Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విప్లవ సాహిత్యోద్యమానికి వేగుచుక్క మధు

ముప్పాళ్ల భార్గవ శ్రీ, సెల్‌.9848120105

మధు ఇంటిపేరు మరింగంటి. ఏప్రిల్‌ 16వ తేదీన ఆయన 78 సంవత్సరాల వయసులో విజయవాడలో చనిపోయే వరకు బాహ్య ప్రపంచానికి ఆయన కుటుంబ వివరాలు తెలియదు. మధుగానే విప్లవ రాజకీయ శక్తులకు, అదీకూడా పైస్థాయి నాయకత్వానికి మాత్రమే తెలియడానికి కారణం ఆరు దశాబ్దాలుగా ఆయన అజ్ఞాత జీవితం గడపడమే. జంటనగరాల పార్టీ కమిటీ సభ్యుడు స్థాయి మొదలుకొని రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, కొంతకాలం ఆల్‌ ఇండియా పార్టీ కార్యదర్శిగా, చనిపోయేనాటికి పార్టీ కేంద్ర నాయకుని బాధ్యతలతో పాటు పార్టీ కేంద్ర పత్రిక ‘క్లాస్‌ స్ట్రగుల్‌’ సంపాదకుడిగా మధు పని చేశారు. మధు ఒకవైపు విప్లవ రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తూనే రెండో వైపు సాహిత్య ఉద్యమ కర్తవ్యాలు నిర్వహించటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విప్లవ సాహిత్య ఉద్యమానికి ఆయన చేసిన అకుంఠిత కృషి ఆయన్ని విప్లవ సాహిత్యోద్యమ వినీలాకాశంలో వేగుచుక్కలా నిలిపింది.
మధు రాజకీయ రంగంతో పాటు సాహిత్య రంగం మీద ప్రత్యేక ఆసక్తిని కనబరచటానికి ఆయన వైష్ణవ సాంప్రదాయక సాహిత్య సాంస్కృతిక నేపథ్యం బలంగా ఉన్న పండిత కుటుంబంలో పుట్టటం కారణం కావచ్చు. మధుకు తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీనివాసాచార్యులు. వీరిది మహబూబ్‌ నగర్‌ జిల్లా కల్వకుర్తి దగ్గర వంగూరు మండలములోని రంగాపురం గ్రామం. ప్రస్తుతము ఈ గ్రామం నాగర్‌ కర్నూలు జిల్లాలో ఉంది. ఆయన తన సాంప్రదాయ కుల అస్తిత్వాన్ని వదులుకొని, తన యావత్‌ జీవితాన్ని విప్లవోద్యమానికే అంకితం చేశారని ఆయన సాగించిన ఆదర్శప్రాయమైన విప్లవోద్యమ జీవితాన్ని గమనిస్తే తేటతెల్లమవుతుంది. ఆయన హైస్కూల్‌ విద్యనభ్యసించే కాలం నుంచే వామపక్ష విద్యార్థి ఉద్యమకారుడిగా ప్రారంభించి హైదరాబాద్‌ ఉస్మానియా విద్యాలయంలో న్యాయవాద పట్టా పుచ్చుకునే నాటికి విద్యార్థి నాయకుడిగానే గాక అభ్యుదయ సాహిత్య రంగంలో చెప్పుకోదగిన కృషిని చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ‘ యువజన సాహితి’ ప్రచురించిన ‘గడ్డిపూలు’ కథా సంకలనాన్ని తీసుకురావటంలో మధు పాత్ర ముఖ్యమైనది. ‘స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మమ్మల్ని ప్రభావితం చేసిన ఆధునిక సాహిత్య అభ్యుదయ ఆదర్శవాదాల ప్రేరణతో రాసిన గడ్డిపూలు కథల సంపుటి పునర్ముద్రణకు నోచుకోవడం మేము ఊహించని విషయం ‘ అని హైదరాబాదులో వైద్యులుగా స్థిరపడ్డ దామోదర్‌ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన