Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

న్యాయమూర్తుల భిన్న స్వరాలు

పది నెలలుగా సాగుతున్న రైతుల ఆందోళన విషయంలో సుప్రీంకోర్టు సోమవారం భిన్నస్వరం వినిపించిందేమోనన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటిదాకా రైతుల ఆందోళన శాంతియుత పద్ధతిలోనే సాగింది. రైతులు శాంతికి భంగం కలిగే రీతిలో ప్రవర్తించిన ఉదాహరణ ఒక్కటి కూడా లేదు. ఆదివారం లఖింపూర్‌ ఖేరీ సంఘటనలో వాహనాలు దగ్ధం కావడం వారి మీద జరిగిన క్రూరమైన దాడికి ప్రతిఘటనే తప్ప ఉద్యమం హింసా మార్గం అనుసరించడం కాదు. విచారణా క్రమంలో న్యాయ మూర్తులు చేసే వ్యాఖ్యలు భిన్న స్వరంలో ఉండడం గందరగోళానికి తావిస్తోంది. సోమవారం ఒక పిటిషన్‌ విచారణా క్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఖన్విల్కర్‌ రైతులు ఇంకా ఆందోళన కొనసాగించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది కదా, ఇప్పటికే వివాదాస్పద చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేశాం గదా, అలాంటప్పుడు రైతులు ఇంకా ఆందోళన కొనసాగించడం ఏమిటి అని న్యాయమూర్తి ఖన్విల్కర్‌ ప్రశ్నించారు. అవునవును సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నప్పుడు ఆందోళన కొనసాగించవలసిన అగత్యం లేదు అని అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ ఖవిల్కర్‌తో శ్రుతి కలిపారు. ఇదే సందర్భంలో ఖన్విల్కర్‌ లఖింపూర్‌ సఘటన జరిగితే ఎవరూ బాధ్యత తీసుకోలేదు అని కూడా వ్యాఖ్యానించారు. అక్రమానికి, దుర్మార్గానికి, దౌర్జన్యానికి పాల్పడిన వారు ముందుకొచ్చి బాధ్యత తీసుకునే ఉదంతం ఎప్పుడైనా ఉందా? ముఖ్యంగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డవారు అధికార పక్షానికి చెందిన వారైనప్పుడు సాక్ష్యాధారాలను మాయం చేయడానికి, బుకాయించడానికి, అసత్య ప్రచారానికే పాల్పడతారు తప్ప బాధ్యత తీసుకుంటారా? జంతర్‌ మంతర్‌లో నిరసన తెలియజేయడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఖన్విల్కర్‌ రైతులు ఆందోళన కొనసాగించడాన్ని ప్రశ్నించారు. ఆదివారం నాటి సంఘటన దురదృష్టకరం అని అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ కోర్టులోనే ప్రస్తావించారు. ఏ బాధ్యతా లేకపోతే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం లఖింపూర్‌ సంఘటనలో మరణించిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ. 45 లక్షలు, గాయపడిన వారికి పదేసి లక్షల పరిహారం ఎందుకు ప్రకటించింది. బాధితులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అన్న విషయం ఎన్నికలముంగిట అయినా ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి గుర్తొచ్చినందుకు సంతోషించాలిగా! ప్రస్తుత సోమవారం నాటి విచారణ సందర్భంగా లఖింపూర్‌ ఉదంతం కూడా ఈ బెంచి ఎదుట ప్రస్తావనకు వచ్చింది కనక ఆ సంఘటన పూర్వాపరాలు సుప్రీంకోర్టుకు తెలుసునను కోవాల్సిందే. బాధితులను పరామర్శించడానికి వెళ్లాలనుకున్న అనేకమంది ప్రతిపక్ష నాయకులను అడ్డుకున్నారు. కొందరినైతే నిర్బంధంలో ఉంచారు. లఖింపూర్‌ సంఘటన జరిగిన మూడో రోజు కూడా ప్రతిపక్ష నాయకులు పరామర్శించడానికి అనుమతి ఇవ్వలేదు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రైతులను రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన పర్యవసానంగానే ఆదివారం నాడు రైతులు నిరసన తెలియజేయాలను కున్నారు. కానీ అజయ్‌ మిశ్రా కుమారుడు అశీశ్‌ మిశ్రాకు చెందిన కొన్ని వాహనాలను రైతుల మీంచి పోనిచ్చారు. ఇది ఉద్దేశ పూర్వకమని ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదు. ఒత్తిడి తీవ్రంగా ఉన్నందువల్ల ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఉదంతంలో ఎఫ్‌.ఐ.ఆర్‌. కూడా నమోదు చేసింది. కాని మూడో రోజు కూడా కేంద్ర మంత్రి కుమారుడిని అరెస్టు చేయలేదు. దీన్ని ప్రశ్నించే హక్కు ఆందోళన చేస్తున్న రైతులకేకాదు ఎవరికైనా ఉంటుంది కదా! అలాంటప్పుడు న్యాయమూర్తి ఖన్విల్కర్‌ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి.
