Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా

-ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ సాకే రాజేష్

విశాలాంధ్ర-రాప్తాడు : అన్ని విధాల వెనుకబడిన రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి రాజేష్ అన్నారు. రాప్తాడు
తహశీల్దార్ కార్యాలయంలో గురువారం రాప్తాడు ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రుద్రంపేట బైపాస్ నుంచి రాప్తాడు వరకు భారీ వాహన శ్రేణితో వచ్చి నామినేషన్ వేశారు. రాప్తాడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంత బాబుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరు మండలాల్లో టీడీపీ, వైసీపీలకు గట్టి పోటీనిచ్చేందుకు గ్రామాల్లో తిరుగుతూ కులమతాలు, రాజకీయాలకతీతంగా నిరుపేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేశానన్నారు.
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినా పట్టువదలకుండా ఉన్నత చదువులు చదివి ఒక స్థాయికి ఎదిగానన్నారు. సమాజంలో ఉన్న కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూశానని.మ
కష్టాల విలువ తెలుసు కాబట్టే సమాజంలో అట్టడుగు స్థాయివారికి తన వంతు సాయం చేస్తున్నానన్నారు. రాప్తాడును నెంబర్ వన్ నియోజకవర్గం చేయాలని అనుకుంటున్నానని..ఇది సాధ్యం కావాలంటే పరిటాల సునీత పోయారు… ప్రకాష్ రెడ్డి పోవాలి రాజేష్ రావాలి అనే నినాదంతో ముందుకు సాగుతున్నానన్నారు. ప్రేమతో 12 అనే మేనిఫెస్టోతో గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ తాను చేసే సంక్షేమ అభివృద్ధిని వివరిస్తున్నానన్నారు. నాలాంటి వ్యక్తి రావాలని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తున్నారన్నారు. గత నాలుగన్నారేళ్లుగా తాను చేసిన సేవా కార్యక్రమాలను దగ్గరుండి గమనించారన్నారు. ఎలక్షన్ ముందు వచ్చి ఓటేయాలని అడిగే వ్యక్తిని కాదని అలాంటి వారిని ఎవరు నమ్మరన్నారు ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేయడం వల్ల చేస్తున్న వాటిని ప్రభుత్వం అడ్డుకోదన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద కంపెనీల ద్వారా నిధులు కూడా తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేయవచ్చన్నారు. అయితే ప్రస్తుత పాలకులు అలాంటివేమీ పట్టించుకోవడం లేదన్నారు. అందరినీ కలుపుకొని పోయే మేనిఫెస్టోలో మహిళలు, విద్యార్థులు, రైతులు, ఇతర అన్ని వర్గాలు ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికలలో 80000 ఓట్ల టార్గెట్ తో తన ప్రయాణం ఉందన్నారు. ఈ ఆరు మండలాల్లో అన్నిచోట్ల సేవ కార్యక్రమాలు చేయడం వల్ల ఓట్లు సాధించేందుకు సులభంగా ఉందన్నారు. తన మేనిఫెస్టోపై టిడిపి, వైసిపి రెండు వర్గాల వారికి సదాభిప్రాయం ఉందన్నారు. ప్రొఫెసర్ రాజేష్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ ద్వారా ఎంతో మంది విద్యార్థులను ప్రోత్సహించానన్నారు. రాష్ట్రంలో టిడిపి, వైసీపీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గెలిచిన పార్టీకి మద్దతు ఇచ్చి నియోజకవర్గ అభివృద్ధికి సాధ్యమైనన్ని నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img