మధు బాల్య మిత్రులు. ‘గడ్డిపూలు’ కథా సంపుటిలో ‘ అమాయకులు’ కథను మధు రాశారు. మధు బాల్య మిత్రులలో ముఖ్యులు ప్రముఖ సాహితీ విమర్శకులు, ఆధునిక తెలుగు సాహిత్య పితామహులు, విరసం ప్రారంభ సభ్యులు కేకే రంగనాథాచార్యులు కూడా ఉన్నారు. వారి మధ్య స్నేహ బంధం బలీయమైనది అనటానికి రంగనాథాచార్యులు వర్ణాంతర ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు మధు కొండంత అండగా నిలబడ్డాడు. మధు ఏప్రిల్‌ 16న చనిపోతే రంగనాథం మే 16న చనిపోయారు. ఒక్క నెల తేడాతో ఇద్దరూ కరోనా కారణంగానే చనిపోయారు. మధు చనిపోయిన విషయం తెలిసిన రంగనాథం మధుతో తనకున్న అనుబంధం గురించి రాస్తానని చెప్పారట. ఆయన రాసేలోపే ఆయనను కరోనా మింగేసింది. మధు గురించి ఆయన చిన్ననాటి మిత్రుడు గుండోజు యాదగిరి రాస్తూ ‘‘ అభ్యుదయ భావాలతో ప్రభావితులైన మిత్రులందరినీ ఒక వేదికపైకి తెచ్చి కల్వకుర్తిలో ‘ యువజన సాహితీ ‘ సంస్థను స్థాపించటంలో ముఖ్య పాత్ర వహించి, ‘‘ ప్రభాత గీతి ‘‘ అనే లిఖిత యువజన మాస పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఆయన వివిధ పత్రికల్లో రాసిన అధివాస్తవిక చిత్రం , వర్ణ సమస్య, నేటి యువతరం దృక్పథం అనే వ్యాసాలు, ఆపరేషన్‌ అనే కవిత దుష్ట వ్యవస్థ పై గల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాయి’’ అని పేర్కొన్నారు. మధు స్వగ్రామం ‘ఎల్లమ్మ రంగాపురం గ్రామ చరిత్ర’ను రాసిన గుండోజు యాదగిరి మధు గురించి ఇలా వ్యాఖ్యానించారు.‘‘ బాల్యము నుండి స్వతంత్ర భావాలు కల వ్యక్తి. సంప్రదాయ విరోధి. కమ్యూనిస్టు భావాల స్పర్శతో అభ్యుదయ భావాలకు అంకితమయ్యాడు. క్రమంగా సమాజంలోని అసమానతలు, పేదల బాధాభరిత దుర్భర జీవితాలు చూసి కదిలిపోయి సాయుధ విప్లవ పంధాలోకి పయనించాడు. నేటివరకు అజ్ఞాతం లోనే ఉన్నాడు. ‘‘ అని రాయటం ద్వారా మధు విప్లవ జీవిత గమనాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఆ కాలములో వరంగల్‌ జిల్లా నుంచి వెలువడిన ‘ తిరగబడు ‘ కవితా సంకలనం పై ‘సృజన’(1970) పత్రికలో మధు కృష్ణమూర్తి పేరుతో విమర్శనాత్మక సమీక్ష రాశారు. ‘ పేద ప్రజల పక్షాన నిలిచిన తిరగబడు కవులు’ అని కితాబు ఇచ్చారు. ఇందులో ఆత్మ విమర్శనా దృక్పధంతో పరిశీలించుకోవాల్సిన విప్లవ కవుల కర్తవ్యం గురించి రాస్తూ ‘‘ కవితలు ప్రధానంగా పీడిత వర్గాల గురించి రాస్తారు. సరిగ్గా ఈ వర్గాలకే కవితలు చేరవు. కనీసం సాధారణ రాజకీయ కార్యకర్తలకైనా అవి చేరవు. ఈ కవితలను ప్రజలకు ఎవరో చదివి పెట్టినప్పటికీ, ఆ కవితల్లోని భావాలను అర్థం చేసుకొని దానికి ప్రజల సాధారణ భాషా పరిజ్ఞానం చాలదు. ఇది నేడు విప్లవ సాహిత్యానికి ప్రజలకు మధ్యనున్న ప్రధాన వైరుధ్యం’’ అని సూటిగా చెప్పారు.
