Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మరోసారి వడ్డీ రేట్లు యథాతథమే.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం..

కీలక రెపో రేటు 6.5 శాతం వద్దే కొనసాగింపు

రుణాలు తీసుకున్న వారికి ఊరట..
రివర్స్ రెపో రేటు 3.35 శాతంలోనూ మార్పు లేదు
ద్రవ్యోల్బణం 4 శాతానికి పైనే కొనసాగొచ్చన్న ఆర్ బీఐ
జీడీపీ 2023-24లో 6.5 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనా

కీలక రేట్ల విషయంలో ఆర్ బీఐ మరో విడత యథాతథ విధానాన్ని కొనసాగిస్తూ నిర్ణయించింది. మానిటరీ పాలసీ కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు వెల్లడించారు. నిపుణులు, విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉన్నాయి. కీలక రెపో రేటును 6.50 శాతంగా కొనసాగించింది. చివరిగా జరిగిన ఏప్రిల్ సమీక్షలోనూ రెపో రేటులో ఆర్ బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో వరుసగా రెండో విడత కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. దీనివల్ల రుణ గ్రహీతలపై అదనపు భారం మోపకుండా ఉపశమనం కల్పించినట్టయింది. ఇక రివర్స్ రెపో రేటును సైతం 3.35 శాతం వద్దే కొనసాగించింది. బ్యాంకులు ఆర్ బీఐ నుంచి తీసుకున్న నిధులపై వసూలుచేసే రేటును రెపో రేటుగా చెబుతారు. రివర్స్ రెపో దీనికి విరుద్ధం. బ్యాంకులు ఆర్ బీఐ వద్ద ఉంచిన నిధులపై చెల్లించే రేటును రివర్స్ రెపో రేటుగా చెబుతారు. బ్యాంకులు తమ వద్ద మిగులుగా ఉన్న డిపాజిట్లను ఆర్ బీఐ వద్ద జమ చేస్తుంటాయి.

కీలక అంశాలు

రెపో రేటును 6.5 శాతంగా కొనసాగించాలని ఆర్ బీఐ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. సర్దుబాటు విధానాన్ని ఉపసంహరించుకోవడంపై దృష్టి పెట్టనుంది.స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 6.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 6.75 శాతం వద్దే కొనసాగించింది. రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయాలన్నది ఆర్ బీఐ లక్ష్యం. అయినప్పటికీ ప్రస్తుత ఏడాది అంతటా 4 శాతానికి పైనే ఉంటుందని అంచనా వేసింది. కనుక ద్రవ్య పరపతిని ప్రస్తుతం మాదిరే కొంచెం కఠినంగానే కొనసాగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. ఏప్రిల్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతంగా ఉండడం గమనించొచ్చు. దేశీయంగా డిమాండ్ పరిస్థితులు వృద్ధికి మద్దతునిచ్చే విధంగానే ఉన్నాయి.2023-24 సంవత్సరానికి జీడీపీ 6.5 శాతం వృద్ధిన నమోదు చేస్తుందని అభిప్రాయపడింది. మొదటి త్రైమాసికంలో 8 శాతం, రెండో త్రైమాసికంలో 6.5 శాతం, మూడో త్రైమాసికంలో 6 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.7 శాతంగా ఉండొచ్చు. కరెంటు ఖాతా లోటు మరింత మోస్తరు స్థాయికి దిగొస్తుంది. విదేశీ మారకం నిల్వలు సౌకర్య స్థాయిలోనే ఉన్నాయి.గతేడాది మే నుంచి ఆర్ బీఐ దశలవారీగా రేట్లను పెంచుతూ వచ్చింది. మొత్తం మీద రెపో రేటును 2.5 శాతం పెంచింది. దీంతో రుణాలు, డిపాజిట్లపైనా రేట్లు అదే స్థాయిలో పెరగడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img