Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మార్క్సిజం జీవనది..

`కార్ల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ సంకలిత రచనల ఆవిష్కరణ సభలో వక్తలు

విశాలాంధ్ర`విజయవాడ:సమాజ పురోభివృద్ధిలో, మానవ వికాసానికి మార్క్పిజం అవసరం ఉందని, మార్క్సిజం జీవనదిలాంటిదనీ, మానవాళి ఉన్నంత వరకు మార్క్సిజం ఉంటుందని వక్తలు వక్కాణించారు. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించిన ‘కార్ల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ సంకలిత రచనలు( రెండు సంపుటాలు) పుస్తకాల ఆవిష్కరణ సభలో వారు పాల్గొన్నరు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జరుగుతున్న 33వ విజయవాడ పుస్తక మహోత్సవంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఒక సంపుటిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మరో సంపుటిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఎ.బేబి మాట్లాడుతూ మార్క్స్‌ సమాజంపై స్వచ్ఛమైన అవగాహనతో చరిత్రలో జరిగిన సంఘటనలను పరిశీలించి సమాజాన్ని ఎలా మార్చాలి అనే అంశంపై పరిశోధన చేశారని చెప్పారు. అమెరికా ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో ప్రగతిశీలవాదులు ఐక్యం కావాల్సిన అవసరం వచ్చిందన్నారు. యూఎస్‌ఎస్‌ఆర్‌, ఈస్ట్‌ యూరప్‌ ప్రయోగాల తరువాత కమ్యూనిజం బలహీన పడిరదన్నారు. సమాజంలో మానవుల ఆలోచనలు ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయని కమ్యూనిజం మళ్లీ పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మార్క్స్‌ కూడా తాను చెప్పిందే ఫైనల్‌ అని నిర్ధారించలేదన్నారు. సమాజ మార్పు కోసం మార్క్స్‌, ఎంగెల్స్‌ రూపొందించిన సిద్ధాంతాన్ని లెనిన్‌ అమలు చేశారని వివరించారు. సమాజ పురోభివృద్ధిలో మహిళల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు నన్నపనేని అంజయ్య పుస్తకాల్ని పరిచయం చేశారు. అనంతరం ‘సమకాలీన సమాజానికి మార్క్స్‌ రచనల ప్రాసంగీత’ అనే అంశంపై ప్రసంగించారు. పురాణాలు, ప్రాచీన సాహిత్యం ప్రకృతి శాస్త్రాలని భిన్నంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. సామాజిక శాస్త్రాన్ని వెనక్కు తిరిగి పరిశీలించటం చాలా అవసరం అన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ సమాజం, ప్రకృతి, సామాజిక శాస్త్రాలకు సంబంధించి మార్క్స్‌ సిద్ధాంతం మొదటి స్థానంలో ఉంటుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ సంపాదకులు గడ్డం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం ఎందుకు వస్తాయనే అంశాలపై 170 సంవత్సరాల క్రితమే మార్క్స్‌ విశ్లేషించి రచనలు చేశారని చెప్పారు. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ శాస్త్రీయ విజ్ఞానం, మతసామరస్యం, సౌభ్రాతృత్వం అంశాలకు సంబంధించి అనేక పుస్తకాలను ప్రచురించిందన్నారు. కందుకూరి, గిడుగు వంటి ప్రముఖుల రచనలు కూడా ప్రచురించిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ నేడు వర్గపోరాటాల గురించి కమ్యూనిస్టుల కంటే కోట్లు సంపాదించి, అధికారం చెలాయిస్తున్న వారు ఎక్కువ మాట్లాడుతున్నారని చెప్పారు. వర్గ దృక్పధం లేకుండా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. మతోన్మాద శక్తులు, అభివృద్ధి నిరోధకులు అధికారం చేజిక్కించుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో కమ్యూనిస్టుల బలం తగ్గిన కారణంగానే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా ప్రధాని లెక్కచేయకుండా ప్రసంగించారని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పెట్టుబడి దారులు సంక్షోభంలో పడ్డారని సర్దుబాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర విజ్ఞాన సమితి చైర్మన్‌ ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శి జల్లి విల్సన్‌, కోశాధికారి జి.ఓబులేసు పాల్గొన్నారు. విజయవాడ బుక్‌ఫెస్టివల్‌ అధ్యక్షులు టి.మనోహర్‌ నాయుడు స్వాగతం పలికారు. కార్యదర్శి కె.లక్ష్మయ్య వందన సమర్పణ చేశారు. ముందుగా ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రానాయక్‌ అభ్యుదయ గీతాలు ఆలపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img