Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రజల మనిషి చండ్ర రామలింగయ్య

. ఆయన త్యాగాలు అసమానం
. ఆశయ సాధనకు కృషే నిజమైన నివాళి
. 50వ వర్ధంతి సభలో రామకృష్ణ

విశాలాంధ్ర -చల్లపల్లి: ప్రజాహితం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అమరజీవి చండ్ర రామలింగయ్య అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కొనియాడారు. మన పూర్వీకులు ఎలాంటి సమాజాన్ని అకాంక్షించి త్యాగాలు చేశారో అలాంటి సమాజ స్థాపన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాని పిలుపునిచ్చారు. అదే రామలింగయ్యకు మనం అర్పించే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు చండ్ర రాజేశ్వర రావు సోదరులు, దివి తాలూకా తొలి శాసనసభ్యులు రామలింగయ్య 50వ వర్ధంతి కార్యక్రమం కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో మంగళవారం జరిగింది. తొలుత పార్టీ జెండాను సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ ఆవిష్కరించారు. నాయకులు, కార్యకర్తలు రామలింగయ్య ఘాట్‌ వద్ద పుష్పాంజలి ఘటించారు. చండ్ర రామలింగయ్య, రాజేశ్వరరావు సోదరులు కలిసి నిర్వహించిన పోరాటాల ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ, ధన్యజీవి రామలింగయ్య అని కొనియాడారు. జమిందారీతనానికి వ్యతిరేకంగా పోరాడి పేద రైతులకు భూములు అందించేందుకు రాజేశ్వరరావు నాయకత్వన సాగిన భూ పోరాటాలలో రామలింగయ్య వెన్నెముకగా నిలిచారని గుర్తు చేసుకు న్నారు. కృష్ణా జిల్లా కమ్యూనిస్టు పార్టీకి ఉద్యమాలలో గొప్ప చరిత్ర ఉందని, రాష్ట్ర పార్టీకి కృష్ణా జిల్లా కమ్యూనిస్టు పార్టీ అండగా నిలిచేదని అలాంటి కృష్ణాజిల్లా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో చండ్ర రామలింగయ్య కీలక భూమిక పోషించారన్నారు. నాడు కమ్యూనిస్టు పార్టీలు చేసిన ఉద్యమాలు, పోరాటాల ఫలితంగానే నేటి ప్రభుత్వాలు సామాజిక పెన్షన్లు, పేదలకు పక్కా ఇల్లు వంటి పథకాలు అమలుచేస్తున్నాయని తెలిపారు. పేదల పక్షాన సాగిన అనేక భూ పోరాటాలలో, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలలో చండ్ర రాజేశ్వరరావు, చండ్ర రామలింగయ్య ముందుండి నడిపించారని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితులలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడిన మాట వాస్తవమేనని కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడబట్టే దేశానికి ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలలో ప్రశ్నించేవారు లేక దేశ సంపదను కొల్లగొడుతున్నారన్నారు. 70 సంవత్సరాల స్వాతంత్య్ర ఫలాన్ని కొద్దిమందికే దోచి పెడుతున్నారని తెలిపారు. కొద్దిమందికి దోచిపెట్టడమే దేశభక్తా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య గొంతుకలు బలపడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఏరోజైతే కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాలు బలపడతాయో అప్పుడే ప్రజాస్వామ్యం రక్షించబడుతుందని చెప్పారు. మంగళాపురంలో జరిగిన పోరాటాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. ప్రమాదకరమైన రాజకీయ పరిస్థితులలో కమ్యూనిస్టు పార్టీల బలం పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ దిశగా ముందుకు సాగటమే రామలింగయ్యకు మనం అర్పించే నిజమైన నివాళిగా పేర్కొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి రామలింగయ్య కృషి చిరస్మరణీయమన్నారు. కార్యకర్తలను బాగా ఆదరించే వారన్నారు. ధనిక కుటుంబంలో జన్మించినప్పటికి పేదల సమస్యల పరిష్కారానికి అహరహం శ్రమించారన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సీపీఐ జిల్లా ఇన్‌చార్జ్‌ కార్యదర్శి టీ.తాతయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు ఆర్‌. పిచ్చయ్య, విశాఖ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చిన్నం కోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు వెలగపూడి ఆజాద్‌, చండ్రప్రసాద్‌, హనుమానుల సురేంద్రనాథ్‌ బెనర్జీ, కొమ్మన నాగేశ్వరరావు, అభ్యుదయ రచయితల సంఘం నాయకులు మాధవరావు, సీపీిఐ పామర్రు నియోజకవర్గ కార్యదర్శి దగాని సంగీతరావు మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మల్లు పెద్ది రత్నకుమారి, రామలింగయ్య కుటుంబ సభ్యులు పిడికిటి సంధ్య కుమారి, చండ్ర రామకోటేశ్వరరావు (ఆనంద్‌ ) తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img