Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

మన్యవాసులలో మంచి మార్పు తీసుకురావాలన్నదే సిఆర్పిఎఫ్ లక్ష్యం

సిఆర్పిఎఫ్ అసిస్టెంట్. కమాండెంట్ వినీత

విశాలాంధ్ర చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ప్రజా రక్షణతో పాటు, మన్యవాసులలో మంచి మార్పు కోసం సిఆర్పిఎఫ్ పోలీసు వ్యవస్థ అహర్నిశలు కృషి చేస్తుందని సి ఆర్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినీత అన్నారు. సిఆర్పిఎఫ్ 234 బెటాలియన్ బి కంపెనీకి చెందిన కమాండెంట్ సంజయ్ కుమార్ ద్వివేది ఆదేశాల మేరకు చింతపల్లి మండలంలోని అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోగల కూర్మన్నపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామ అభివృద్ధికి ఆ గ్రామస్తుల సంక్షేమానికి కృషి చేస్తున్న క్రమంలో బుధవారం సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ తుషార్ రంజన్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో వృద్ధులు మహిళలకు వస్త్రాలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె ముందుగా గ్రామస్తులతో గ్రామంలో ఉన్న సమస్యలపై చర్చించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గ్రామస్తులు అదరికీ భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్య ప్రాంతంలో యువత చెడు సహవాసాలు, దురాలవాట్లకు లోను కావడమే కాకుండా, మావోయిజం, గంజాయి సాగు, అక్రమ రవాణాలకు సహకరించి కేసులలో చిక్కుకొని భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారన్నారు. అటువంటి అమాయక గిరిజనులకు అవగాహన కల్పించి మంచి మార్గం వైపు తీసుకురావాలన్న లక్ష్యంతో సిఆర్పిఎఫ్ ఒకవైపు ప్రజారక్షణ బాధ్యత నిర్వర్తిస్తూనే మరోవైపు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో లోతుగెడ్డ పంచాయతీ కూర్మన్న పాకలు గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలోని యువకులకు విశాఖపట్నంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించడమే గాక వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అదే క్రమంలో దత్తత తీసుకున్న ఈ గ్రామంలో గల 35 కుటుంబాలలో ఎవరికి ఏ విధమైన కష్టనష్టాలు, సుఖదుఃఖాలు కలిగినప్పటికీ వారికి సిఆర్పిఎఫ్ 234 బెటాలియన్ బి కంపెనీ అండగా ఉంటుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ఎస్సై రాజారావు, సిఆర్పిఎఫ్ పోలీసులు అన్వర్ భాషా, నాయక్, అధిక సంఖ్యలో సిబ్బంది, కూర్మన్నపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img