Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

రాష్ట్రాన్ని తిరోగమనం పట్టిస్తున్న సిగ్గులేని ప్రభుత్వం వైసీపీ

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో మొదటి ర్యాంకు ఉంటే పరిశ్రమలెక్కడ
రూ.10కోట్లు లంచం ఇవ్వనందునే తరలిపోయిన జాకీ
మూడుసార్లు భూమిపూజ చేసిన ఉక్కు నిర్మాణం ఎప్పుడో..?
లేపాక్షి నాలెడ్జ్‌ హద్దులో రూ.10వేల కోట్లు ఆస్తులను కొట్టుకుపోతున్నది జగన్‌ మేనల్లుడు రామాంజుల రెడ్డి కాదా..?

: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విశాలాంధ్ర- రాప్తాడు : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్ళ వుతున్నా ఎలాంటి అభివృద్ధి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉందని,
కరువు జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సింది పోయి వచ్చిన పరిశ్రమలను బెదిరింపులు, దౌర్జన్యాలతో వైసీపీ నాయకులు వెనక్కు వెళ్లేలా చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జాకీ పరిశ్రమకు కేటాయించిన స్థలాన్ని మంగళవారం ఆయన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి జగదీష్‌, జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కె.రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో విద్యార్థులు తమ భవిష్యత్తు దృష్ట్యా పారిశ్రామిక రంగం అభివృద్ధి కావాలని ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారని, అయితే ఈ ప్రభుత్వం అలాంటి వాటికీ తిలోదకాలు ఇస్తూ రాష్ట్రాన్ని తిరోగమన దశకు చేరుకునేలా సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రాప్తాడులో జాకీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరువేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ప్రధానంగా మహిళలకు గార్మెంట్స్‌ లో వర్క్‌ కూడా దొరుకుతుందనే సదుద్దేశంతో ముందడుగు వేశారని, ఇలాంటి ఫ్యాక్టరీని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ఎన్నికలకు రూ.20కోట్లు ఖర్చు పెట్టాను. కాబట్టి నాకు రూ.10కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా వారు ఇవ్వనుందున హైదరాబాదులో పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారన్నారు. ఇప్పటికే హైదరాబాదు అన్ని రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి జరిగిందని, మరి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో దేశంలోనే ఏపీకి మొదటి ర్యాంక్‌ వచ్చిందని చెప్తున్న సీఎం జగన్‌ పరిశ్రమలు ఎక్కడ వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎక్కడైనా ఒక పరిశ్రమ వచ్చిందా… పదివేల మందికైనా ఉద్యోగాలు ఇచ్చారా…అని అడుగుతున్నామన్నారు. నీ సొంత జిల్లా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు వైఎస్సార్‌, చంద్రబాబు శంకుస్థాపన చేశారు…అడుగు పడలేదు.. జగన్‌ సీఎం అయ్యారు.. ఉక్కు పరిశ్రమ పెడితే వేలాది మంది లబ్ధి పొందుతారని మళ్లీ శంఖుస్థాపన చేశారు.. ఇప్పటి వరకూ ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో దానిపై ఏమీ మాట్లాడలేకపోతున్నావని విమర్శించారు. చేతగాని దద్దమ్మ ఈ ర్రాష్టానికి సీఎంగా ఉన్నావు. ప్రధానమంత్రిని కూడా అడగలేకపోతున్నావంటే నీ పరిస్థితి ఏంటో అర్థమవుతోందన్నారు. ఇక్కడేమో నీ ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి జాకీ పరిశ్రమ జీఎంను బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్‌ చేసి దౌర్జన్యం చేసి పారిపోయేటట్లు చేశాడని ఆరోపించారు. సిగ్గులేని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. సిగ్గులేని వెధవలు రాజ్యంలో ఉంటే ఎవరికి కూడా ఉపాధి దొరికే పరిస్థితి లేదు. ఏదేమైనా సరే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. గతంలో కియా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మీ హిందూపురం ఎంపీ మాధవ్‌ కూడా బెదిరించడంతో అక్కడ అనుబంధ పరిశ్రమలు కూడా రాని పరిస్థితన్నారు ఇక్కడేమో రాప్తాడు, అనంతపురానికి సమీపంలో నీ ఎమ్మెల్యే ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం గురించి నీవు ఎందుకు మౌనంగా ఉన్నావని సీఎం జగన్మోహన్‌ రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. సాక్షాత్తుఈరాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తివి నువ్వు నీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడుతుంటే మౌనంగా ఎందుకు ఉన్నావన్నారు. పైగా ఈ జాకీ ఫ్యాక్టరీ 2018లోనే వెనక్కు పోయిందని ఎమ్మెల్యే అబద్దాలు చెప్తున్నాడు..అయితే ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నామని 2019లో డిక్లరేషన్‌ ఇచ్చారన్నారు. 2019లో అధికారంలో ఉన్నది మీరే కదా..లేక టీడీపీ ఉందా అని అన్నారు. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతే దౌర్జనాలు పెట్రేగి పోతున్నాయ్‌.. ఖచ్చితంగా చెప్తున్నాం జాకీ పరిశ్రమను ఇక్కడకు తెప్పించాలని, లేకపోతే మాత్రం వచ్చే 2024 ఎన్నికల్లో ప్రజలు ఇదే ప్రధానమైన ఎజెండాగా తీసుకొని మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి తగిన బుద్ధి చెబుతారని సీపీఐ తరపున హెచ్చరిస్తున్నామన్నారు. దీనిపై
