Monday, April 22, 2024
Monday, April 22, 2024

అమ్మ ఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలి

అధికారులతో సీఎం జగన్‌
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతంగా ఉందని, అది సెప్టెంబరులో 82 శాతానికి పెరిగిందని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. విద్యాశాఖపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై అధికారులతో సీఎం విస్త్రృతంగా చర్చించారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై జగన్‌ ఆరా తీశారు. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆ దిశగా తల్లులను, పిల్లలను చైతన్యం చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ ఏడాది నుంచి అమ్మ ఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు 75 శాతం ఉండాలని ఇదివరకే నిర్ణయించామని, ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధనలు అమలుచేయాలన్నారు. అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ తీసుకొచ్చేదిశగా చర్యలు తీసుకోవాలన్నారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్‌ఉండాలని స్పష్టం చేశారు. దీనిమీద మ్యాపింగ్‌ చేసి.. ప్లే గ్రౌండ్‌లేని చోట భూ సేకరణచేసి ప్లే గ్రౌండ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలన్నారు. ఈమేరకు ప్రణాళిక సిద్ధంచేయాలని ఆదేశించారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికి విద్యాకానుకను వారికి అందించాలని చెప్పారు. విద్యాకానుకలో భాగంగా పిల్లలకు స్పోర్ట్స్‌ డ్రస్‌, రెగ్యులర్‌, స్పోర్ట్స్‌కి ఉపయోగపడేలా ఉండే షూ ఇవ్వాలన్నారు. ప్రతి స్కూల్‌కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.1 లక్షను వారికి అందుబాటులో ఉంచాలన్నారు. మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం వారికి ఉంటుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ (దిశ స్పెషల్‌ ఆఫీసర్‌) కృతికా శుక్లా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img