test
Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

అమిత్‌ షా విధ్వంసక పంథా

ఏ రాజకీయపార్టీ అయినా అధికారంలోకి రావాలనే కోరు కుంటుంది. కానీ బీజేపీ తీరు పూర్తిగా భిన్నమైంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరు సంపాదించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి 35 స్థానాలు వచ్చేట్టు చేస్తే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. అంటే ఆయన దృష్టి విజయం మీది కన్నా ఇతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడం మీదే ఎక్కువ ఉంది. సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాదిసమయం ఉండొచ్చు. కానీ అమిత్‌ షా ఇప్పుడే ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైపోయారు. బీర్భంలోని సూరిలో ఒకసభలో మాట్లాడుతూ లోకసభ ఎన్నికలలో బీజేపీని 35 స్థానాల్లో గెలిపిస్తే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొడ్తామని చెప్పారు. అంటే 2021లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బెంగాల్‌లో అధికారం సంపాదించాలని తీవ్ర ప్రయత్నంచేసి, మమతా బెనర్జీ పరువుకు భంగం కలిగించే రీతిలో ఎన్నికల ప్రచారం కొనసాగించిన బీజేపీ ఘోరపరాజయం పాలైంది. 294 స్థానాలు గల బెంగాల్‌ శాసనసభలో బీజేపీకి 200 సీట్లకు పైనే వస్తాయని అమిత్‌ షా ఊదరగొట్టినా చివరకు దక్కింది 77 స్థానాలే. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా 213 స్థానాల్లో విజయం సాధించింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో బెంగాల్‌లోని మొత్తం 42 లోకసభ స్థానాలలో బీజేపీకి 18 సీట్లు దక్కడంతో ఇక ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టడమే తరువాయి అని మోదీ, అమిత్‌ షా భావించారు. కానీ బెంగాల్‌ ప్రజలు తమ ఆత్మాభిమానం కాపాడుకునే క్రమంలో మమతా బెనర్జీకి అఖండమైన మెజారిటీ సాధించిపెట్టారు. ప్రధానమంత్రి మోదీ ‘‘దీదీ ఓ దీదీ’’ అని మమతా బెనర్జీని ఎద్దేవా చేయడం బెంగాల్‌ ప్రజలు తమ ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టుగా భావించి కసిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ను గెలిపించారు. ఈ అవమాన భారంతో కుంగిపోతున్న బీజేపీ ఇప్పుడు కొత్త ఎత్తు ఎత్తుతోంది. లోకసభలో 35 స్థానాల్లో విజయం కట్టబెడ్తే మమత ప్రభుత్వాన్ని పడగొడ్తారట. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని, అందునా అపారమైన మెజారిటీ ఉన్న సర్కారును పడగొడ్తామని సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి హుంకరిస్తున్నారంటే ఆయనకు, ఆయన నాయకుడు మోదీకి, ఆయన పార్టీకి ప్రజాస్వామ్యం అంటే ఎంత చీదరో అర్థం అవుతోంది. కేంద్ర హోం మంత్రే సకల మర్యాదలను, సంప్రదాయాలను, నియమాలను ఉల్లంఘించి ఇతర పార్టీల ప్రభుత్వాన్ని పడగొడ్తామనడం విడ్డూరం కాదు. అత్యంత ప్రమాదకర ధోరణి. మోదీ బీజేపీని ఎన్నికలలో విజయం సాధించే యంత్రంగా మార్చేశారు. అది బీజేపీకి సంబంధించిన వ్యవహారం అని సరిపెట్టుకోవడానికి వీలులేదు. అందులో భాగంగా ఇతర పార్టీల ప్రభుత్వాలను పడగొడ్తామనడం అత్యంత దారుణమైన ధోరణి.
కాంగ్రెస్‌ ముక్త్‌భారత్‌ అన్న నినాదంతో పరిపాలన ప్రారంభించిన మోదీ నాయకత్వంలోని బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్‌ మాత్రమే కాదు ఏ ప్రతిపక్షం నీడ అయినా సహించడం లేదు. ప్రతిపక్షం లేకుండా ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయించడం బీజేపీ అసలు లక్ష్యం. ఏకపక్ష పాలనకోసం ఉవ్విళ్లూరిన ప్రతిదేశంలోనూ ప్రజాస్వామ్యం మంట గలిసింది. ప్రజాస్వామ్యం అంటే ఒకే పార్టీ పరిపాలన కొనసాగడం కాదు. మెజారిటీ ఉన్న పక్షం అడ్డగోలుగా వ్యవహరించడం అంతకన్నాకాదు. ప్రతిపక్షం బలంగా ఉండడమే ప్రజాస్వామ్యం సవ్యంగా పని చేస్తోందన డానికి నిదర్శనం. మోదీ, ఆయన ప్రభుత్వం గత మూడేళ్లకుపైగా అనుసరిస్తున్న రాజకీయాలను చూస్తే ప్రతిపక్షాలకు స్థానమే లేకుండా చేయాలని సంకల్పించినట్టు కనిపిస్తోంది. ఇలాంటి వైఖరిని నిరంకుశత్వం అంటారు తప్ప ప్రజాస్వామ్యం అనరు. పనిగట్టుకుని ప్రతిపక్షానికి స్థానం కల్పించాలని ఎవరూ అనుకోరు. కానీ ప్రతిపక్షం పొడగిట్టని పార్టీ నిరవధికంగా అధికారంలో కొనసాగాలనుకోవడం దురహంకారానికి చిహ్నం. ప్రతిపక్షాలను అపఖ్యాతిపాలు చేయడానికి బీజేపీ ఎన్ని కుటిల పన్నాగాలు పన్నుతోందో అందరికీ తెలుసు.