సీఎం జగన్‌ తక్షణమే స్పందించాలని లేని పక్షంలో మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాల్లో అభివృద్ధి కోసం ఏమైనా పని చేస్తున్నారా అని విమర్శించారు లేపాక్షి నాలెడ్జ్‌ హద్దులో రూ.10వేల కోట్లు ఆస్తులను కొట్టుకుపోతున్నది ఎవరు…? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మేనల్లుడు రామాంజుల రెడ్డి దాన్ని కొట్టేస్తున్నారు. పైగా చట్టపరంగా మాకొస్తుందని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ బతికున్నప్పుడు 8844 ఎకరాల భూమిని వాళ్లకు కేటాయించారు. దాన్ని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.4వేల కోట్లు డబ్బులు లోన్‌ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బు కట్టలేదు కాబట్టి దివాళా తీశారు..దాన్ని బ్యాంకులు వేలం వేస్తే మళ్లీ ఇప్పుడు అదే భూమిని రూ.500కోట్లకు కొంటున్నారు. రూ.10వేల కోట్ల విలువైన భూమి చట్టపరంగా వాళ్ళు దక్కించుకుంటున్నారన్నారు. నాడు వైఎస్సార్‌ తో ప్రారంభమై ప్రస్తుతం జగన్‌ ద్వారా వాళ్ల చేతుల్లోకి వస్తోందని… మీ నాటకాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. మీకు బాధ్యత ఉంది కాబట్టి మరొకరితో ఫ్యాక్టరీని పెట్టించాలన్నారు. ఒక వైపేమో రైతులు పంటలు లేక ఇబ్బందులు పడుతూ కరువు కాటకాలతో అకాల వర్షాలు అధిక వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే వారికి ఉపాధి లేక వలసలు వెళ్తున్నారు. వచ్చే పరిశ్రమలు కూడా రాకుండా పోతుంటే మిమ్మల్ని ఏమనాలని, సైంధవుల మాదిరి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. మొత్తం రాష్ట్రమంతా అభివృద్ధి జరగకుండా ఆటంకపరుస్తున్నారని, ఖచ్చితంగా ఇది ఒక అనంతపురానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదని, రాష్ట్రవ్యాప్త సమస్యగా పరిగణిస్తామన్నారు. చదువుకున్న యువకులందరూ ఉపాధి ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలతో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి ఈ గుడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్‌ మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కియా పరిశ్రమ తీసుకురావడంతో లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. అదేవిధంగా జాతీయ రహదారిలో 27 ఎకరాల్లో జాకీ పరిశ్రమ పెట్టేందుకు తీసుకొస్తే వైసీపీ ప్రభుత్వం పెట్టకుండా చేసిందంటే కారణం జగన్‌ మామూళ్ళు పెరిగి పోవడమేనన్నారు. ఇందుకు ఉదాహరణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వ్యాపారం చేసునేందుకు తమిళనాడుకు చెందిన శేఖర్‌ రెడ్డికి ఇచ్చారు. సీఎంఓ కార్యాలయానికి ఇచ్చే ముడుపులు అందజేయలేదని ఇప్పుడు జిల్లాకు ఒకరిని నియమించుకుని ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలు పెట్టేందుకు రూ.కోట్లు డిమాండ్‌ చేస్తే వారికొచ్చే లాభాలు అధికార పార్టీ వారికి ముట్టజెప్పేందుకేనా అని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మాత్రమే కల్పించడానికి ప్రయివేటు పరిశ్రమలు పెడతారన్నారు. చిత్తశుద్ధి ఉంటే జాకీ పరిశ్రమ పెట్టొచ్చు కదా అని ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డిని ప్రశ్నించారు. మూడున్నళ్ల నుంచి రామగిరి గనులను తెరిపిస్తామని ఆర్నెళ్లకోసారి చెప్పడమే కానీ ఎప్పుడు తెరిపిస్తారో చెప్పాలన్నారు రాష్ట్రంలోనే పెద్దగా ఉన్న ఎఫ్‌ సీఐ గౌడౌన్‌ ను కాకుండా ప్రైవేట్‌ వారికి లబ్ధి పొందేలా ప్రైవేట్‌ గోదామును ఉపయోగించుకోవడం అత్యంత దయనీయమన్నారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు సి.మల్లికార్జున, పి.నారాయణస్వామి, నియోజకవర్గ కార్యదర్శి పి.రామకృష్ణ, జిల్లా కార్యవర్గసభ్యులు కేశవరెడ్డి, తలారి నారాయణస్వామి, రమణయ్య, రాజేష్‌, సంతోష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌ బాబు, మండల కార్యదర్శులు రమేష్‌, రవీంద్ర, రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కుల్లాయిస్వామి, నాయకులు నియోజకవర్గ సహాయ కార్యదర్శులు శ్రీకాంత్‌, నాగరాజు, వెంకటనారాయణ, పోతన్న, ఏఐవైఎఫ్‌ ధనుంజయ, నాయకులు చలపతి, మౌలాలి, పెద్దన్న, రఫీ, రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img