1970ల నాటి శ్రీశ్రీ షష్ఠి పూర్తి ఉత్సవం, విరసం ఏర్పాటు, ఆ క్రమంలో ముందుకొచ్చిన విభిన్న ధోరణులపై మధు నూతన ప్రజాస్వామిక విప్లవ అవగాహనతో విప్లవ సాంస్కృతికోద్యమ దృక్పధాన్ని సూత్రీకరించి విప్లవ సాహిత్యోద్యమ శక్తులకు అందించారు . దిగంబర కవుల నుంచి విప్లవ రచయితగా పరిణామం చెందిన వారిలో ముఖ్యులైన జ్వాలాముఖి విరసం వారి ‘ఎరుపు’ బులిటెన్‌లో ‘ రేపటి కవిత్వం ‘ అనే వ్యాసం పై మోహన రావు పేరుతో ‘ జ్వాలాముఖి గందరగోళం’ అంటూ అతివాద కోణం నుండి ఒక విమర్శ రాగా, ‘విప్లవ కవుల్లో అలీనవాదం’ సరైన దృక్పథం కాదంటూ ప్రకాశరావు పేరుతో మధు ‘జనశక్తి’లో విమర్శనాత్మక వ్యాసం రాశారు.1972 గుంటూరులో జరిగిన 3వ విరసం మహాసభలలో విరసం నాయకత్వం చేపట్టిన అతివాద ధోరణులను విమర్శిస్తూ మధు రాసిన ‘‘సాంస్కృతిక విప్లవం- మన కర్తవ్యాలు’’ అన్న డాక్యుమెంట్‌ ను గుంటూరు జిల్లా విరసం శాఖ తరుపున వోల్గా చర్చకు ప్రవేశపెట్టారు. విప్లవ రచయితల సంఘాన్ని మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానానికి పరిమితం చేసే ధోరణి సరైనది కాదని, విప్లవం అంటే వ్యక్తిగత హింసావాదం లేక అతివాద దుస్సాహసికవాదం కాదని, ఈ ధోరణి ప్రజా విప్లవ పంథాకు విరుద్ధమైనదని, ఒకనాటి అభ్యుదయ రచయితల సంఘం సాగించిన సాహిత్య కృషిలోని విప్లవ అంశాలకే కాక, అంతకు పూర్వపు ప్రగతిశీల భావధారలకు కూడా మనం వారసులమని, నూతన ప్రజాస్వామిక విప్లవపు సాంస్కృతికోద్యమ దృక్పథంతో ముందుకు సాగాలని ఈ డాక్యుమెంట్‌లో ప్రధానమైన అంశాలుగా చర్చకు పెట్టారు. ఈ అంశాలపై మహాసభల్లో లోతైన చర్చ జరగకపోయినా ప్రజా సంఘానికి పార్టీకి నడుమ ఉండవలసిన స్పష్టమైన సిద్ధాంత నిర్మాణ విభజన రేఖల గురించి మాత్రం ఆరోగ్యవంతమైన చర్చ జరిగింది. ఈ డాక్యుమెంట్‌కు సమాధానంగానే విరసం నాయకత్వం ‘‘ విరసంలో మార్క్సిస్టు వ్యతిరేక ధోరణులు ఖండిరచండి’’ అంటూ అతివాద కోణంనుంచి మరో డాక్యుమెంటును తీసుకొచ్చింది.1974 లో విరసం గుంటూరు జిల్లాశాఖ తరుపున ‘‘సాంస్కృతిక విప్లవం- మన కర్తవ్యాలు’’ డాక్యుమెంట్‌ను ప్రచురించి సాహిత్య రంగంలోనే శ్రేణులకు ఒక ఆయుధంగా అందించారు. ఈ డాక్యుమెంట్‌ వెలుగులోనే మధు మార్గదర్శకత్వంలో హైదరాబాదులో ‘‘నవోదయ సాహితీ సాంస్కృతిక సంస్థ’’ ను ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించారు. అలానే ఈ సంస్థ తరఫున ‘‘జీవనాడి- యువ భావ సంచలనం’’ పేరుతో మాసపత్రికను ‘ నిత్యజీవితంలో విదేశీ దోపిడి’ లాంటి ఆలోచనాత్మక శీర్షికలతో తీసుకొచ్చి పాఠకులలో కొత్త ఒరవడిని సృష్టించారు. అంతేకాక ఈ సంస్థ తరఫున ‘‘ జనవాహిని కదిలింది.. వీధిభాగవత నృత్య రూపకం’’ను తయారుచేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లలో నాటక టీం ప్రదర్శనలు ఇచ్చి మంచి ప్రజాదరణను పొందారు. ఈ క్రమంలోనే ప్రజా సాహితీ సాంస్కృతిక రంగాలలో పనిచేసే శక్తులకు స్పష్టమైన అవగాహన అందించటానికి ‘‘ప్రజాసాహితి, సాంస్కృతికోద్యమం- కమ్యూనిస్టులు’’ అన్న డాక్యుమెంట్‌ను ప్రకాశరావు పేరుతో మధు రాయగా జనశక్తి ప్రచురణగా తీసుకొచ్చారు. ఈ డాక్యుమెంటులో ప్రధానంగా ‘‘సాహిత్య కళారంగాలలో మార్క్సిస్టులు రూపాన్ని పట్టించుకోరు అనే విమర్శ ఒకటి ఉంది. ఇది అబద్దం. ఎందుకంటే రూపం లేని వస్తువే లేదు కనుక. వస్తు సారానికి రూపానికి విడదీయలేని గతితార్కిక సంబంధం ఉంది… నకిలీ విత్తనాలకు అసలు విత్తనాలకు రూపం ఒకటిగానే ఉంటుంది. కానీ సారములోనే తేడా అంతా. ఈ సారమే ప్రాథమికమైనది. ప్రజలకు కావలసినదీ.’’ అని స్పష్టంగా చెప్పారు.
