Friday, May 3, 2024
Friday, May 3, 2024

సాగర్‌ కుడికాలువకు వెంటనే సాగునీరు

. ముప్పాళ్ల, కేవీవీ ప్రసాద్‌ డిమాండ్‌
. నరసరావుపేట ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా

విశాలాంధ్ర – నరసరావుపేట: నాగార్జునసాగర్‌ కుడి కాలువకు అధికారులు అర్ధాంతరంగా సాగునీరు నిలిపివేయడంతో ఆయకట్టు పరిధిలో లక్ష ఎకరాల మేర చేతికి వచ్చిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారని, సాగర్‌ కాలువలకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ ప్రభుత్వాన్ని, నీటిపారుదల శాఖ అధికారులను డిమాండ్‌ చేశారు. సాగర్‌ కాలువలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం అధ్వర్యంలో శనివారం రైతులు నరసరావుపేట పట్టణ పరిధిలోని ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈ నరేంద్రకు వినతిపత్రం అందజేశారు. ధర్నాను ఉద్దేశించి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సాగర్‌ కుడికాలువ పరిధిలోని నాలుగు జిల్లాల్లో లక్ష ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పెసర, మిర్చి పంటలు సాగు చేస్తున్నారన్నారు. పంట పొట్ట దశలో ఉన్న సమయంలో అర్ధాంతరంగా సాగునీటిని నిలిపివేయడంతో పంటలు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిరదన్నారు. ఇప్పటికే చీడపీడలతో దిగుబడి తగ్గి ఆందోళన చెందుతున్న రైతులు… సాగునీరు నిలిపివేయడంతో పంటలు దెబ్బతిని…ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని ముప్పాళ్ల చెప్పారు. సాగర్‌ కుడికాలువ ఆయకట్టు రైతుల సాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి మరో 20 రోజుల పాటు 8 నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ముప్పాళ్ల కోరారు. కేవీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ సాగర్‌ ఆయకట్టు పరిధిలో దాళ్వాకు సాగునీరు ఇస్తామని, రైతులు ఏ పంటలనైనా సాగు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించడం వల్లే ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో రైతులు వేలాది ఎకరాల్లో దాళ్వా వరి, మొక్కజొన్న, పెసర, మిర్చి సాగు చేశారని చెప్పారు. ఎలాంటి సమాచారం లేకుండా 15 రోజుల ముందే కాలువలకు నీటిని అధికారులు నిలిపివేశారని విమర్శించారు. రైతులకు సాగునీటిని విడుదల చేయాలని, లేకపోతే పెద్దఎత్తున రైతు ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. అధికారులు కాలయాపన చేస్తే మరో నాలుగైదు రోజుల్లో రైతుసంఘం అధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రకటిస్తామని, ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్నాలో సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్‌, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, రైతుసంఘం కార్యదర్శి ఉలవలపూడి రాము, బూదాల శ్రీనివాసరావు, సీపీఐ నాయకుడు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్‌, లక్షాధికారి, కోయ శీను, పి.వెంకటేశ్వర్లు, పవన్‌కుమార్‌, మల్లికార్జున, చంద్ర, నరసింహారావు, వరహాలు, యు.రామారావుతో పాటు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img