Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య

. వివాహేతర సంబంధమే కారణం
. నెలరోజులుగా గొడవలు
. సర్దుబాటుకు వెళ్లిన అన్న సజీవ దహనం
. తిరుపతి జిల్లాలో ఘటన

విశాలాంధ్ర-తిరుపతి : వివాహేతర సంబంధం రెండు కుటుంబాల మధ్య కక్షలకు కారణమైంది. అవి తారాస్థాయికి చేరుకోవడంతో సమస్యను సర్దుబాటు చేద్దామని వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడు హత్యకు గురై తన కారులోనే సజీవ దహనం అయ్యాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలో బొప్పారాజు పల్లి పరిధి కనుమ వద్ద జరిగింది. శనివారం రాత్రి 11 గంటలకు కారు మంటల్లో కాలుతూ ఒక వ్యక్తి కాలిపోతున్నట్లు రహదారి పై వెళ్లే వాహన చోదకులు పోలీసులకు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో చంద్రగిరి, రామచంద్రాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కారులో యువకుడు పూర్తిగా కాలిపోయి ఉన్నాడు. కారుకు ఉన్న నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా వివరాలు తెలుసుకున్న పోలీసులు చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన జయరామయ్య కొడుకు నాగరాజు (38) గా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు మంటల్లో కాలిబూడిద అయిన నాగరాజు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుని తండ్రి జయరామయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్థానికులు అందించిన కథనం మేరకు వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన చాణిక్య ప్రతాప్‌, అతని తమ్ముడు రిపింజయకు, అదే గ్రామానికి చెందిన జయరామయ్య కుమారులు నాగరాజు, పురుషోత్తం మధ్య నెల రోజులుగా వివాహేతర సంబంధంపై గొడవలు జరుతున్నాయి. పురుషోత్తంను అనేక సార్లు బెదిరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశంతో అన్న నాగరాజు వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న తన తమ్ముడు పురుషోత్తంను బెంగుళూరుకు పంపేశాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రాజీ కుదుర్చుకోవడానికి నాగరాజు బ్రాహ్మణపల్లికి చేరుకొని మధ్యవర్తి గోపీనాథ్‌ రెడ్డితో చాణిక్య ప్రతాప్‌, రిపింజయతో కలిసి సామరస్యంగా చర్చించి, గొడవలు లేకుండా చూడాలని వెళ్లినట్లు చెప్పారు. అయితే బ్రాహ్మణపల్లికి సుమారు 7 కిలోమీటర్లు దూరంలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై పథకం ప్రకారమే నాగరాజును హత్య చేసి కారులో పెట్టి సజీవదహనం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివాహేతర సంబంధంపై పగలు పెంచుకున్న రిపింజయ, చాణిక్య ప్రతాప్‌లే నాగరాజును హత్య చేసారా లేదా బయట వ్యక్తుల చేత చేయించారా అన్న విషయం వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ ఘటనపై ఏఎస్పీ వెంకట్రావు మాట్లాడుతూ బ్రాహ్మణపల్లికి చెందిన రిపింజయ, కొందరు పథకం ప్రకారమే హత్య చేశారని మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు. కాగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నాగరాజును కారులో సజీవ దహనం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఉదయం సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పథకం ప్రకారమే నాగరాజును బొప్పరాజుపల్లి ఘాట్‌ రోడ్డు వద్దకు పిలిపించి హత్య చేశారని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలను పోలీసులు తీవ్రంగా పరిగణించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img