Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

గుజరాత్‌లో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం

రూపానీ కేబినెట్‌లోని ఒక్కరికీ దక్కని పదవి
గాంధీనగర్‌ :
గుజరాత్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. రాజ్‌భవన్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో అసెంబ్లీ మాజీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు జితూ వాఘాని కూడా ఉన్నారు. అయితే.. మాజీ సీఎం విజయ్‌ రూపానీ కేబినెట్‌ లోని ఒక్కరికి కూడా కొత్త మంత్రివర్గంలో చోటుదక్కకపోవడం గమనార్హం. అయిదు రోజుల క్రితం గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి విజయ్‌ రూపానీని అనూహ్యంగా తొలగించి ఆ పదవిలో భూపేంద్ర పటేల్‌ను నియమించిన బీజేపీ అధిష్ఠానం, కొత్త మంత్రివర్గ ఏర్పాటులోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రూపానీ పని తీరుపై అసంతృప్తి, 2022లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపానీని సీఎం పదవి నుంచి తొలగించారని భావిస్తుండగా.. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేలా మంత్రివర్గం ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంది. కాగా సీఎం పదవిని ఆశించిన మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌కు కూడా కేబినెట్‌లో స్థానం కల్పించలేదు. మొత్తం 24 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగా, కొత్త మంత్రులతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ప్రమాణం చేయించారు. 10 మంది కేబినెట్‌ మంత్రులుగా, 14 మంది సహాయ మంత్రులుగా (వీరిలో ఐదుగురు ఇండిపెండెంట్‌ చార్జి గలవారు) ప్రమాణస్వీకారం చేశారు.
నూతన మంత్రులు వీరే..
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో రాజేంద్ర త్రివేది, జితు వాఘాని, హృషికేష్‌ పటేల్‌, పూర్ణేష్‌ మోడీ, రాఘవ్‌జీ పటేల్‌, కనుభాయ్‌ దేశాయ్‌, కిరీట్‌సిన్హ్‌ రానా, నరేష్‌ పటేల్‌, ప్రదీప్‌ పర్మార్‌, అర్జున్‌ సిన్హ్‌ చౌహాన్‌ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img