Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేదల భూములు లాక్కోవడం మంత్రికి తగునా..!

–రైతుల భూములను రైతులకే ఇవ్వాలి
–మంత్రి భూ దందాపై సీఎం జోక్యం చేసుకోవాలి
–సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య

విశాలాంధ్ర ఆస్పరి : పరిశ్రమల కోసం ఇటినా ప్లాంటేషన్ కు రైతులు చౌకగా ఇచ్చిన భూములను మంత్రి కుటుంబ సభ్యులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తిరిగి రైతులకే ఆ భూములను ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పరి రైల్వే స్టేషన్ సమీపంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని 15 ఏళ్ల కిందట ఆస్పరి, చిన్నహోతూరు, పెద్దహోతూరు, మరకట్ట గ్రామాల రైతుల పొలాలను కారు చౌకగా ఇటీనా ప్లాంటేషన్ వారు సుమారు 453 ఎకరాలు భూ సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. ఆ సమయంలో పరిశ్రమలు నెలకొల్పిన తర్వాత భూములు ఇచ్చిన రైతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పిస్తామని కొంతమంది రైతులకు హామీ పత్రాలను కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కొనుగోలు చేసిన భూములలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకుని పంటలు పండించుకుని జీవనం గడిపే వారన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారం నిర్వహించే సందర్భంలో మోసపోయిన రైతుల వివరాలు తెలుసుకొని నన్ను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కంపెనీ వారితో మాట్లాడి ఆ భూములను మీకే తిరిగి ఇప్పించే ఏర్పాట్లు చేస్తానని ఆయా గ్రామాల రైతులకు మంత్రి హామీ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. తీరా ఎన్నికల్లో గెలిచి జగన్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంవత్సరంలోపే పేద రైతుల భూములను తన భార్య, కుటుంబ సభ్యుల పేరిట రైతులకు తెలియకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంత్రికి తగునా అని ప్రశ్నించారు. న్యాయం చేస్తానని చెప్పిన మంత్రి రైతులను నట్టేట ముంచారని విమర్శించారు. మంత్రి గుమ్మనూరు జయరాం భూ దందాపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, పట్టణ సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, సిపిఐ నాయకులు రంగన్న, రామచంద్ర, ముని, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి యువరాజు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img