Friday, May 3, 2024
Friday, May 3, 2024

సంక్రాంతి నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్‌’

గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని వచ్చే నెల మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు పైలట్‌ ప్రాజెక్టు నిర్వహిస్తామని, సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. ఆయన గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ విధానంలో ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉంటారన్నారు. పీహెచ్‌సీలోని ప్రతి వైద్యుడు రోజు మార్చి రోజు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)తో వెళ్లి గ్రామాల్లో వైద్య సేవలందిస్తారని చెప్పారు.
ఇందుకోసం పీహెచ్‌సీ పరిధిలోని సచివాలయాలను వైద్యులకు మ్యాపింగ్‌ చేశామన్నారు. 104 ఎంఎంయూ వాహనంతో కలిసి వైద్యుడు ప్రతి గ్రామాన్ని నెలలో రెండుసార్లు సందర్శిస్తారని తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 656 వాహనాలకు అదనంగా మరో 434 వాహనాలు కొంటున్నట్లు చెప్పారు. ఇవి నవంబర్‌ నెలాఖరుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని, డిసెంబర్‌ నుంచి ప్రతి గ్రామానికి 104 వాహనం రెండు సార్లు వెళుతుందని వివరించారు. పీహెచ్‌సీలో వైద్యుడు సెలవు పెట్టినప్పుడు వైద్య సేవలకు ఇబ్బంది కలగకుండా సమీపంలోని సీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఇంకా ఇబ్బంది ఏర్పడితే సమీప ఏరియా, జిల్లా ఆస్పత్రుల వైద్యులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అదే విధంగా పీహెచ్‌సీ వైద్యులకు సీయూజీ ఫోన్‌ నంబర్లు కేటాయించి, వాటిని విలేజ్‌ క్లినిక్‌లలో ప్రదర్శిస్తామని చెప్పారు. ప్రజలు అవసరమైనప్పుడు ఆ నంబర్లలో ఫ్యామిలీ వైద్యుడిని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని విజయవంతం చేయడానికి ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఫ్యామిలీ వైద్యుడి విధానం అమలులోకి వస్తే అధిక శాతం జబ్బులకు గ్రామంలోనే వైద్య సేవలు అందుతాయని, ప్రజలకు పెద్దాస్పత్రులకు వెళ్లే భారం తప్పుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img