దాదాపు ప్రతి ప్రతిపక్ష పార్టీ మీద అవినీతి ముద్రవేసి ఆ పార్టీల నాయకుల మీద కేంద్ర దర్యాప్తు వ్యవస్థలైన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ (ఈ.డి.)తో దాడి చేయించి ప్రతిపక్షాలకు అవినీతి మకిలు అంటుకుందని బీజేపీ నిరంతరం ప్రచారం చేస్తోంది. అమిత్‌ షా షరా మామూలుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అవినీతికి నిలయంఅని నమ్మించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ‘‘దీదీ (మమతా బెనర్జీ), ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ దుష్పరిపాలనకు పాల్పడుతున్నారు. ఇలాంటి పాలన పీడ విరగడ కావాలంటే బీజేపీయే శరణ్యం. మేం గోవుల దొంగ రవాణాను కట్టడిచేశాం. బెంగాల్‌లోకి అక్రమ వలసలు కావాలా? ఈ వలసలను ఆపగలిగేది బీజేపీ మాత్రమే’’ అని అమిత్‌ షా బీర్భం జిల్లాలో మాట్లాడుతూ అన్నారు. ఈ మాటల్లో శాసనసభ ఎన్నికలలో ఎదురైన పరాజయం తాలుకు అవమానభారం బీజేపీని ఇప్పటికీ కుంగదీస్తుందనుకోవాలి. విచిత్రం ఏమిటంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు అవినీతిమయం అని ప్రచారంచేసే అమిత్‌షాకు తృణమూల్‌ను వదిలి బీజేపీ తీర్థం పుచ్చుకుని, ఇప్పుడు బెంగాల్‌ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సువేందు అధికారి అవినీతి మాత్రం కనిపించదు. దీదీ దాదాగిరీ చెలాయిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీరామ నవమి శోభా యాత్రల మీద దాడులు చేయించారని అమిత్‌ షా ఆరోపించారు. కానీ మొన్న శోభ యాత్రల సందర్భంగా కత్తులు కటార్లు, లాఠీలు పట్టుకుని ఊరేగింపులో పాల్గొని, అనుమతిలేని మార్గాల ద్వారా ఊరేగింపులు నిర్వహించి మైనారిటీ మతస్థులను రెచ్చగొట్టింది బీజేపీయేనన్న వాస్తవాన్ని జనం గ్రహించరని అమిత్‌ షా ఉద్దేశం అయి ఉండొచ్చు. పదే పదే ఒకే అబద్ధం చెప్తూ ఉంటే అదే కొన్నాళ్లకు నిజం అవుతుందని అమిత్‌ షా నమ్మకం. శ్రీరామనవమి సందర్భంగా మహారాష్ట్ర, గుజరాత్‌లో కూడా అల్లర్లు జరిగాయి. అక్కడి అధికారంలో ఉన్నది బీజేపీనే కదా. శారదా కుంభకోణంలో సువేందు అధికారికి సంబంధం ఉంది. నారదకేసులో ఆయన లంచం తీసుకుంటుండగా కెమెరాకు చిక్కారు. అలాంటి వ్యక్తి మమత దాదాగిరీకి, ఆమె మేనల్లుడి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనడానికి అమిత్‌షాకు నోరెలా వచ్చిందో. సువేందు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు కనక ఆయన పునీతుడని నమ్మించాలని అమిత్‌ షా ప్రయత్నిస్తున్నారు.
కర్నాటకలో ఒక బీజేపీ నాయకుడి ఇంట్లో వందల కోట్ల డబ్బు పట్టుబడ్తే బీజేపీ నోరు మెదపకపోవడానికి కారణం ఏమిటో! ఆ నాయకుడి మీద ఇంతవరకు ఏ చర్యా లేదు. ఇతర పార్టీల నాయకులను అవినీతి పరులుగా నిలబెట్టడానికి మోదీ సర్కారు తొక్కని అడ్డదారి లేదు. దుర్వినియోగం చేయని వ్యవస్థా లేదు. అమిత్‌షా దృష్టిలో బెంగాల్‌లో ఉన్న రుగ్మతలన్నింటికీ సర్వరోగ నివారిణి బీజేపీని గెలిపించడమేనట! నవ్వి పోదురు గాక షా కేమి సిగ్గు!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img