అక్కడితో ఆగకుండా అసలునిరసన తెలియజేయడం సంపూర్ణాధికారం అవునో కాదో తేలుస్తామని కూడా న్యాయమూర్తి ఖనివిల్కర్‌ అన్నారు. నిరసన ప్రజాస్వామ్య హక్కు అన్నది మన వ్యవస్థలో రూఢ అయిన అంశం. అనేకమంది న్యాయమూర్తులు తమ తీర్పుల్లోనూ ఈ వాస్తవాన్ని అంగీకరించారు. అయితే న్యాయస్థానాలు విభిన్నమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు, తీర్పూలు చెప్పిన ఉదంతాలూ ఉన్నాయి. అసలు సమ్మెలు, హర్తాళ్లు చేసే హక్కే లేదని తీర్పులు చెప్పిన హైకోర్టులున్నాయి. నిరసన శాంతియుతంగా కొనసాగినంతకాలం అది హక్కేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే అనుమాన రహితంగా చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. నిరసన ప్రజాస్వామ్యంలో విడదీయలేని అంశం అని అంగీకరించినట్టేగా! 2020 డిసెంబర్‌ 17న సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ.బోబ్డే రైతులు ఆందోళన కొనసాగించడం వారి హక్కు అని స్పష్టంగానే చెప్పారు. అయితే ఆ నిరసన హింసాత్మకం, దౌర్జన్యకరం కాకూడదన్నారు. ‘‘రైతుల నిరసన విషయంలో మేం జోక్యం చేసుకోం. నిరసన తెలియజేయడం ప్రాథమిక హక్కు. శాంతికి భంగం కలగకుండా ఈ హక్కుని వినియోగించుకోవచ్చు’’ అని న్యాయమూర్తి బోబ్డే అభిప్రాయ పడ్డారు. నిరసన ప్రాథమిక హక్కు అన్న అత్యున్నత న్యాయస్థానం భిన్న సందర్భాలలో విభిన్న రీతిలో మాట్లాడుతుందనుకోవాలా? రైతులు కచ్చితంగా ప్రశాంతంగానే పదినెలలుగా ఎండకు, వానకు, చలికి ఓర్చుకుని నిరసన తెలియజేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని హింసామార్గం పట్టించడానికి మొట్టమొదట ప్రయత్నించింది హర్యానా ప్రభుత్వం. హర్యానా-దిల్లీ సరిహద్దులో రోడ్లను తవ్వేసింది, రోడ్ల మీద మేకులు నాటింది హర్యానా ప్రభుత్వం. ఆ తరవాత అనేక చోట్ల రోడ్లమీద రైతులు వెళ్లకుండా గుంతలు తవ్వడం, ముళ్లకంచెలు ఏర్పాటు చేయడం దిల్లీ సరిహద్దు లంతటా కొనసాగింది. ప్రజాధనంతో నిర్మించిన రోడ్లను తవ్వేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది అని సుప్రీంకోర్టు ప్రశ్నిచిన సందర్భమే లేదు. రైతుల ఆందోళనవల్ల ఎక్కడా రాకపోకలకు అవాంతరం కలగలేదు. వారు రోడ్డుకు ఒక వేపున శిబిరాలు వేసుకుని గాంధేయ పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నారు. రోడ్లకు అడ్డంకులు ఏర్పరచింది ప్రభుత్వమే అన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి ఎవరూ ఎందుకు తీసుకు రాలేదు? రైతుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం ఎందుకు కనుగొనడం లేదు అని ఇదే సుప్రీంకోర్టు ఆగస్టు 23న ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పుడేమో వ్యవసాయ చట్టాల వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు నిరసనలు కొనసాగించడం ఏమిటి అని అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నిస్తున్నారు. ప్రధానులు, ముఖ్యమంత్రులు చట్టానికి అతీతులు కాదుగా! కొద్ది రోజులకిందటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ రాజకీయ నాయకులు, ఉన్నతాధికార వర్గం, పోలీసుల మధ్య ఉన్న లంకెను తప్పుపట్టారుగదా! పోలీసుల మీద వచ్చే ఫిర్యాదులను దర్యాప్తు చేయడానికి హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేద్దామను కున్నాను అని కూడా అన్నారుగా! న్యాయమూర్తి ఖన్విల్కర్‌్‌ చెప్పినట్టు నిరసన సంపూర్ణమైన హక్కు అవునో కాదో తేల్చే విషయానికి వస్తే నిరసనను ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కుగా గుర్తించినప్పుడు అది సంపూర్ణం అవునా కాదా అన్న చర్చకు దేనికో! అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం పెడదోవ పట్టించడానికే రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా పనిగట్టుకుని పిటిషన్లు వేయిస్తున్నారని సామాన్య మానవుడు కూడా గ్రహించగలిగినప్పుడు నిరసన సంపూర్ణమైన హక్కు అవునో కాదో తేల్చాల్సిన పనేముంది?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img