Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నేతన్నలకు అన్యాయం చేయొద్దు

విశాలాంధ్ర-పెడన : మగ్గం నేసే ప్రతి కార్మికుడికి వైఎస్‌ఆర్‌ ‘నేతన్న నేస్తం’ పథకం అమలు చేయాలని, రైతుభరోసా, ఆసరా, వృద్ధాప్య పింఛన్లతో లింకు పెట్టవద్దని, చేనేత సంఘాల వద్ద గల చేనేత నిల్వలను ఆప్కో వెంటనే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కరోనా కష్టకాలంలో రూ.10వేల ఆర్థికసాయంతో నేతన్నలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మికసంఘం రాష్ట్రసమితి పిలుపులో భాగంగా నేతన్నలు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద సోమవారం ధర్నాలు నిర్వహించారు. అనంతరం వినతిపత్రాలు అందజేశారు. చేనేత కార్మికులను ఆదుకోవాలని, నేతన్న నేస్తం అమలులో వివక్ష ప్రదర్శించ రాదని కార్మికులు నినాదాలు చేశారు. రెక్కాడితేగానీ డొక్కాడని చేనేత కార్మికుల ఆకలిబాధలు అర్థం చేసుకోవాలని విన్నవించారు. రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో నేత కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా హేమసుందరరావు బందరులో మాట్లాడుతూ చేనేత సంఘాలకు మాతృసంస్థ అయిన ఆప్కో పాలకవర్గం మరమగ్గాల వస్త్రాలు కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరి నుంచి రూ.1.50 కోట్ల విలువ గల పవర్‌ లూమ్‌ వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. సహకార సంఘాల వద్ద గల నిల్వలను ఆప్కో కొనుగోలు చెయ్యాలని కోరుతున్నా పట్టిం చుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా సహకార సంఘాలు కళ్లు తెరవాలని హితవు పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్‌, చేనేత జౌళీ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు కోదాటి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి బుసం బాలసుబ్రహ్మణ్యం, చేనేత నాయకులు అందె జగదీష్‌, కుర్మ విఘ్నేశ్వరరావు పాల్గొన్నారు.
అర్హులందరికి నేతన్న నేస్తం : చలపతి
విశాలాంధ్రఅనంతపురం : అర్హులందరికీ నేతన్న నేస్తం పథకం వర్తింపచేయాలని చేనేత కార్మికులు డిమాండ్‌ చేశారు. అనంతపురం నగరంలోని మున్సిపల్‌ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు చేనేత కార్మిక సంఘం అధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగానికి మొదటి స్థానమైతే చేనేత రంగానిది రెండో స్థానమన్నారు. చేనేత రంగానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లభించడం లేదని విమర్శించారు. చేనేత కార్మికుల ఆకలిచావులు నిత్యం చూస్తున్నామన్నారు. పాలకులు హామీలు ఇవ్వడం తప్ప ఆచరణ కనిపించడం లేదని మండిపడ్డారు. నేతన్న నేస్తం పథకంలో అక్రమాలకు తావులేకుండా అర్హులైన కార్మికులందరికీ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో చేనేత కార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి గోవింద్‌, రాష్ట్ర నాయకులు లక్ష్మయ్య, నగర అధ్యక్షుడు కృష్ణుడు, నగర ప్రధాన కార్యదర్శి రాజేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. నేతన్న నేస్తంలో వివక్ష చూపొద్దు : పిల్లలమర్రి విశాలాంధ్రగుంటూరు : నేతన్న నేస్తం పథకంలో వివక్షత చూపించవద్దని, మగ్గం నేస్తున్న ప్రతికార్మికుడితో పాటు ఉప వృత్తులే జీవనాధారంతో జీవిస్తున్న కార్మికు లందరికి ఈ పథకం వర్తింపచేయాలని ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వర రావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు గొట్టుముక్కల బాలాజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్‌ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ మగ్గాల ఆధునీకరణ కోసం నెలకు రెండు వేలు చొప్పున ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం చేయడం అభినందనీయమని, అయితే అద్దె ఇంట్లో ఉంటూ షెడ్లలో పనిచేస్తున్న నేతన్నలకు నేతన్న నేస్తం వర్తింప చేయకపోడం దారుణమన్నారు. అధికారులు జోక్యం చేసుకొని సహకార సంఘాలలోని చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బాలాజీతో పాటు చేనేత కార్మిక సంఘం నాయకులు బి.మోహనరావు, ఎ.ప్రభాకరరావు, జె.వెంకటకృష్ణ, డి.ఈశ్వరరావు, జి.దుర్గారావు, పి.నాగాంజనేయులు పాల్గొన్నారు.
షరతులు వద్దు : రామాంజనేయులు
విశాలాంధ్ర బ్యూరో`కర్నూలు : నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికులకు ఇచ్చే 24వేల రూపాయలకు ఎలాంటి షరతులు విధించవద్దని ఏపీ చేతివృత్తిదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ కె.రామాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట గాంధీ విగ్రహం వద్ద నేత కార్మికులు ధర్నా నిర్వహిం చారు. చేనేత కార్మికసంఘం నాయకులు మాధవస్వామి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో రామాంజనేయులు మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. కరోనాతో చేనేత కార్మికులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఆకలితో అలమటిస్తుంటే నిబంధనల పేరుతో పథకం అమలు చేయక పోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ధర్నా అనంతరం డిమాండ్‌ లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందచే శారు. కార్యక్రమంలో చేనేత కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు సోమమోహన్‌, నాయకులు శంకర్‌, ఎం.మల్లేష్‌, ఎస్‌. శంకరప్ప, జె.శ్రీనివాసులు, కె.పద్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img