Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదు..

రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదుకావడం గమనార్హం. మరో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. గురువారం అత్యధికంగా నంద్యాల జిల్లానందవరంలో 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా.. తర్వాతి విజయనగరం జిల్లా రాజాంలో 45.5 డిగ్రీలు, అల్లూరి జిల్లా కొండైగూడెంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో 44.7 డిగ్రీలు, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరపల్లెలో 44.1 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా నందరాడ, పల్నాడు జిల్లా రావిపాడు, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు వెల్లడించారు.
ఏపీవ్యాప్తంగా 16 జిల్లాల్లో 43 డిగ్రీల సెల్సియస్‌‌పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. రాష్ట్రంలోని 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచాయని పేర్కొన్నారు. శుక్రవారం 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు. అలాగే, మరో 174 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శనివారం 64 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 170 వడగాల్పులు వీచే అవకాశం ఉందన్న ఆయన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో 13 , విజయనగరం జిల్లాలో 23 , పార్వతీపురం మన్యం జిల్లాలో 13 , అనకాపల్లి జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో ఒక్కో మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img