అందుకే ఆంధ్రాపై పడ్డారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్రగుంటూరు: ఉత్తరాది రాష్ట్రాలలో రోజురోజుకు ఎన్‌డీఏ కూటమి బలం తగ్గిపోతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మూడు విడతల్లో జరిగిన ఎన్నిక లలో అది స్పష్టమవుతోందని చెప్పారు. సీపీఐ గుంటూరు జిల్లా సమితి సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరయిన రామకృష్ణ మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీకి బలం పెరగకపోగా తరిగిపోతోందని, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సున్నా సీట్లకే బీజేపీ పరిమితమవుతుందని తెలిపారు. ఈ పరిస్థితితో కంగుతిన్న బీజేపీ పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా ఆంధ్ర రాష్ట్రంపై పడ్డారని విమర్శించారు. చంద్రబాబును దగ్గర చేసుకోవాలని చూస్తున్న బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌పై తన దృష్టిని కేంద్రీకరించి ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడం ప్రారంభించిందని అన్నారు. ఎలాగైనా దక్షిణాదిన సీటు గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలనే అమలు చేయని ప్రధాని మోదీ మళ్లీ ఏపీ ప్రజలకు హామీలు ఇస్తున్నారని అన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరాన్ని పదేళ్లలో పూర్తి చేయలేని బీజేపీ తమకు అధికారం ఇస్తే రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పడంపై ఆయన మండిపడ్డారు. పోలవరం పూర్తికి నిధులు కేటాయించకుండా, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీకి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తానని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, ఎన్‌డీఏ కూటమిని ఓడిరచి ఇండియా కూటమిని గెలిపించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్‌కు ఓటు వేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. రాజధాని అమరావతి ఉద్యమంలో మొదటి నుంచి భాగస్వామిగా ఉన్న సీపీఐ అభ్యర్థిని రైతులు సైతం ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు. రైతులు, కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేసే భారత కమ్యూనిస్టు పార్టీని బలపరచడం ద్వారా రాబోయే రోజుల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మరింత శక్తి చేకూరుతుందని రామకృష్ణ తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 2024 ఎన్నికలలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే 140 కోట్ల మంది దేశ ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడు తుందనే ఆందోళనను మైనార్టీలు, కార్మికులు, రైతులు, నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్న మోదీ, అమిత్ షా... దేశ ప్రగతికి అనుకూల విధానాలను అమలు చేయడం లేదని విమర్శించారు. ఆర్థికంగా, సామాజికంగా, మతపరంగా దేశాన్ని పతనావస్థలోకి తీసుకువెళుతున్నారని, భిన్నత్వంలో ఏకత్వం అనే దేశ విశిష్టతను దెబ్బతీస్తున్నారని, ప్రజల మధ్య విభజన వాదాన్ని తీసుకువస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో మోదీ పొత్తు పార్టీలను ఓడిరచాలని పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో కంకి
కొడవలి గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో జంగాల అజయ్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. జిల్లా పరిధిలోని ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ముప్పాళ్ల పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గుంటూరు పార్లమెంటు సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌కుమార్, సీపీఐ రాష్ట్ర నాయకులు కేవీవీ ప్రసాద్, పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.మారుతి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.