ఆధారంగా మోదీ అధికారంలోకి వచ్చారో అదే రాజ్యాంగాన్ని బాహాటంగా, నిస్సిగ్గుగా, కసిగా కాలరాస్తున్నారు. ఈ దేశంలో అయిన వారికి ఒక చట్టం, ఇతరులకు మరో చట్టం ఉన్నట్టుగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఒక వర్గం తరవాత మరో వర్గం క్రీడాకారులకు మద్దతిస్తున్న తీరు చూస్తే ఇది బలహీనపడే సూచనే లేదు. రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు సంఘాలు, నాయకులు కూడా మద్దతిచ్చారు. మొండి పట్టుదల అంతిమంగా మోకరిల్లక తప్పని స్థితికి తీసుకువస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img