Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

అవి కుటుంబ ఆస్తులే

. వైఎస్‌ బతికుండగా పంచలేదు బ నాకు ఇద్దరూ సమానమే
. నా పిల్లల గురించి తక్కువగా మాట్లాడొద్దు
. వైఎస్‌ విజయమ్మ బహిరంగ లేఖ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: అమ్మగా నాకు (వైఎస్‌ జగన్‌, షర్మిల) ఇద్దరూ సమానమేనని… అలాగే రాజశేఖర్‌ రెడ్డి మాట సమానమేనని, ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజమని వైఎస్‌ విజయమ్మ పేర్కొన్నారు. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఆస్తి ఉండాలన్న వైఎస్‌ఆర్‌ ఆజ్ఞ నిజం అని, ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్‌ కష్టం ఉందనేది వాస్తవమని విజయమ్మ స్పష్టంచేశారు. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం అని స్పష్టం చేశారు. జగన్‌ బాధ్యత గల కొడుకుగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలనేదీ నిజమని ఆమె తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా బాధేస్తుందన్నారు. ఈ వ్యవహారంలో నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని నా కళ్లముందే జరిగి పోతున్నాయని వాపోయారు. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని, అబద్ధాల పరంపర కొనసాగుతోందన్నారు. తెలిసి కొంత, తెలియకుండా కొంత మాట్లాడుతున్నారని, అవి ఎక్కడెక్కడికో పోతున్నాయన్నారు. నా పిల్లలిద్దరికీ కాదు, చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదని, నేను మీ ముందుకు ఈ విషయంగా రాకూడదని అనుకున్నప్పటికీ, రావాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. వైఎస్‌ఆర్‌కు మేమెంతో, మీరు కూడా అంతేనని ఆమె తెలిపారు. ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నానని, ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు అని, మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో, మిమ్మల్ని అంతగానే ప్రేమించారన్నారు. రాజశేఖర్‌ రెడ్డి మన మధ్యనుంచి వెళ్లిపోయాక మీరు నా పిల్లలను, ఆయన ఉన్నప్పటి కంటే ఎక్కువగా ప్రేమించి, ఆదరించి అక్కున చేర్చుకున్నానని గుర్తుచేశారు. దానికి నేను ఎన్నటికీ మరిచి పోలేనని, అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటానంటూ ఆమె హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నానని, దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని, ముఖ్యంగా సోషల్‌ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు అని, దూషణలు చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దని, మీరెవరూ రెచ్చ గొట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. నేను నమ్మిన దేవుడే..నా బిడ్డల సమస్యలకు పరిష్కారం చూపిస్తాడన్న నమ్మకం నాకుందన్నారు.
వైఎస్‌ బతికి ఉండగానే ఆస్తులు పంచేశారన్నది అవాస్తవమని ఆమె పేర్కొన్నారు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి ఇతరులు అందరూ మాట్లాడుతూ, వైఎస్‌ఆర్‌ బ్రతికి ఉండగానే ఆస్తులు పంచేశారని వ్యాఖ్యానించడం అవాస్తవమని ఆమె తెలిపారు. వైఎస్‌ఆర్‌ పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుంచి, కొన్ని ఆస్తులు షర్మిల పేరు మీద, కొన్ని ఆస్తులు జగన్‌ పేరు మీద పెట్టారని వివరించారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదని, వైఎస్‌ఆర్‌ బ్రతికి ఉండగనే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారని లిస్ట్‌ చదివారని, అలాగే జగన్‌ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్‌ చదివి ఉండాల్సిందని వారికి విజయమ్మ సూచించారు. ఆడిటర్‌గా ఉన్న విజయసాయిరెడ్డికి అన్నీ తెలుసు అని తెలిపారు.
వైవీ సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా ఎంవోయూపై సాక్షి సంతకం చేశారని, అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించిందన్నారు. అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెబుతున్నానని, వారిద్దరూ నా పిల్లలు అని, వారిని నేను, వైఎస్‌ఆర్‌ ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నామని పదేపదే లేఖలో ఆమె పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img