విరసంతో సైద్ధాంతిక పోరాటం సాగించిన శక్తులు మధు అందించిన ప్రజా సాంస్కృతికోద్యమ దృక్పథంతో 1978 ఆగస్టులో హైదరాబాదులో జన సాహితి సాంస్కృతిక సంస్థ ప్రారంభం మహాసభలు జరుపుకుని కొత్తపల్లి రవిబాబు ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. జన సాహితి సంస్థ నేటికి సజీవంగా కొనసాగుతున్నది. అంతేగాక గత కొద్ది సంవత్సరాలుగా అఖిలభారత స్థాయిలో ఏర్పడి పనిచేస్తున్న ‘‘ ప్రజాసాహితి సాంస్కృతికోద్యమ వేదిక’’ రూపుదిద్దుకొని కొనసాగటంలో మధు మార్గదర్శకత్వం విశిష్టమైనది.
1975 జూన్‌ 25వ తేదీన అత్యవసర పరిస్థితి ప్రకటించిన తర్వాత అంతవరకు మధు మార్గదర్శకత్వంలో వస్తున్న జీవనాడి పత్రికను ఆపేసి ‘‘ వెల్లువ ‘‘ సాహిత్య మాస పత్రికను మొదట సైక్లో రూపంలో తీసుకొచ్చి తరవాత ప్రింట్‌లో ఎమర్జెన్సీ ముగిసేవరకు తీసుకువచ్చారు. జూలై 76 వెల్లువ రెండవ సంచికలో ‘‘ ఫాసిస్టు నిర్బంధం విప్లవ సాహిత్య ఉద్యమాన్ని అడ్డుకోజాలదు!’’ శీర్షికతో మధు రాసిన సంపాదకీయంలో ‘‘ నేడు దేశంలో నెలకొని ఉన్న ఫాసిస్ట్‌ నిర్బంధ పరిస్థితుల్లో సాధ్యమైన అన్ని మార్గాల్లో మనం సాహితీ – సాంస్కృతిక కృషి సాగించాలి. నేడు అమలులో ఉన్న కఠినమైన సెన్సారు నిబంధనలు ఈ కృషి పై అనేక పరిమితులు విధిస్తున్నాయి. అయినప్పటికీ లీగల్‌ పత్రికలు విస్తృతమైన పాఠక జనం మధ్యకు వెళ్ళడానికి గల అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ పత్రికల ద్వారా సాధ్యమైనంత మేరకు ప్రజలకు ఉపయోగకరమైన సాహిత్యాన్ని అందించడానికి కృషి చేయాలి. దీని కోసం మనం తగిన ఇతివృత్తాలను రచనా రూపాలను ఎన్నుకోవాలి. ‘‘ ఈ సందేశం ద్వారా నిర్బంధ పరిస్థితులలో కూడా సాహిత్యరంగంలో ఏ విధంగా కృషి కొనసాగించాలో స్పష్టంగా మార్గనిర్దేశనం చేశారు. ఎమర్జెన్సీ కాలంలో పార్టీ రహస్యంగా తీసుకొచ్చిన ‘జ్వాల’ రాత పత్రికకు కూడా మధు బాధ్యత వహించారు. ఎమర్జెన్సీ తర్వాత పార్టీ కేంద్రం నుంచి వచ్చిన ‘ వాన్‌ గార్డ్‌’ ఇంగ్లీష్‌ పత్రిక మొదలుకుని నేడు వస్తున్న ‘క్లాస్‌ స్ట్రగుల్‌’ పత్రికలకు నిరంతరం జాతీయ అంతర్జాతీయ పరిణామాల పై వ్యాసాలు రాస్తూనే ఉన్నారు.
మధు విప్లవ రాజకీయ, సాహిత్య ప్రస్థానంతో పాటు సాగిన ఆరు దశాబ్దాల జీవితాన్ని వడపోసి చూస్తే మధు జన్మ ఉనికిని మరిచిపోయి విప్లవోద్యమ ఉనికిని సొంతం చేసుకున్నారనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన మరణం తర్వాత బయటి ప్రపంచానికి మరింగంటి మధుగా పరిచయం కావటం ఎంతో వినూత్న అనుభూతిగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img