Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

శబరి, గోదావరి నదులకు ఎగపోటు

పోలవరం కాఫర్‌ డ్యామ్‌ ఎఫెక్ట్‌..
జల దిగ్బంధంలో 30కు పైగా గ్రామాలు
ఏపీ, ఒడిశా మధ్య రాకపోకలు బంద్‌

పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుం డటమే కాకుండా ఎగపోటుకు గుర య్యాయి. చింతూరు మండలంలోని కుయ్గూర్‌ వాగు బ్రిడ్జిపై వరద నీరు చేరడంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల కు రాకపోకలు బంద్‌ అయ్యాయి. రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని కల్లేర్‌ గ్రామ పంచాయతీలోని కుయ్గూర్‌, మదుగుర్‌, సూరన్నగొంది గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చింతూరు నుండి వీఆర్‌ పురం వెళ్లే రహదారిలో చీకటి వాగు, సౌకిలేరు ఎగపోటుకు గురవడం వల్ల చింతూరు మండలంలోని పెద్ద సీతనపల్లి, రామన్న పాలెం, ముకునూరు, అగ్రహరపు కోడేరు, వీఆర్‌ పురం మండలంలోని కుందులుర్‌, గుల్లెట్‌వాడ గ్రామ పంచాయ తీలలోని సుమారు 30 గ్రామాలకు, చింతూరు మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చట్టీ నుండి కుమ్మురుకు వెళ్లే మార్గంలో ఉన్న చంద్రవంక వాగు ఎగపోటుకు గురవడంతో చింతూరు మండల కేంద్రానికి రాకపోకలు బంద్‌ అయ్యాయి. వరద నీరు జామాయిల్‌ తోటలను ముంచాయి. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి తగ్గడంతో కూనవరం వద్ద 45 అడుగులకు చేరి నిలకడగా ఉంది. చింతూరు వద్ద శబరి నది నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి 34 అడుగుల వద్ద నిలకడగా ఉంది. సీలేరు జలాశయం నుండి నీరు విడుదల చేయక పోవడం, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం నుండి శబరి నదికి వరద తాకిడి లేకపోవడంతో చింతూరు వాసులకు కొంత వరద భయం తగ్గింది. చీకటివాగు, కుయ్గూర్‌ వాగుల వద్ద వాహనాలను దాటనీయకుండా, ఎటువంటి ప్రమాదాల జరగనీయకుండా ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ, తహసిల్దార్‌ కరక సత్యనారాయణ ఆదేశాల మేరకు వీఆర్‌వోలు మడకం దులయ్య, సొడి రామచంద్రం పర్యవేక్షిస్తున్నారు. సోమవారానికి వరద తగ్గుముఖం పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img